Sunday 1 April 2018

హిందూ ధర్మం - 262 (కర్మసిద్ధాంతం- 2)



క్రియతే అనేన ఇతి కర్మ - చేయబడేది ఏదైనా కర్మయే. కర్మ అనేది సంస్కృత పదం. అది 'కృ' అనే ధాతువు నుంచి వచ్చింది. కర్మ అంటే మానసికంగా కానీ, శారీరికంగా కాని చేసినది. పూర్తయిన పనిని కర్మ అని, జరుగుతున్న పనిని క్రియ అని అంటారు.

అలాగే వ్యాకరణ శాస్త్రం ఏం చెప్తుందంటే కర్మకు సంబంధించిన విషయంలో మూడు విభాగాలు ఉంటాయి. కర్త, కర్మ, క్రియ. కర్త అంటే చేయువాడు, క్రియ అంటే చేయబడుతున్న కార్యం, కర్మ అంటే చేయబడిన కర్మ యొక్క ఫలం. కర్త, క్రియ లేకపోతే కర్మ ఉండదు.

నిరాలంబోపనిషత్ 22 వ శ్లోకం కర్మను ఇలా నిర్వచించింది. నేను చేస్తున్నాను అనే భావనతో, ఆథ్యాత్మ నిష్ఠగా ఇంద్రియాల చేత, అంటే శబ్ద (వినడం), స్పర్శ (తాకడం), రూప (చూడటం), రస (రుచి చూడతం), గంధాలతో (వాసన చూడటం) చేసే వ్యాపరమే కర్మ. మనస్సు కూడా ఒక ఇంద్రియమే కనుక మనస్సుతో చేసేది కూడా కర్మయే అవుతుంది.
అలాగే కర్మలను మూడు రకాలు చేస్తుంటాము. కాయిక (శరీరంతో చేసేవి), వాచిక (మాటల ద్వారా), మానసిక (మనస్సుతో) చేసే కర్మలు. ఈ మనస్సు, వక్కు, కాయాలనే త్రికరణములు అంటారు. 
త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును, లోకం మెచ్చును అని అన్నమాచార్యుల కిర్తన కూడా ఉంది.

కర్మకు కులమతాలు, ప్రాంత, లింగ భేదాలు లేవు. ఈ లోకంలో అందరు కర్మలు చేస్తారు, ఫలం అనుభవిస్తారు. ఇది మన కళ్లకు కనిపిస్తూనే ఉంది.
అలాగే కర్మలో మూడు విభాగాలు ఉంటాయి. ఒకటి చేయడం. ఇది బాహ్య స్వరూపం లేదా దృశ్య స్వరూపం. రెండు దాచడం. ఇది అంతర్గత స్వరూపం లేదా అదృశ్య స్వరూపం. మూడు సరైన సమయంలో దానికి సరైన ఫలితాన్ని ఇవ్వడం. ఇది కర్మ ఫలానుభవం అంటే చేసిన కర్మకు ఫలితాన్ని అనుభవించడం.

న ఇ కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్
కార్యతే వ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః
భగవద్గీత - 3వ అధ్యాయంలోని 5 వ శ్లోకం.

ఈ ప్రపంచంలోని ఏ మనిషి కూడా ఏ కాలంలోనైనా క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేడు. దీనిలో ఎలాంటి సందేహంలేదు. ఎందుకంటే మనుష్యులంతా ప్రకృతికి చెందిన త్రిగుణాలకు లోబడి కర్మలను చేయాల్సి ఉంటుంది అంటారు కృష్ణ పరమాత్మ.

కర్మ అంటే పని లేదా కార్యము లేదా క్రియ అని చెప్పేది సులభమైన అర్ధం. కానీ కార్యకారణ నియతితో నడిచే ఈ విశ్వగతికి కూడా కర్మ అనే పదం అన్వయమవుతుంది. కార్యం అంటే ఫలము/ ప్రయోజనము (Effect). కారణమంటే ఆ ఫలానికి గల హేతువు/ కారణము (Cause). విశ్వచైతన్యం ఈ విశ్వాన్ని ఈ కర్మ సిద్ధాంతం ఆధారంగానే నడిపిస్తుంది.

To be continued ......

No comments:

Post a Comment