Thursday 25 April 2024

శ్రీ గరుడ పురాణము (159)

 


దేవతలు, యక్షులు, సిద్ధులు, నాగులు, ఆ బలాసురుని శరీరాన్ని ఆకాశమార్గంలో గొనిపోసాగినారు. ఆ యాత్రా వేగం వల్ల అతని శరీరం తనంతట తాను ముక్కలైపోయి పృథ్విపై అక్కడక్కడ పడినది.


సముద్రాల్లో, నదుల్లో, పర్వతాల్లో, వనాల్లో, మైదానాల్లో ఎక్కడెక్కడ రంచమాత్రమైనా (అత్యల్పపరిమాణం) ఆ మహాదాత శరీర శకలాలు పడ్డాయో, అక్కడక్కడ, రత్నాల గనులేర్పడ్డాయి. వాటి నుండి వెలికితీయబడిన రత్నాలకూ (వజ్రాలకూ) అద్భుత శక్తులున్నట్లు కనుగొనబడింది. రత్నాలలో వజ్రం, ముక్తిమణి, పద్మరాగం, మరకతం, ఇంద్రనీలం, వైదూర్యం, పుష్పరాగం, కర్కేతనం, పులకం, రుధిరం, స్పటికం, ప్రవాళం మొదలగు పేర్లతో ప్రత్యేక లక్షణాలతో ఇవి ప్రకాశిస్తున్నాయి. జ్ఞానపు ఆవలియొడ్డును చేరగలిగినంతగా తెలివిడి కలిగిన పారదర్శులు, విద్వజ్జనులు ఈ యీ రత్నాలకు ఆయా పేళ్ళను వాటి వాటి లక్షణాలను, కలిమి ఫలాలను కూలంకషంగా విశ్లేషించి వివేచించి పెట్టారు.


ఈ విద్వాంసులు ముందుగా రత్నం యొక్క ఆకారం, రంగు, గుణం, దోషం, పరీక్ష, మూల్యాదుల జ్ఞానాన్ని తత్సంబంధిత సర్వశాస్త్రాలనూ అధ్యయనం చేసి దాని ఆధారంగా శుభాశుభాలను నిర్ణయిస్తారు. ఈ అధ్యయనం అరకొరగా వుంటే అశుభాలు కలుగుతాయి. ఇక్కడొక విచిత్రమేమిటంటే తప్పుడు రత్నాన్ని ధరించినవారికే గాక ఆ రత్నాన్ని పెట్టుకొమ్మని సలహా ఇచ్చిన వారికి కూడ దుష్ఫలితాలు కలుగుతుంటాయి. కాబట్టి శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివిన తరువాతనే రత్నశాస్త్రులయ్యే సాహసం చేయాలి.


ఐశ్వర్యాన్ని కోరుకొనేవారు గాని ఇతరులు గాని బాగా పరీక్ష చేయబడిన, అత్యంత శుద్ధమైనవిగా ధ్రువీకరింపబడిన రత్నాలనే ధరించాలి. రాజులైతే అట్టి రత్నాలను సంగ్రహించి వుంచాలి. కొన్నింటిని కాలానుగుణంగా ధరించాలి.


ఇక రత్న ప్రభావాల విషయానికొస్తే సర్వ ప్రథమంగా మహాప్రభావశాలిగా చెప్పబడుతున్న వజ్రం గురించి తెలుసుకోవాలి.


Wednesday 24 April 2024

శ్రీ గరుడ పురాణము (158)

 


ప్రశ్నలు చెప్పేవారు అడిగేవారి నాడీ ప్రవాహస్థితిని గమనించాలి. తనకు శుభం కలుగుతుందా అశుభం కలుగుతుందా, లాభమొస్తుందా నష్టం వచ్చిపడుతుందా అని అడిగేవారికి అడుగుతున్నపుడు మధ్యమనాడి చలనంలో వుంటే అశుభమూ, నష్టమే కలుగుతాయి కాబట్టి జాగ్రత్తపడాలని చెప్పాలి. అదే, అదే సమయంలో ఇడా, పింగళనాడులు ప్రవహిస్తుంటే శుభం కలుగుతుందనీ, లాభమే వస్తుందనీ నిస్సందేహంగా చెప్పవచ్చును.


అలాగే అడిగేవారి గొంతుని బట్టి అది ఏ స్వరంలో వుందో ఆ స్వరం నాడీ మండలంలో ఎక్కడి నుండి వస్తోందో బాగా విచారించి సాధ్యాసాధ్యాలనూ, సిద్ధ్యసిద్ధులనూ పోల్చుకొనవచ్చును. దీనికి స్వరోదయ విజ్ఞానం తెలియాలి".


(అధ్యాయం - 67)


(గరుడ పురాణంలో ఇటువంటి విజ్ఞానమొకటి కలదనే విషయం మాత్రమే సూచింప బడింది. ఈ అంశంపై కృషి చేయదలచుకున్న వారు నాడీగ్రంథాలను అవలోకించాలి) 

రత్నాల పుట్టుక కథ వజ్ర పరీక్ష


“ప్రాచీన కాలంలో బలాసురుడను ఒక రాక్షసుడుండేవాడు. అతడు ఇంద్రాది దేవతలందరినీ యుద్ధంలో జయించి దేవతల అసమర్థతనీ తన త్రైలోక్యాధిపత్యాన్నీ లోకానికి చాటుకున్నాడు. బలాసురునికి ఇచ్చిన మాటను తప్పకూడదనే నియమం వుండేది. దేవతలు బ్రాహ్మణ వేషాలలో అతని వద్దకు పోయి తామొక యజ్ఞాన్ని తలపెట్టామనీ బలిపశువు కోసం ఆతనిని యాచించడానికి వచ్చామనీ బలాసురుని బతిమాలుకున్నారు. అతడు వెంటనే వారికి కావలసిన బలిని తాను సమకూర్చగలనని మాట ఇచ్చాడు. వెనువెంటనే దేవతలు “నువ్వే కావాలి' అన్నారు. ఈ విధంగా తన వాగ్వజ్రానికి తానే బలి అయిపోయాడు బలాసురుడు.


బలాసురుని బలిదానం ఉత్తినేపోలేదు. లోకకల్యాణం జరిగింది. సామాన్యులు చేసే యజ్ఞానికే కీటకసంహారం, కాలుష్య నివారణం, నగరశాంతి వంటి లోకమంగళకర కార్యాలు జరుగుతాయి కదా, అలాంటిది ఇంద్రాదులంతటివారు ఒక మహాదాతను బలిపశువుగానే చేసిన యజ్ఞానికి సామాన్య ఫలితముంటుందా! ఒక లోకకల్యాణమేమి, త్రైలోక్య కల్యాణమే జరిగినది. బలాసురుని శరీరము ఈ విశుద్ధ కర్మ వలన పరమ విశుద్ధ శరీరముగా పరిణతి చెందినది. సత్త్వగుణ సంపన్నమై విరాజిల్లినది. అందలి అన్ని అంగములూ రత్నబీజములై ప్రపంచమునే సంపన్నము గావించినవి.


Tuesday 23 April 2024

శ్రీ గరుడ పురాణము (157)

 


స్వరోదయ విజ్ఞానం


మనిషి గొంతు ద్వారా చేసే కొన్ని కొన్ని శబ్దాలు, పలికే స్వరాలు కూడా కొన్ని కొన్ని కార్యాల శుభాశుభ ఫలితాలను సూచింపగలవు.


మానవ శరీరంలో వేల సంఖ్యలో నాడులుంటాయి. ఇవి నాభి ప్రదేశానికి దిగువగా వుండే కందస్థాన లేదా మూలాధారము నుండి బయలుదేరి శరీరమందంతటా విస్తరించి వుంటాయి. డెబ్బది రెండు వేల నాడులు నాభి మధ్య భాగంలోనే చక్రాకారంలో నిలచి వుంటాయి. వీటిలో వామ, దక్షిణ, మధ్యమ నామకాలైన మూడు శ్రేష్ఠ నాడులుంటాయి. వీటినే క్రమంగా ఇడా, పింగళా, సుషుమ్లా నాడులని వ్యవహరిస్తారు. వీటిలో వామ నాడి చంద్రుని వలెనూ దక్షిణ నాడి సూర్యుని వలెనూ, మధ్యమ నాడి అగ్ని వలెనూ ఫలాలనిస్తాయి. ఇవి కాలరూపిణులు.


వామనాడి అమృత రూప. ఇది జగత్తుని బ్రతికించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీనిని 'ఆప్యాయితా' అంటారు. దక్షిణ నాడి తన రౌద్రగుణం వల్ల జగత్తుని మాడ్చేస్తుంది. అంటే శోషిల్లజేస్తుంది. శరీరంలో ఈ రెండు నాడులూ ఒకేసారి ప్రవహిస్తే అన్ని కార్యాలూ నాశనం కావచ్చు, మృత్యువే సంభవించవచ్చు.


యాత్రాదులకు బయలుదేరినప్పుడు వామనాడీ ప్రవాహమూ, ప్రవేశ సమయంలో దక్షిణ నాడీ ప్రవాహమూ శుభకారకములని గ్రహించాలి. చంద్రుని వలె జగత్తుకి కూడా ఆనందాన్ని కలిగించే కార్యాలను, సౌమ్యకార్యాలను ఇడా అనగా వామనాడి శ్వాసప్రవాహ కాలంలో జరపాలి. సూర్యసమాన, తేజస్వీ సమక్రూర కార్యాలను ప్రాణవాయువు పింగళ నాడి ద్వారా ప్రవహిస్తున్నప్పుడు చేపట్టాలి. యాత్రల్లో సర్వసామాన్య కార్యములందూ, విషాన్ని వదలగొట్ట వలసి వచ్చినపుడూ ఇడా నాడీ ప్రవాహం ప్రశస్తము. భోజనం, మైథునం, యుద్ధారంభాలలో పింగలనాడి సిద్ధిదాయకమవుతుంది. ఉచ్చాటన (మంత్ర) అభిచార కర్మలలోకూడా పింగల నాడి చలించాలి.


ముఖ్యంగా రాజులు మైథున, సంగ్రామ, భోజన సమయాల్లో శ్వాస కుడివైపున్న నాసికా రంధ్రంలోంచి బాగా ప్రవహిస్తోందో లేదో చూసుకోవాలి. అలాగే ఆయా అవసరాల్లో ఇడా నాడి ప్రవాహాన్నీ ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ వుండాలి. రెండు నాడులూ సమానంగా ప్రవహిస్తున్నపుడు ఏ ప్రముఖ కార్యాన్నీ మొదలెట్టకూడదు. విద్వాంసులైతే అటువంటి సమయాన్ని విషంతో సమానంగా పరిగణించి జాగ్రత్త పడాలి.


Monday 22 April 2024

శ్రీ గరుడ పురాణము (156)

 


హే శంకరదేవా! శాలగ్రామం, నైమిషం, పుష్కరం, గయ, నర్మద, చంద్రభాగం సరస్వతి, పురుషోత్తమ క్షేత్రం, మహాకాలుదధివసించియున్న ఉజ్జయని ఈ తీర్థాలన్నీ అన్నిపాపాలనూ నశింపచేసి భక్తి, ముక్తి ప్రదాయకాలవుతున్నాయి".*


శాలగ్రామోద్వారకం చ నైమిషు పుష్కరం గయా |

వారాణస్తీ ప్రయాగశ్చ కురుక్షేత్రం ద సూకరం | 

గంగా నర్మదా దైవ చంద్రభాగా సరస్వతీ | 

పురుషోత్తమో మహాకాల స్త్రీర్థాన్యేతాని శంకర ||

సర్వపాప హరాజ్యేన భక్తి ముక్తి ప్రదానివై |...


(ఆచార 66/6-8)


ఇక నామసార్థకాలైన మన అరవై సంవత్సరాల పేర్లను వినండి.


హే శంకరదేవా! శాలగ్రామం, నైమిషం, పుష్కరం, గయ, నర్మద, చంద్రభాగం సరస్వతి, పురుషోత్తమ క్షేత్రం, మహాకాలుదధివసించియున్న ఉజ్జయని ఈ తీర్థాలన్నీ అన్నిపాపాలనూ నశింపచేసి భక్తి, ముక్తి ప్రదాయకాలవుతున్నాయి",


ఇక నామసార్థకాలైన మన అరవై సంవత్సరాల పేర్లను వినండి.


1. ప్రభవ

2. విభవ

3. శుక్ల

4. ప్రమోదూత

5. ప్రజోత్పత్తి

6.అంగీరస

7. శ్రీముఖ

8. భావ

9. యువ

10. ధాత

11. ఈశ్వర

12. బహుధాన్య

13. ప్రమాది

14. విక్రమ

15. వృష

16. చిత్రభాను

17. స్వభాను

18. తారణ

19. పార్ధివ

20. వ్యయ

21. సర్వజిత్తు

22. సర్వధారి

23. విరోధి

24. వికృతి

25. ఖర

26. నందన

27. విజయ

28. జయ

29. మన్మథ

30. దుర్ముఖి

31. హేవిళంబి

32. విళంబి

33. వికారి

34. శార్వరి

35. ప్లవ

36. శుభకృతు

37. శోభకృతు

38. క్రోధి

39. విశ్వావసు

40. పరాభవ

41. ప్లవంగ

42. కీలక

43. సౌమ్య

44. సాధారణ

45. విరోధికృతు

46. పరీధావి

47. ప్రమాదీచ

48. ఆనంద

49. రాక్షస

50. నల

51. పింగళ

52. కాలయుక్త

53. సిద్ధార్ధి

54. రౌద్రి

55. దుర్మతి

56. దుందుభి

57. రుధిరోద్గారి

58. రక్తాక్షి

59. క్రోధన

60. అక్షయ


(ఆధ్యాయం - 60)


Sunday 21 April 2024

శ్రీ గరుడ పురాణము (155)

 


విస్తీర్ణ, పుష్టియుక్త, గంభీర, విశాల, దక్షిణావర్త, నాభీ, మధ్యభాగంలో త్రివళులూ. ఉత్తమనారీ లక్షణాలు, రోమరహితంగా, విశాలంగా నిండుగా, పుష్టిగా, చిక్కగా, ఒకదాని కొకటి సర్వసమానంగా, గట్టిగా వుండే స్తనాలు ఉత్తమ జాతి స్త్రీకుంటాయి. గ్రీవం దోమరహితంగా, ఓష్టం, అధరం అరుణకాంతులమయంగా ముఖం గుంద్రంగా, పుష్టిగా, దంతాలు కుండ పుష్పసమంగా, గొంతు కోయిల గొంతులా, ముఖం దాక్షిణ్యభావ యుక్తంగా, కన్నులు కరుణ రసాన్ని చిప్పిలుతూ వుండే స్త్రీ సర్వజన పూజితకాగలదు. ఇతరుల సుఖాన్ని గుణించే నిరంతరం ఆలోచిస్తూ సాధింపులూ వేధింపులూ ఎలా చేయాలో, కనీసం, తెలియని స్త్రీని అంతా గౌరవిస్తారు.


నీలికమలాల వలె కళ్ళు, బాలచంద్రుని వలె వంపు తిరిగిన కనుబొమలు, అర్ధచంద్రాకారంలో నుదురు గల స్త్రీకి, సర్వసంపదలూ ముంగిట్లో వచ్చి వాలతాయి. సుందరంగా, సరిసమానంగా పుష్టిగా వుండే చెప్పులు శుభలక్షణాలు, దట్టంగా వుండే కనుబొమ్మలూ, ఎండినట్లుండే చెవులూ శుభలక్షణాలు కావు, నున్నగా, మృదువుగా, మెత్తగా, నల్లగా, ఉంగరాలు తిరిగేజుట్టు ప్రశస్త లక్షణం. అరచేతిలో గాని, అరికాలిలో గాని అశ్వ, హస్తి, శ్రీ. వృక్ష, యూప, బాణ యన, తోమర, ధ్వజ, దామర, హాద, పర్వత, కుండల, వేది, శంఖ, చక్ర, పద్మ, స్వస్తిక, రథ, అంకుశాది గుర్తులలో కొన్ని వున్న స్త్రీలు రాజపత్నులౌతారు*  


* సాముద్రిక శాస్త్రంలో సంభోగ శృంగారానికి సంబన అంగాలణ పొదల లక్షణాలూ, స్నేవాని ద్రవాల వాసనల ద్వారా నిర్ధారింపబడే శుభాశుభాది లక్షణాలూ కూడా చెప్పబడ్డాయి. వీటిని ఇవ్వడం వల్లన అపార్ధాలెక్కువౌతాయనే భయం పల్ల ఈ గ్రంథంలో ఇవ్వబడుట లేదు.


(అధ్యాయము - 65)

చక్రాంకిత శాలగ్రామ శిలలు తీర్ధమాహాత్మ్యాలు అరవై సంవత్సరాల పేర్లు


దేవతలారా! చక్రాంకిత తాలగ్రామ శిలని పూజిస్తే సర్వశుభాలూ, సౌఖ్యాలూ, కలుగుతాయి.


శాలగ్రామంలో చక్రాల సంఖ్య     దానిపేరు

ఓఖటి                   సుదర్శన

రెండు                   లక్ష్మీనారాయన

మూడు                   అచ్యుత

నాలుగు                  చతుర్భుజ

అయిదు                   వాసుదేవ

ఆరు                   ప్రద్యుమ్న

ఏడు                     సంకర్షణ

ఎనిమిది                  పురుషోత్తమ

తొమ్మిది                  నవవ్యూహ

పది                          దశాత్మక

పదకొండు                     అనిరుద్ధ

పన్నెండు                         ద్వాదశాత్మక


పన్నెండు కన్న నెక్కువగా ఎన్ని చక్రాలున్నా ఆ శిలామూర్తి నామము అనంత భగవానుడే. సుందరమైన ఈ శాలగ్రామాలను పూజించినవారికి కోరికలన్నీ తీరుతాయి.


శాలగ్రామ, ద్వారకాశింల సంగమముండే చోట ముక్తి కూడా వుంటుందని ఇలా చెప్పబడింది.


శాలగ్రామ శిలాయత్ర దేవోద్వారవతీ భవః ॥

ఉభయోః సంగమోయత్ర తత్ర ముక్తిరసంశయః ॥


(ఆచార 66/5)



Saturday 20 April 2024

శ్రీ గరుడ పురాణము (154)

 


నాభి, స్వరం స్వభావం - ఈ మూడూ గంభీరంగా వుండాలి. లలాటం, ముఖం, వక్షస్థలం విశాలంగా వుండాలి. నేత్రాలు, కక్షలు, నాసిక, మెడ, తల, దీర్ఘంగా ఎత్తుగా వుండాలి. జంఘలు, గొంతు, లింగము, పిరుదులు పొట్టిగావుండాలి. నేత్రాంతాలు అనగా కనుకొలకులు, అరికాళ్ళు, నాలుక, పెదవులు - ఈ యేడూ రక్తవర్ణంలో వుండాలి. దంతాలు, వేళ్ళు, పర్వాలు, గోళ్ళు, కేశాలు - ఈ అయిదూ పొడవుగా వుండాలి. అలాగే స్తనాల మధ్యభాగమూ, రెండు భుజాలూ, దంతాలూ, నేత్రాలూ, నాసికా, దీర్ఘంగా వుండడం కూడా శుభలక్షణాలే.” 


స్త్రీల ప్రత్యేక లక్షణాలను సముద్రుడీ* విధంగా తెలిపాడని విష్ణుభగవానుడూ సూతమహర్షీ ప్రవచింపసాగారు. (* ఈ శాస్త్రం సముద్రునిచే కొంత వ్రాయబడి మరింత క్రోడీకరింపబడి ఆయన చేతనే ప్రపంచానికి ప్రసాదింపబడిది కాబట్టి ఆయన పేరిటనే సాముద్రికశాస్త్రంగా ప్రసిద్ధి గాంచింది. అయితే దీనిని ప్రారంభించినవారు మాత్రం 

శివపుత్రుడైన కార్తికేయుడు. ఈ మహావిషయం భవిష్య పురాణంలో వివరంగా చెప్పబడింది.) 


"రెండు పాదాలూ నున్నగా, సమాన తలాలతో, రాగి రంగులో మెరుస్తూ వుండే గోళ్ళతో, చిక్కని వేళ్ళతో, ఉన్నత అగ్రభాగాలతో నుండుట మహారాజ్ఞీ లక్షణము. ఈ లక్షణమున్న స్త్రీని పెళ్ళాడినవాడు తప్పనిసరిగా రాజవుతాడు.


గూఢమైన చీలమండలూ, పద్మపత్ర సమానాలైన అరికాళ్లూ శుభలక్షణాలు. చెమట పట్టని అరికాళ్ళు శుభసూచకాలు. వాటిలో మీన, అంకుశ, ధ్వజ, వజ్ర, పద్మ, హల చిహ్నాలున్నామె రాణి అవుతుంది. రోమరహిత, సుందరశిరావిహీన, కోలజంఘలున్న స్త్రీ శుభలక్షణం.


Friday 19 April 2024

శ్రీ గరుడ పురాణము (153)



నుదురు అర్ధచంద్రాకారంలో వుంటే చాలా మంచిది. అది తరగని ధన సంపదని సూచిస్తుంది. మస్తకం ముత్యంలాగా నుదురు విశాలంగా మెరుస్తూ వుంటే ఆచార్య పీఠం లభిస్తుంది. నుదుటిపై రక్తనాళాలు కనిపించరాదు. అది పాపకర్ముల లక్షణము. అస్పష్టంగా కనిపిస్తూ ఉన్నతంగా ఉండే నాడులతో స్వస్తిక ముద్రతో ఎత్తయిన, సుందరమైన లలాటం గలవారు ధనవంతులవుతారు. కిందికీ, లోనికీ వంగిన నుదురున్నవారు చెఱసాల పాలౌతారు.


ఎవరైనా నవ్వినపుడు కంపనం లేకుండా నవ్వితే వారిని శ్రేష్టులుగా గౌరవించవచ్చు. కన్నులు మూసుకొని నవ్వేవారిలో పాపాత్ములెక్కువ. మాటిమాటికీ అనవసరంగా నవ్వేవారిలో దుష్టులెక్కువ.


నూరేళ్ళాయుర్దాయం గలవారి మస్తకంపై మూడు రేఖలుంటాయి. నాలుగు రేఖలు రాజలక్షణం, ఆయుర్దాయం తొంబదియైదు. రేఖారహితమైన లలాటమున్నవారు తొంబది యేళ్ళు జీవిస్తారు. నుదుటి నిండా ముక్కలైన రేఖలున్నవారిలో వ్యభచరించే వారెక్కువ. నుదుటిపై వుండే రేఖలు చివరికంటా పోయి కేశాలను తగులుతుంటే, ఆ విధమైన రేఖలున్నవారు ఎనభై యేళ్ళు బ్రతుకుతారు. అయిదు, ఆరు లేదా ఏడు రేఖలున్నవారు యాభై యేళ్ళే జీవిస్తారు. ఏడు కన్న నెక్కువ గీతలున్న వారిలో నలభై సంవత్సరాలు బతికే వారే ఎక్కువ.


బల్లపరుపుగా, అణగినట్లుగా తల వుండే వారికి పితృవియోగం చాలా వేగంగా సంభవిస్తుంది. కుండ ఆకారంలో తల గలవారికి పాపం వైపే మనసు వెళుతుంటుంది. ఒక కన్నంలో నుంచి ఒక తలవెండ్రుకే మొలవడం మంచిది. తద్విపరీతం ధనక్షయకరం. అతిశయరూక్షత - అనగా మొరటుదనం ఏ అంగంలోనూ మంచిది కాదు. మరీ పేలవంగా, రక్తమాంసరహితంగా వుండే అంగాలన్నీ అశుభసూచకాలే. మానవశరీరంలో మూడంగాలు విశాలంగా, మరో మూడు గంభీరంగా ఒక అయిదు పొడవుగా చిన్నగా, ఆరు ఎత్తుగా నాలుగు పొట్టిగా, మరొకయేడు రక్తవర్ణంలో వుండడం శుభలక్షణాలు. ఈ లక్షణాలన్నీ కలవారు మహారాజులవుతారు.