Sunday 12 November 2017

హిందూ ధర్మం - 254 (సృష్టి - మతాల మధ్య వ్యత్యాసాలు)

అట్లాగే ఈ ఆడాం- ఈవ్ కథను గమనిస్తే, గాడ్ మొదట ఇద్దరినే సృష్టించాడని ఉంటుంది, కానీ మన ధర్మం ప్రకారం సృష్ట్యాదిలోనే అనేకమంది స్త్రీపురుషులు ఉద్భవించారు, వాళ్ళంతా పరమపుణ్యాత్ములు- ఋషులు, ఋషిపత్నులు. 

ఇద్దరు వ్యక్తుల నుంచి పుట్టిన సంతతి మధ్య సోదరసోదరి బంధం ఉంటుంది. అందుకే ఆ మతాలు ఈ కోణం నుంచే సర్వమానవ సౌభాతృత్వం గురించి చెప్తాయి. అంటే ప్రపంచంలోని మానవులంతా ఒకే తల్లిదండ్రుల నుంచి పుట్టారు కనుక అందరు అన్నదమ్ములు, అక్కచెళ్ళెల్లు అంటాయి. కానీ అందులో కూడా బైబిల్ కొందరిని యెహోవా కు ప్రియమన వారికి, కొన్ని జాతులను బానిసలుగా వర్గీకరిస్తుంది. అబ్రహం మతాలన్నీ ఈ అంశం బోధించిన, అవిశ్వాసులను (అనగా అన్యమతస్థులు) వారితో మతస్థులతో సమానంగా అంగీకరించవు. వారికి నరకం ప్రాప్తిస్తుందని నిర్ణయం చేశాయి. సనాతన ధర్మంలో సర్వమానవ మాత్రమే కాదు, సర్వజీవ సౌభాతృత్వం, ఆత్మవత్ సర్వభూతేషు గురించి బోధిస్తుంది, ఇంకో అడుగు ముందుకేసి, అందరిలో అంతర్యామిగా ఉన్నది ఒకటే తత్త్వం, భౌతికమైన రూపాలు వేరైనా, సారం ఒకటే. అంతా ఒకటే, ఏ బేధం లేదని వివరిస్తుంది. సమదృష్టి లభించేవరకు మోక్షం సిద్ధించదని చెబుతుంది. సత్కర్మ చేసేవారు నాస్తికులైనా, వారు స్వర్గానికి  వెళతారని, పాపకర్మ చేసేవారు ఆస్తీకులైనా వారికి నరకం తప్పదని వివరిస్తుంది. అన్యమతాలు స్వర్గనరకాల వరకే ఆగిపోతే, సనాతన ధర్మం స్వర్గనరకాలకు అతీతమైన పరపదం గురించి మాట్లాడుతుంది. వారికి సృష్టి కారకుడైన గాడ్, దీనికి దూరంగా స్వర్గంలో ఉంటాడు. (ఈ సృష్టి ఎంతవరకు ఉందని నేటి సైన్స్ ను అడిగితే, అది ఇంకా సమాధానం కొసం వెతుకుతూనే ఉంది. అంటే ఆయన దీనికి ఎంతో దూరంలో ఎక్కడో ఉన్నాడని వాళ్ళ నమ్మకం) హిందూధర్మంలో సృష్టికారకుడైన భగవానుడే ఈ సృష్టి రూపంలో వ్యక్తమవుతున్నాడని, ఆయనే సృష్టి అని, అందులో జీవరాశి అని, ఆయన వ్యాపించి లేని చోటు లేదని వివరిస్తుంది. 

ఆడాము- ఈవ్ చేసిన పాపం కారణంగా మానవజాతి పుట్టింది కనుక మానవులంతా పాపులని ఆ మతాల తీర్మానం. కానీ వారికి పుణ్యం అనే మాట లేదు. పుణ్యం చేయడమన్నది ఉండదు. సనాతనధర్మం విషయానికి వస్తే, మొదట ఉద్భవించిన స్త్రీపురుషులంతా ఇంతకుపూర్వం కల్పాల్లో ఎంతో పుణ్యం చేసుకున్నారు. అందుకే వారికి ఈ కల్పంలో మొదటిగా జన్మించే అవకాశం లభించింది. వారికి పుట్టిన సంతానం కూడా పుణ్యాత్ములే అవుతారు. అందుకే మనకు పుణ్యం కొద్ది పురుషుడు, ఫలం కొద్ది పిల్లలు అనే నానుడి కూడా వాడుకలో ఉంది. అక్కడ పాపం చేస్తే పిల్లలు పుడతారు, ఇక్కడ పుణ్యం చేస్తే పుడతారు. సనాతనధర్మంలో- జీవుడు సహజగుణమైన దైవత్వాన్ని తెలుసుకోకుండా ఏది అడ్డుపడుతోందో అది పాపం. కానీ హైందవేతర మాతల్లో అలా కాదు, అది ఎవరో చేసిన పని వలన సమస్త మానవజాతికి సంక్రమించిన శాపం.కాబట్టి హైందవులు చెప్పే పాపం, క్రైస్తవ మరియు మహమ్మదీయులు చెప్పే పాపం ఒక్కటి కాదు. అవి తత్త్వతః వేర్వేరు. ఏ మాత్రం వాటి మధ్య పోలిక లేదు. కాబట్టి పైపైన పదాలు పట్టుకుని, అన్ని మతాలు ఒక్కటేనని తేల్చడం మూర్ఖపు చర్య అవుతుందే కానీ ఎంతమాత్రం వివేకవంతుల లక్షణం కాదు. మనకు వారికి మధ్య వ్యత్యాసాలను ప్రస్పుటంగా వెళ్ళడిస్తూనే, మనం అన్ని మతాలను గౌరవించాలి, అది పరస్పర గౌరవంతో కూడినది ఉండాలి. వాళ్ళేమీ చేసిన మనం గౌరవిస్తూనే ఉంటాము అని చెప్పడం కాదు, గౌరవం వారు ఇస్తేనే, మనం తిరిగి ఇచ్చే విధంగా ఉండాలి. అప్పుడే సామరస్యం ఉంటుంది. 

సైన్సు ప్రకారం ఒకే మాతృగర్భంలో నుంచి పుట్టిన వారి డిఎన్ఏ ఒకే రకంగా ఉంటుంది. ఒకే విధమైన డిఎన్ఏ ఉన్నవారు వివాహం చేసుకుంటే, పుట్టేవాళ్ళందరూ అంగవైకల్యంతో పుడతారు, కొన్ని తరాల తర్వాత సంతతి కలగదు లేదా వైకల్యాలు తీవ్రమవుతాయి. అందుకే భారతీయ సంప్రదాయంలో సోదరీసోదరుల మధ్య, అలాగే మేనరికపు వివాహాలు కూడా నిషిద్ధం. ఇట్లాంటి చర్యల వల్ల డిఎన్ఏ చెడిపోతుందని, అంగవైకల్యం, మానసిక వైకల్యం ఏర్పడతాయని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు. ఇక విషయంలోకి వస్తే, మనమంతా ఋషుల సంతానమే. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, మాల, మాదిగ, గిరిజన అనే బేధం లేదు, చివరకు మతబేధం కూడా లేదు. అందరూ ఋషులసంతానమే. అందరు పుణ్యాత్ములే. అందుకనే ఋషులు మానవజాతిని ఉద్దేశ్యించి చెప్తూ, శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః - వినండి ఓ అమృతపుత్రులారా! అంటారు. పుట్టిన ప్రతి వాడు పరమాత్మ ప్రతిరూపమే అంటుంది హైందవ ధర్మశాస్త్రం. 

దీని గురించి స్వామి వివేకానందా విశ్వమత మహాసభలో మాట్లాడుతూ, "దివ్యలోక నివాసులైన ఓ అమృతపుత్రులారా, ఆలకించండి: అజ్ఞానంధకారానికి ఆవల ప్రకాశించే పరమ పురుషుణ్ణి కనుగొన్నాను. అతణ్ణి కనుగొనటంవల్ల మీరు మృత్యువు నుంచి తరిస్తారు. వేరే మార్గంలేదు. అమృతపుత్రులు - ఆహా! ఏం మధురవాక్కు! ఏం ఆశాజనకదివ్య నామం! సోదరులారా, ఈ పేరులో - అమృతపుత్రులనే పేరులో - మిమ్మల్ని పిలువనివ్వండి - నిజంగా హైందవులు మిమ్మల్ని పాపులనటానికి నిరాకరిస్తారు. మీరు భగవంతుడి బిడ్డలు, అమృతసంతానం, పావనులు, పరిపూర్ణులు. మీరు భూదేవతలు. - పాపులా? మానవుణ్ణి పాపి అనటమే మహాపాతకం. మానవస్వభావానికి అపకీర్తి, దూషణం. ఓ సింహాల్లారా, బయలుదేరండి, గొర్రలమని భ్రాంతి విడనాడండి. మీరు అమృతజీవులు, ముక్తాత్మలు, శాశ్వాతనందమయులు. జడప్రకృతి కాదు మీరు. శరీరులు కారు; ప్రకృతి మీ దాసురాలు; అంతేకాని ప్రకృతికి మీరు దాసులు కారు" అన్నారు. 

To be continued ...............

No comments:

Post a Comment