Monday 30 October 2017

శివయోగసాధన- శివ జ్ఞానం- స్వామి శివానంద

శివ జ్ఞానం


శివుని పవిత్రనామాల జపము మరియు ధ్యానము మిమ్మల్ని అన్ని రకాల పాపాలు నుంచి విముక్తుడిని చేసి శివజ్ఞానం లేదా పరమానందం మరియు అమరత్వం దిశగా నడిపిస్తాయి. శివనామమే అన్ని మంత్రాల సారం.

శివుడి 60 రకాలుగా వ్యక్తమయ్యాడు. వృషభారూఢ, హరి-హర, నటరాజ, భైరవ, దక్షిణామూర్తి, అర్ధనారీశ్వర, భిక్షాటనమూర్తి, సోమశేఖరమూర్తి, ఊర్ధ్వనటనమూర్తి, కాలసంహార మూర్తి, జలంధర మూర్తి, శురసంహార మూర్తి, లింగోద్భవమూర్తి అనేవి ఆయన రూపాలు.

శివ అంటే సనాతనమైన ఆనందం, శుభం, పరమ-మంగళం. ఓం మరియు శివుడు ఒకరే. శాంతం శివం అద్వైతం అంటుంది మాండూక్య ఉపనిషత్తు. అన్యకులస్థుడు లేదా వెలివేయబడ్డవాడు కూడా శివుని ధ్యానించవచ్చు.

అగ్ని, గాయత్రి మంత్రము మరియు సూర్యునిలో శివుడు వ్యక్తమవుతున్నాడు. మీరు గాయత్రి మంత్రాన్ని జపించినప్పుడు లేదా అగ్నిని మరియు సూర్యభగవానుని పూజించినప్పుడు, మీరు శివుని యందు ధ్యానం చేయాలి.

పంచాక్షరి జపం మరియు శివుని యందు ధ్యానం అనేవి ప్రత్యేకంగా ప్రదోషకాలంలో లేదా సూర్యాస్తమాయనికి ముందు చేయాలి. ప్రదోషం అనేది పూర్ణిమ లేదా అమావాస్య తర్వాత వచ్చే పదమూడవ రోజు, దాన్నే మహాప్రదోషం అని కూడా అంటారు. ఈ సమయంలో దేవతలు శివాలయాన్ని సందర్శించి స్వామిని పూజిస్తారు. మహాప్రదోషసమయంలో మీరు ఆలయాన్ని సందర్శిస్తే, దేవతలను కూడా పూజించవచ్చు. మహాప్రదోషం రోజుల్లో శివభక్తులు సంపూర్ణ ఉపవాసం ఉంటారు.

శివభక్తుడు నుదుటన మరియు శరీరానికి విభూతి రాసుకోవాలి. అతడు రుద్రాక్షమాల ధరించాలి. అతడు బిల్వవృక్షం యొక్క ఆకులతో శివలింగాన్ని పూజించాలి. ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని అతడు జపం మరియు ధ్యానం చేయాలి. వీటిలో చెప్పిన ప్రతి కర్మ చేత శివుడు ప్రసన్నుడవుతాడు. విభూతి లేదా భస్మం అనేది అత్యంత పవిత్రమైనది. అది సాక్షాత్తు శివుడు ధరిస్తాడు. రుద్రాక్షమాలలో ఉండే రుద్రాక్ష శివుని నుదుటన ఉన్న మూడవకన్నును సూచిస్తుంది. సంపదలకు అధిష్టాత్రీ అయిన లక్ష్మీదేవి నివసించే పంచస్థానాల్లో బిల్వ పత్రాలు ఒకటి.

జీవులకు బంధాన్ని, ముక్తిని కలిగించేది శివుడే. జీవుల తత్త్వమైన దైవత్వాన్ని అనుభూతిలో తెలియపరిచేవాడు శివుడే. మాయను శరీరం, ఇంద్రియాలు మరియు జగత్తుగా చేసి, జీవులను అందులోకి త్రోసినవాడు శివుడు. అహం (నేను) భావాన్ని కలిగించింది ఆయనే. వారిని కర్మలో బంధించి, వారి పాప, పుణ్య కర్మానుసారం ఆనందం మరియు దుఃఖాన్ని అనుభవించేలా చేస్తున్నది ఆయనే. ఇది జీవులు బంధంలో ఉండే స్థితి.

క్రమంగా వారిని అహంకారం, కర్మ మరియు మాయా పాశాల నుంచి విడిపించి, శివునిగా వారిని ప్రకాశిమపజేయువాడు శివుడే. ఇది స్వేచ్ఛ లేదా మోక్షం అనే స్థితి. శివుని అనుగ్రహం చేత మాత్రమే, వాళ్ళు అంతిమ స్థితి అయిన ముక్తిని చేరుకుంటారు.


అనవ, కర్మ, మాయ అనే మూడు మాలిన్యాల ప్రభావంలో ఉన్నప్పుడు జీవులకు స్వాతంత్రం ఉండదు. వారి అల్పజ్ఞానం మాత్రమే ఉంటుంది. 

శివుని అనుగ్రహం లభించడానికి ముందు జీవుడు తన తత్త్వం గురించి, శివునకు తనతో గల సమబంధం గురించి తెలుసుకోవాలి. జీవం లేదా ప్రాణం అనేది శరీరంలో ఉంది. శివుడు ప్రాణంలో ఉన్నాడు. ఆయన ప్రాణాలకే ప్రాణం, కానీ ప్రాణాలు మరియు శరీరం నుంచి వేరైనవాడు కూడా. శరీరంలో ప్రాణం లేకపోతే, శరీరం శవం అవుతుంది. అది ఎలాంటి కర్మ చేయలేదు. శివుడే ఈ శరీరానికి, ప్రాణానికి, జీవునకు ఆధారం. శివుడు లేకుండా జీవుడు ఏ కర్మ చేయలేడు. శివుడే బుద్ధిని ప్రచోదనం చేస్తాడు. ఎలాగైతే కంటికి చూసే శక్తి ఉన్నా, సూర్యకాంతి లేకుండా కన్ను చూడలేదో, అలానే శివుని కాంతి లేనిదే బుద్ధి ప్రకాశించదు.

చర్య, క్రియ, యోగం మరియు జ్ఞానం అనే నాలుగు సాధనలు మోక్షానికి నాలుగు మెట్లు. అవి మొగ్గ, పువ్వు, కాయ, పండు వంటివి. 

శివుడు క్రమంగా జీవాత్మలను అహంభావన, కర్మ మరియు మాయ నుంచి విముక్తుడిని చేస్తాడు. జీవులు ఇంద్రియసుఖాల పట్ల క్రమంగా విముఖత చెందుతాయి. సుఖదుఃఖాల్లో సమతుల్యతను పొందుతాయి. ఈశ్వరానుగ్రహంతో జననమరణాలకు కర్మయే కారణం అని అర్దం చేసుకుంటాయి. ఈశ్వరుని కోసం కర్మలు చేయడం, ఆయన భక్తులకు సేవ చేయడం ప్రారంభించి, మనఃశుద్ధిని పొందుతాయి. ఆత్మ లేదా శివుడు, శరీరం, ఇంద్రియాలు మరియు మనస్సు నుంచి వేరని, మనస్సుకు, వాక్కుకు శివుడు అతీతుడని అర్దం చేసుకుంటాయి. వారికి ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రం ప్రాముఖ్యత తెలుసుకుని ఉపదేశము పొంది, శివుని ధ్యానిస్తాయి.

వారు శివయోగాన్ని సాధన చేస్తారు. వారి హృదయాలు కరిగిపోతాయి. ద్రష్ట, దృష్టి మరియు దృశ్యం మాయమవుతాయి. ఇంద్రియ, మనస్సు మరియు బుద్ధికి సంబంధించిన చర్యలు ఆగిపోతాయి. వారి హృదయంలో ఉద్భవించిన దివ్యప్రేమ అనే ప్రవాహంతో శివుడిని అభిషేకించి, వారి హృదయాన్ని శివునకు పుష్పంగా అర్పిస్తాయి.


శివుని ఢమరు శబ్దాన్ని విని, శబ్దమార్గంలో ముందుకు నడిచి, చిదాకాశంలో నటరాజును దర్శించి, శివానందం అనే సముద్రంలో మునిగిపోతాయి. కర్పూరం అగ్నిలో కరిగినట్లుగా, వారు శివునితో ఏకమవుతారు.

- స్వామి శివానంద 

Friday 27 October 2017

శివయోగసాధన- శివమానస పూజ & పంచాక్షరి మంత్రలేఖనం

శివమానస పూజ
మానసపూజ అంటే మానసికంగా పూజించడం. పువ్వులు, చందనం మొదలైనవాటితో చేసే బాహ్యపూజ కంటే మానసపూజ చాలా ప్రభావంతమైనది. మానసపూజ చేసినప్పుడు మీకు మరింత ఏకాగ్రత ఉంటుంది.

మానసికంగా స్వామిని వజ్రాలు, ముత్యాలు, పచ్చలు మొదలనవి పొదిగిన సింహాసనంపై కూర్చోబెట్టండి. ఆయనకు ఆసనం ఇవ్వండి. అర్ఘ్యం, మధుపర్కం మరియు అనేక రకాల పుష్పాలు, వస్త్రాలు మొదలనవి ఇవ్వండి. ఆయన నుదుటన మరియు శరీరానికి చందనం పూయండి. అగరబత్తీలు వెలిగించండి. దీపములు చూపించండి. కర్పూరం వెలిగించి, హారతి చూపించండి. అనేకరకాల ఫలాలు, మధురపదార్ధాలు, పాయసము, కొబ్బరికాయ మరియు మహానైవేద్యం సమర్పించండి. షోడశోపచారపూజ చేయండి.

పంచాక్షరి మంత్రలేఖనం
చక్కని పుస్తకంలో 'ఓం నమః శివాయ' అని అరగంట లేదా ఎక్కువ సమయం రాసుకోండి. ఈ సాధనను చేయడం ద్వారా మీకు మరింత ఏకాగ్రత వస్తుంది. ఇంకుతో మంత్రాన్ని స్పష్టంగా రాయండి. మంత్రాన్ని రాసేటప్పుడు మౌనాన్ని పాటించండి. మంత్రాన్ని మీరు ఏ భాషలోనైనా రాయవచ్చు. అటుఇటు చూడటం విడిచిపెట్టండి. మంత్రాన్ని రాసేటప్పుడు మానసికంగా మంత్రాన్ని ఉచ్ఛరించండి. మంత్రం మొత్తాన్ని ఒకేసారి రాయండి. మంత్రం రాసే పుస్తకం పూర్తవ్వగానే దాని మీరు ధ్యానం చేసుకునే గదిలో ఒక పెట్టెలో పెట్టుకోండి. సాధనలో క్రమబద్ధంగా ఉండండి.

చిన్న నోటుపుస్తకాన్ని మీ జేబులు పెట్టుకుని, ఆఫీస్ లో ఖాళీ సమయం దొరికినప్పుడు రాయండి. మీ జేబులు మూడు వస్తువులు పెట్టుకోండి, అవి భగవద్గీత, మంత్రం కోసం చిన్న పుస్తకం మరియు జపమాల. మీరు గొప్పగా ప్రయోజనం పొందుతారు.

- స్వామి శివానంద  

Thursday 26 October 2017

శివయోగసాధన- శివారాధన- స్వామి శివానంద

శివారాధన


శివుడిని తన సగుణతత్త్వంలో శివలింగంగా పూజిస్తారు. సాధారణంగా శివభక్తులు పంచాయతనపూజ చేస్తారు. ఈ పూజలో శివ, గణేశ, పార్వతీ మాత, సూర్యనారాయణస్వామి మరియు సాలగ్రామాలను విధిగా ఆరాధిస్తారు.

శుభకరమైన రోజున పంచాయతన మూర్తులను తెచ్చుకోండి. గొప్ప విశ్వాసంతో వాటిని ఇంట ప్రతిష్టించండి. పెద్ద ఎత్తున ప్రత్యేకపూజలు, అర్చన, ఆరాధన, అభిషేకం నిర్వహించి బ్రాహ్మణులకు, మహాత్ములకు, పేదలకు అన్న సమారాధన చేయండి. దైవన్ని ప్రత్యేక గదిలో ప్రతిష్టించండి. ప్రతి రోజూ దేవాతమూర్తిని త్రికరణశుద్ధితో, విశ్వాసంతో పూజించండి. మీకు సమస్త సంపదలు, మనశ్శాంతి కలిగి, ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు సిద్ధిస్తాయి. మీరు ఐశ్వర్యవంతమైన జీవనం గడిపి, మరణం తర్వాత అమరత్వాన్నిచ్చే శివ సాయుజ్యాన్ని ప్రవేశిస్తారు.

అధికసంఖ్యలో బిల్వదళాలను కోసుకురండి. ధూపం, దీపం, కర్పూరం, చందనపు కడ్డీలు, శుద్ధజలం, అధికసంఖ్యలో పువ్వులు, స్వామికి నైవేధ్యాలు, కూర్చోవడానికి పీట, ఒక గంట, శంఖము మరియు పూజకు అవసరమైన ఇతర సంభారాలను సిద్ధం చేసుకోండి. సూర్యోదయానికి పూర్వం తెల్లవారుఝామునే నిద్రలేవండి. ముఖం కడ్డుక్కుని, స్నానం చేయండి. పూజకోసం పెట్టుకున్న ప్రత్యేకమైన పట్టు వస్త్రాలు ధరించండి. పూజాగదిని చక్కగా అలంకరించండి. స్వామి నామాలను చదువుతూ, ఆయన్ను స్తుతిస్తూ, స్తోత్ర పారాయణ చేస్తూ, ఆయనకు నమస్కరిస్తూ ఆ గదిలోకి ప్రవేశించండి. పూజగదిలోకి ప్రవేశించే ముందు కాళ్ళు కడ్డుక్కోండి. సుఖాసనం (మీకు అనువుగా ఉన్న ఆసనం) లో కూర్చుని పూజ ప్రారంభించండి. నిర్ణీత పద్ధతిలో పూజ ఆరంభించే ముందుగా మీరు సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత క్రమంగా కలశం, శంఖం, ఆత్మ, పీట (స్వామి ఆసనం) యొక్క పూజలను చేయాలి. అటు తర్వాత షోడశోపచార పూజ నిర్వహించి, మహామృత్యుంజయ మంత్రము, రుద్రపాఠము, పురుషసూక్తము, గాయత్రి మంత్రాలు జపించి, శుద్ధజలము, పాలు, చెఱుకురసము, నెయ్యి మరియు మీ శక్తి కొలదీ ఇతర ద్రవ్యాలతో లేద కేవలం శుద్ధజలంతో అభిషేకం చేయండి. 

రుద్రాభిషేకం అత్యంత ఫలప్రదం. మీరు కనుక రుద్రజపం చేసి అభిషేకం చేస్తే, మీ బాధలు, కష్టాలు మాయమై, విశ్వనాథుని అనుగ్రహంతో మానవజన్మ యొక్క లక్ష్యమైన పరమానాందాన్ని (మోక్షాన్ని) పొందుతారు. రుద్రం గొప్ప పవిత్రతను చేకూరుస్తుంది. రుద్రం మరియు పురుషుసూక్తంలో అగోచరమైన శక్తి దాగి ఉంది. రుద్రపారాయణంలో అద్భుతమైన ఉద్దీపనం ఉంది. పూజను ప్రారంభించి, దాని వైభావన్ని, తేజస్సును మీరే అనుభూతి చెందండి.

అభిషేకం తర్వాత, శివుడిని చందనం మరియు పువ్వులతో చక్కగా అలంకరించండి. తర్వాత ఆయన నామాలు 'ఓం నమః శివాయ', 'ఓం మహేశ్వరాయ నమః' మొదలైన నామాలను ఉచ్ఛరిస్తూ అర్చన చేయండి. సాధ్యమైతే ప్రతి రోజు 108 లేదా 1008 అర్చనలు చేయండి. అర్చన తర్వాత వివిధ దీపాలతో హారతి ఇవ్వండి- ఏక హారతి, బిల్వ (మూడు వత్తుల) హారతి, పంచహారతి మరియు కర్పూర హారతి ఇవ్వండి. గంటలు వాయించండి, తాళములు వేయండి, శంఖము మొదలైనవి ఊదండి. భగవంతునికి నైవేద్యం అర్పించండి.

హారతి తర్వాత, చామరలు వీస్తూ స్వామిని కొనియాడుతూ మహిమ్నా స్తోత్రం, పంచాక్షరీ స్తోత్రం మొదలైనవి చదవండి. పూజ మిగుంపులో 'కాయేన వాచా', 'ఆత్మ త్వం గిరిజామతేః' మరియు 'కరచరణ కృతం' మొదలైనవి చదవండి. స్వామికి సర్వం అర్పించండి. మీరు ఆయన చేతిలో ఒక వస్తువు మాత్రమేనని భావించండి. దైవానుగ్రహం కోసం మాత్రమే ప్రతిదీ చేయండి. నిమిత్త భావాన్ని వృద్ధి చేసుకోండి. భక్తులను సేవించండి. తన భక్తులకు సేవ చేస్తే, స్వామి చాలా సంతోషిస్తాడు. చివరలో భక్తులకు ప్రసాదం పంచండి. గొప్ప విశ్వాసంతో ప్రసాదాన్ని తీసుకోండి. భగవంతుని ప్రసాద వైభవం వివరించలేనిది. విభూతిని ప్రసాదంగా స్వీకరించి, నుడుటన ధరించండి.

మీరు బాహ్యవస్తువులతో సగుణారాధనలో పురోగమించినప్పుడు, మానసపూజను మొదలుపెట్టవచ్చు. మీకు స్వామి దర్శనం కలిగి బంధ విముక్తి కలుగుతుంది.

సోమవారాలు మరియు ప్రదోషాల్లో (త్రయోదశి నాడు) ప్రత్యేకపూజలు నిర్వహించండి. ఈ రోజులు మరియు శివరాత్రి స్వామికి అత్యంత పవిత్రమైనవి. పెద్ద ఎత్తున శివరాత్రి జరుపుకోండి. రోజంతా ఉపవసించండి. త్రికాలపూజ, ప్రత్యేక అభిషేకం, ఏకాదశ-రుద్ర జపం, సహస్రనామార్చన, రాత్రి వేళ జాగరణ, స్తోత్రపఠనం, శివపురాణ పఠనం, శివలీలల ప్రవచనాలు వినటం వంటివి చేయండి. మరుసటి రోజు పూజానంతరం అభిషేకం చేసిన నీటితో ఉపవాసం ముగించండి. నివేదనలు సమర్పించి, ప్రసాదాన్ని స్వీకరించండి. మీకు గొప్ప మనశ్శాంతి, ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది. ఏ అవకాశాన్ని వదులుకోవద్దు. రోజు పూజించడం అనేది అన్ని సమస్యలకు పరిహారం, మీరు ఎన్నడూ దరిద్రాన్ని అనుభవించరు. నా మాటగా తీసుకుని, ఈ రోజు నుంచి పూజ ప్రారంభించండి.

-- స్వామి శివానంద  

Wednesday 25 October 2017

శివయోగసాధన - శివుని యందు ధ్యానము - స్వామి శివానంద



సగుణ ధ్యానం- సగుణధ్యానం అంటే సాకరరూపం మీద ధ్యానం. ఒక విలుకాడు ముందుగా స్థూలమైన, పెద్ద వస్తువుపై గురి పెడతాడు. అటు తర్వాత మధ్యస్థంగా ఉన్న వస్తువుపై, అంతిమంగా చిన్న మరియు సూక్ష్మ వస్తువులపై బాణం సంధిస్తాడు. అలాగే, మొదట సగుణ ధ్యానంతో ప్రారంభించి, మనసు తర్ఫీదు పొంది, క్రమశిక్షణగా ఉన్నప్పుడు, అతడి నిరాకర, నిర్గుణ ధ్యానం చేయవచ్చు. సగుణ ధ్యానం అనేది నిర్దిష్ట వస్తువుపై ధ్యానం. సగుణ ధ్యానం అనేది కేవలం తన ఇష్టదైవం మీదే దృష్టి నిలపడం విశేషంగా ఇష్టమైన భక్తునకు నచ్చుతుంది. సగుణ ఉపాసన విక్షేపాన్ని తొలగిస్తుంది. మూడు నుంచి ఆరు నెలల వరకు శివుని మూర్తిపై త్రాటకాన్ని సాధన చేయండి.

అర్ధగంట నుంచి రెండు గంటలవరకు మూర్తి రూపంపై మానసికంగా త్రికుటిలో (రెండు కనుబొమ్మల మధ్యలో) ధ్యానం చేయండి. ఈశ్వరుడు విశ్వంలో ప్రతి వస్తువులో ఉనట్లుగా చూసి భావించండి. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు, దేవత యొక్క మంత్రమైన 'ఓం నమః శివాయ' అను మానసికంగా మననం చేసుకోండి. ఈశ్వరుని గుణాలనైన సర్వవ్యాపకత్వం, సర్వశక్తివంతం, సర్వజ్ఞత్వము గురించి భావన చేయండి. ఈష్టదేవత నుంచి సాత్త్విక గుణాలు మీ వైపు వస్తునట్లుగా భావించండి. మీరు ఈ సాత్త్విక గుణాలను కలిగి ఉన్నట్లుగా భావించండి. ఇదే శుద్ధ లేదా సాత్త్విక భావన. మీరు సాధనలో చిత్తశుద్ధితో ఉంటే, ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో మీ ఇష్టదేవతా దర్శనం కలుగుతుంది. దీన్ని ఆచరించండి. ఇది ఏకాగ్రతకు సహాయపడుతుంది. మూర్తి యొక్క వివిధ శరీరభాగాలపై, శివుని చిత్రంపై, మనసుని నిలుపుతూ ధ్యానించండి. మీరు మామూలుగా కూర్చున్న ఆసనంలోనే కూర్చోండి. ఆయన నామాన్ని జపిస్తూ, ఆయన గుణాలైన ఆనందం, కాంతి, ప్రేమ మొదలైనవి ధ్యానిస్తూ ఆయన మూర్తివైపు కాసేపు చూడండి. జ్వలించే వెలుగుతో ఆయన్ను మీ హృదయంలో లేదా రెండు కనుబొమ్మల మధ్య ఆసీనుడిని చేసుకోండి. ఇప్పుడు మానసికంగా ఆయన పాదపద్మాలను ధ్యానించి, మీ నమస్సులు అందించండి. ఇప్పుడు మనసుని ఆయన నడుముకు కట్టుకున్న ఏనుగు చర్మం మీదకు, ఆయన హృదయాన్ని అలంకరించిన రుద్రాక్ష మాల మీదకు, సుందరమైన నీలకంఠం మీదకు, ధ్యానంతో ప్రసరిస్తున్న చక్కని కాంతి కలిగిన నిర్మలమైన ముఖం మీదకు, అంతర్ముఖ దృష్టి కలిగిన అర్ధ-నీమిలిత నేత్రాల మీదకు, ఫాలభాగం మధ్యలో ఉన్న అద్భుతమైన మూడవనేత్రం మీదకు తీసుకెళ్ళండి. అటు తర్వాత జటాజూటం, చల్లని చంద్రరేఖ మరియు జటల నుంచి ఉబికివస్తున్న పవిత్రగంగ మీదకు మనసును తీసుకెళ్ళండి. ఒక చేతిలో ఉన్న త్రిశూలం, ఇంకో చేతిలో ఉన్న ఢమరుకం మీదకు మనస్సును త్రిప్పండి. అన్ని విశేషాలు ముంగించేవరకు మీ మనసును అలా త్రిప్పండి. అప్పుడు మీ మనసును ముఖం యందు కానీ లేదా ఆయన పాదాలయందు కానీ నిలపండి. ఈ ప్రక్రియను పునఃపునః మననం చేయండి. నిరంతర సాధన ద్వారా, మీరు ధ్యాననిష్ఠులై శివునితో ఏకమవుతారు.

నిర్గుణ ధ్యానం:  ఇది శివుని తత్త్వమైన సర్వవ్యాపకత్వము, అవ్యక్తము, పరంబ్రహ్మ స్వరూపం పై ధ్యానం. ఈ ధ్యానంలో మీరు శివుడిని పరంబ్రహ్మంగా, నిరాకార, నిర్గుణ, సనాతన, అనంతుడిగా ధ్యానిస్తారు. ఆయన్ను శుద్ధుడు, సచ్చిదానందుడు, వ్యాపించిన ఆత్మస్వరూపుడు; నిత్య, శుద్ధ, సిద్ధ, బుద్ధ, ముక్త సనాతనమైన సర్వతంత్ర స్వతంత్రమైన బ్రహ్మంగా, అనంతమైన శుద్ధ చైతన్య సముద్రంగా ధ్యానిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని సర్వోత్కృష్టము, ఇంద్రియాతీతమైన శివ స్వరూపంగా గుర్తించుకోండి. చైతన్య, పరిపూర్ణ, ఏకసార, శాంత, మార్పు చెందని ఉనికిగా మిమ్మల్ని భావించండి.

ప్రతి అణువు, ప్రతి త్రసరేణువు, ప్రతి నాడి, రక్త నాళం, ధమని శక్తివంతమైన ఈ ఆలోచనలతో ప్రతిధ్వనించాలి. శివోహం అని పెదవితో జపించడం (పెదవి విరుపు/ నోటి మాట) అంత ఫలదాయకం కాదు. అది హృదయం, మస్తిష్కం మరియు ఆత్మ ద్వారా జరగాలి. ఈ భావన నిరంతరం కలిగి ఉండాలి. శివోహం అనే మంత్రాన్ని మననం చేస్తున్నప్పుడు దేహాత్మభావనను త్రోసివేయండి. మీరు శివోహం జపిస్తునప్పుడు ఇలా భావించండి:

నేను అనంతుడను  శివోహం శివోహం
సమస్తమైఅ కాంతిని నేను  శివోహం శివోహం 
సమస్త ఆనందాన్ని నేను  శివోహం శివోహం 
సమస్త కీర్తిని నేను   శివోహం శివోహం 
సమస్త శక్తిని నేను   శివోహం శివోహం 
సమస్త జ్ఞానం నేను   శివోహం శివోహం 
సమస్త ఆత్మానందం నేను   శివోహం శివోహం 

పైన చెప్పిన భావనలపై నిరంతరం ధ్యానించండి. ఉత్సుకత మరియు ఆసక్తితో నిరంతర ప్రయత్నం అనేది ఆవశ్యకమైనవి. విడువకుండా పైన చెప్పిన భావాలను మానసికంగా మననం చేయండి. మీరు సాక్షాత్కారం పొందుతారు.


- స్వామి శివానంద 

Sunday 22 October 2017

శివయోగసాధన - పంచాక్షరీ రహస్యం - స్వామి శివానంద



స్వామి శివానంద గారి పుస్తకంలో ప్రచురించిన విషయమిది. 1996 లో ఈ పుస్తకం ముద్రితమైంది. ఒక మిత్రుడు అడిగారని నేటి నుంచి కార్తీకమాసం సందర్భంగా తెలుగులోకి అనువదించి పోస్ట్ చేయడం జరుగుతోంది.

శివయోగసాధన - 1
పంచాక్షరీ రహస్యం

నమశ్శివాయ  అనే ఐదు అక్షరాలు కల మహామంత్రం పంచాక్షరి. తనను మననం చేసేవారికి సకల విఘ్నాలను, బాధలను తొలగించి, ఆత్మానందాన్ని, అమరత్వాన్ని ఇచ్చేది మంత్రము. సప్తకోటి మంత్రాల్లో పంచాక్షరి ఉత్తమమైనది. యజుర్వేదంలో ఏడు స్కందాలు ఉన్నాయి. మధ్యస్కందంలోని మధ్యలో రుద్రాధ్యాయం ఉంది. ఈ రుద్రాధ్యాయంలో 1,000 రుద్రమంత్రాలున్నాయి. నమశ్శివాయ లేదా శివపంచాక్షరి మంత్రం ఈ వేయి రుద్రమంత్రాల మధ్యలో అలరారుతోంది.

యజుర్వేదం వేదపురుషుడైన పరమేశ్వరిని తల. దాని మధ్యలో ఉన్న రుద్రం ఆయన ముఖము, పంచాక్షరి ఆయన కన్ను, నమశ్శివాయ మధ్యలో ఉన్న శివ ఆయన కనుగుడ్డు. ఈ పంచాక్షరీ మంత్రాని జపించేవాడు జనన మరణాల నుంచి విముక్తుడై శాశ్వత కైవల్యాన్ని పొందుతాడు. ఇది వేదాల స్పష్టమైన ప్రకటన. ఈ పంచాక్షరియే నటరాజు శరీరం. ఇదే శివపథం. మీరు నమ్మశివాయకు ప్రారంభంలో ఓం ను జత చేస్తే, అది షడక్షర మంత్రం (ఆరు అక్షరాల మంత్రం) అవుతుంది. ఓం నమో మహాదేవాయ అనేది 8 అక్షరాల లేక అష్టాక్షర మంత్రం.

పంచాక్షరి ఆరురకాలు. అవి స్థూలపంచాక్షరి (నమశ్శివాయ), సూక్ష్మ పంచాక్షరి (శివాయ నమః), కారణ పంచాక్షరి (శివాయ శివ), మహాకారణ పంచాక్షరి (శివాయ), మహామను లేదా ముక్తి పంచాక్షరి (శి).

నమః అంటే నమస్కారము. శివాయ నమః అంటే శివభగవానునకు నమస్కారములు. దేహదృష్టితో చూసినప్పుడు జీవుడు శివుడికి సేవకుడు. 'నమః' జీవాత్మను సూచిస్తుంది. 'శివ' అనేది పరమాత్మను సూచిస్తుంది. 'ఆయ' అనేది ఐక్యాన్ని లేదా జీవాత్మ, పరమాత్మల ఉనికిని సూచిస్తుంది. అందుకే శివాయ నమః అనేది జీవాత్మ, పరమాత్మల ఏకత్వాన్ని సూచించే 'తత్త్వమసి' లాంటి మహావాక్యం. 

ప్రణవం అనేది భగవంతుని (వడ్లగింజ) బాహ్యరూపం (పొట్టు) మరియు పంచాక్షరి అనేది అంతఃస్వరూపం (బియ్యపు గింజ). ప్రణవము మరియు పంచాక్షరి ఒక్కటే. ఐదు అక్షరాలు భగవానుని ఐదు కర్మలను సూచిస్తాయి., అవి సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహం. అవి పంచభూతాలను మరియు వాటి కలయికతో ఏర్పడిన సమస్త సృష్టిని/ జీవాలను సూచిస్తాయి.

'న' తిరోధాన్ని, 'మ' మలాన్ని లేదా అశుద్ధాన్ని, 'శి' శివుడిని, 'వా' ఈశ్వరానుగ్రహాన్ని, శక్తిని, 'య' జీవాత్మను సూచిస్తాయి.

స్నానం చేయండి, లేదా ముఖము, కాళ్ళు, చేతులు కడుక్కోండి. భస్మాన్ని, రుద్రాక్షమాలను ధరించండి. పద్మాసనం లేదా సుఖాసనంలో, తూర్పు లేదా ఉత్తర అభిముఖంగా, ప్రశాంతమైన, నిశ్శబ్దమైన గదిలో కూర్చోండి. పంచాక్షరిని మౌనంగా జపించి, శివ భగవానుని రూపాన్ని ధ్యానించండి. ఆయన రూపాన్ని కనుబొమ్మల మధ్యలో లేదా హృదయంలో నిలుపుకోండి.

మీరు క్రమబద్ధంగా ధ్యానం సాధన చేస్తే, మీ హృదయం పరిశుద్ధమవుతుంది. సమస్త సంస్కారాలు, పాపాలు పూర్తిగా దగ్ధమవుతాయి. మీరు శివయోగ నిష్టను లేదా నిర్వికల్పసమాధిని పొందుతారు. మీరు ప్రకాశవంతమన శివపదాన్ని లేదా శివగతిని పొంది, శివునితో ఏకమవుతారు. శివానందన్ని అనుభవించి, అమరత్వాన్ని పొందుతారు.


శివుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.

Wednesday 18 October 2017

స్వామి చిన్మయానంద సూక్తి



Lakshmi Pooja is misunderstood as worship of wealth. It is invoking the inner wealth of nobility, love and compassion. Once right character is invoked outer successes in the world as assured. Invoke sattvic qualities and remake your destiny.

- Swami Chinmayananda

Tuesday 17 October 2017

శ్రీ అరోబిందో - దుర్గాస్తోత్రం

1909 లో శ్రీ అరోబిందో దుర్గాదేవిని ఉద్దేసించి దుర్గాస్తోత్రం రాశారు. భారతీయులకు శక్తిని, ధరియాన్ని ఇవ్వమని, భారతదేశ బానిస సంకెళ్ళను త్రెంచే శక్తినివ్వమని, అంధకారంతో పోరాడే శకితిని సమకూర్చమని అందులో వేడుకున్నారు.... అది ఈ కాలానికి అన్వయమవుతుంది.

మాతాః దుర్గా! సింహవాహిని సర్వశక్తిదాయిని మాతః శివప్రియే!

నీ శక్త్యంశగా ఉత్పన్నమైన మేము, భారతయువత నీ మందిరంలో ఆసీనులై ఉన్నాము,
ప్రార్థిస్తున్నాము, విను మాతః, భారతదేశంలో ఆవిర్భూతమవ్వు, ప్రకటనమవ్వు | 1 |

దుర్గమ్మ తల్లి! సింహవాహిని, సకలశక్తులను ఇచ్చేదానవు, అమ్మవు, శివునకు ప్రియమైన దానవు! మేము,నీ అంశతో ఉద్భవించిన భారతీయ యువగణము, నీ ఆలయంలో ఆసీనులమై ఉన్నాము. మేము (భరతీయులము) నీ పిల్లలము, నీ అంశలము. ఆ మొర ఆలకించు. దేశం, ధర్మం కష్టాల్లో ఉన్నాయి. ఓ మాత, భూమిపై మళ్ళీ అవతరించు, ఈ భారతభూమిలో నిన్ను నువ్వు ప్రకటించుకో |

మాతః దుర్గ! యుగయుగాల్లో మానవశరీరమందు అవతరించిన (మేము), జన్మ-జన్మాంతరంలో నీ కార్యాన్ని నిర్వర్తించి, నీ ఆనందధామానికి చేరుకుంటాము| ఈసారి కూడా నీ కార్యం కోసమే జన్మించాము, విను మాతః, భారతదేశంలో అవతరించు, మాకు సహాయం చెయ్యి| 2 |

అమ్మా దుర్గమ్మ! ప్రతి యుగంలో, అనేక కాలాల్లో, మేము (భారతీయులము) మానవదేహం ధరించి, నీ కార్యాన్ని పూర్తి చేయడానికి భూమి మీదకు వస్తాము. కార్యం నిర్వహించి, తిరిగి ఆనందధామమైన నీ వద్దకే చేరుకుంటాము. ఇప్పుడు కూడా, మేము జన్మించింది నీవు సంకల్పించిన కార్యం నిర్వహించడానికి. ఓ మాత! సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడం, భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్ళడం, స్వదేశీ భారతనిర్మాణం అనే నీ కార్యాన్ని పూర్తి చేయడం కోసం భూమి మీద, భారతదేశంలో అవతరించు, మాకు సహాయం చెయ్యి. 

మాతః దుర్గ! సింహవాహిని, త్రిశూలధారిణి, కవచాలంకృత సుందర శరీరే, మాతః జయధాయిని| భారతం నీకోసం నిరీక్షిస్తున్నది, మంగళకరమైన నీ యొక్క ఆ సుందరరూపాన్ని చూడాలనే ఉత్సుకతతో ఉంది| విను మాతః, భారతదేశంలో ఆవిర్భవించు, ప్రకటనమవ్వు | 3 |


అమ్మా దుర్గమ్మ! సింహవాహినివి, చేతిలో త్రిశూలం ధరించినదానివి. కవచం ధరించిన సుందరమైన శరీరం కలదానివి, అమ్మవు, విజయాన్ని ప్రసాదించేదానివి. భారతదేశం నీ కోసం నిరీక్షిస్తోంది, మంగళకరమైన, అందమైన, దివ్యమైన రూపాన్ని చూడాలని ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తోంది. అమ్మా, విను, భూమి మీదకు దిగిరా, భారతదేశంలో అవతరించు, నిన్ను నువ్వు ప్రకటనం చేసుకో. 

అమ్మా దుర్గమ్మా! బలాన్ని, ప్రేమను, జ్ఞానాన్ని ఇచ్చేదానివి, శక్తిస్వరూపానివి, భీకరరూపిణివి, సౌమ్యము మరియు రౌద్రము అనే రెండు లక్షణాలు కలిగి ఉన్నదానివి. జీవన పోరాటంలో, భారతదేశం కోసం జరిగే సంగ్రామంలో మేమంతా నీ చేత ప్రేరేపించబడిన యోధులము. మాలో యుద్ధకాంక్ష రగిలించింది నీవే. అమ్మా! ప్రాణము మరియు మనస్సులో అసురులకు (రాక్షసులు) ఉండే కఠినమైన శక్తిని ప్రసాదించు; ఆ అసురశక్తితో దుష్టులను నిర్మోహమాటంగా వధిస్తాము. మా జీవితంలోని ఆటంకాల పట్ల, విదేశీ భావజాలం, విదేశీ భావదాస్యం పట్ల కఠినంగా, క్షమించకుండా పోరాడి అంతం చేస్తాము. అలాగే మాకు హృదయంలో మరియు బుద్ధిలో దేవతలకు ఉండే గుణాలను ప్రసాదించు, వారికి ఉండే జ్ఞానాన్ని ప్రసాదించు. (హృదయం అమ్మవారి స్థానం. హృదయంలో దైవీగుణాలు ఉంటే, అది ఎల్లప్పుడూ అమ్మవారికి కృతజ్ఞతతో, భక్తితో, ఆవిడ యందే లగ్నమై ఉంటుంది. బుద్ధి అనగా నిశ్చయాత్మకమైన జ్ఞానం గురించి చెప్పేది. దేవతలకు ఉండే జ్ఞాన్ని బుద్ధిలో నింపితే, అది ఎన్నడూ దైవం పట్ల, ధర్మం పట్ల విముఖత చూపదు. ధర్మాన్ని తప్పదు).

మాతః దుర్గే! జగత్-శ్రేష్ఠమైన భారతజాతి భయంకరమైన అంధకారంలో కప్పబడి ఉంది. మాతః, నీవు గగనప్రాంతంలో మెల్లిమెల్లిగా ఉదయిస్తున్నావు, నీ అలౌకికమైన అంధకార-వినాశకరమైన శరీరకాంతితో ఉషస్సు ప్రకాశిస్తోంది. ప్రకాశాన్ని విస్తరించు మాతః, తిమిరాన్ని దూరం చెయ్యి |5|


దుర్గా మాత! దేవేంద్రుడు సైతం భారతదేశంలో జన్మించిన వారిని చూసి, తన పదివికి పోటీ వస్తాడేమోనని భయపడతాడట. భారతదేశ ఖ్యాతిని, భారతీయుల అదృష్టాన్ని గంధర్వులు దేవలోకాల్లో గానం చేస్తారని వేదంలో కనిపిస్తుంది. భారతదేశంలో పుట్టడమే పెద్ద అదృష్టం. అలాంటి జగత్తులోనే శ్రేష్ఠమైన భారతజాతి ఎంతో భయంకరమైన అంధకారంతో కప్పబడి ఉంది. తీవ్రమైన తమస్సులో మునిగిపోయింది. మాతః, అయినప్పటికీ మాకు ఆశలు చిగురిస్తున్నాయి. ఎందుకో తెలుసా? ఆకాశంలో నీవు మెల్లిగా ఉదయిస్తున్నావు. నీ అలౌకికమైన, అద్భుతమైన శరీరంకాంతి అంధకారాన్ని, అజ్ఞానాన్ని నశింపజేస్తుంది. అలాంటి నీ శరీరం నుంచి వెలువడుతున్న కాంతికిరణాలతో ఉషస్సు (ఉషః కాలం - సూర్యోదయానికి పూర్వపు కాలం) ఎర్రగా ప్రకాశిస్తోంది. భారతదేశంలో ఇక అంధకారంలో కొట్టుకుపోయే పరిస్థితి అంతమవుతోంది. మాత నీ ప్రకాశాన్ని విస్తరించు. ఈ తిమిరాలను (చీకట్లను) దూరం చెయ్యి.



మాతః దుర్గే! శ్యామలా, సర్వసౌందర్య- అలంకృత, జ్ఞాన-ప్రేమ-శక్తులకు ఆధారమైన భారతభూమి నీ యొక్క విభూతి. ఇన్ని రోజులు తన శక్తిని నిగ్రహించుకోనుటకు ఆత్మగోపనం చేసుకుంది. రాబోయే యుగంలో, రాబోవు రోజుల్లో సమస్త విశ్వాన్ని తన కౌగిట్లోకి తీసుకొనుటకు భారతమాత జాగృతమవుతోంది. రా మాతః, ప్రకటనమవ్వు |6|

దుర్గా మాత! శ్యామ (నల్లని) వర్ణం కలదానువు కనుక శ్యామలవు. ఈ శ్యామల దేవిని మాతంగీ అని కూడా అంటారు. ఈవిడ దశమహావిద్యల్లో ఒకరు. శ్రీ కృష్నుడితో కలిసి జన్మినిచినది, కృష్ణావతరంలో నిత్యం శ్రీ కృష్ణులవారితో సంభాషణ జరిపి ఆయనకు సాయంగా ఉన్నది శక్తి శ్యామలదేవి. ఈ శ్యామలదేవిని రాజశ్యామల, రాజమాతంగీ అని కూడా అంటారు. లలితా పరమేశ్వరీ దేవి యొక్క బుద్ధి నుంచి ఉద్భవించిన శక్తి శ్యామలా దేవి. ఈవిడ లలితాదేవికి మంత్రిణి. చక్రరాజ రథారూఢా అంటూ లలితా సహస్రనామాల్లో వివరించబడేది శ్యామల దేవి గురించే.
సర్వ సౌందర్యరాశివి, ప్రపంచంలో ఉన్న సౌందర్యాలన్నిటిని అలంకరించుకున్నదానివి. జ్ఞానం, ప్రేమ, శక్తులకు ఆధారభూతమైన భారతభూమి నీ యొక్క విభూతి (ఇక్కడ భారతదేశాన్ని అమ్మవారి అంశగా చెబుతున్నారు అరోబిందో. ఇది వారి యోగదర్శనం. ఇంతకవరకు అమ్మవారిని ఉద్భవించమన్నారు. ఆ ఉద్భవించిన మాత ఎవరో ఇదే శ్లోకంలో చెబుతారు). అలాగే భారతదేశం ప్రపంచానికి పంచాల్సినవి ఏమిటో కూడా స్పష్టం చేశారు. ప్రథానంగా భారతదేశం పంచాల్సింది జ్ఞానం, ప్రేమ, శక్తి.

ఈ ప్రపంచంలో ఎన్నో నాగరికతలు వచ్చాయి, వెళ్ళిపోయాయి, కానీ సనాతనధర్మం, భారతదేశం మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎందుకంటే భారతదేశం ఈ ప్రపంచానికి చేయాల్సింది ఎంతో ఉందని, అందుకే భగవంతుడు ఇంకా ఈ జాతిని నిలిపి ఉంచాడని స్వామి వివేకనంద, శ్రీ అరోబిందో అనేకసార్లు స్పష్టం చేశారు. భగవంతుడు భారతదేశానికి ఒక కార్యం అప్పజెప్పాడని, అది మర్చిపోతే, ఈ జాతిని ఆయనే ప్రపంచపటం నుంచి చెరిపివేస్తాడని కూడా స్పష్టం చేశారు. అందులో మనం (భారతీయులు), ప్రపంచానికి సనాతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచాలి. ప్రపంచంలో మూఢనమ్మకాలను తొలగించాలి. షర్తుల్లేని ప్రేమను పంచాలి. ఎదుటివాడి నుంచి నీవేదీ ఆశించకుండా, నీవు వాడిని ప్రేమించగలగాలి. అటువంటి దివ్యప్రేమను పంచాలి. శక్తిని పంచాలి. అది కేవలం భౌతికశక్తి కాదు, ఆధ్యాత్మిక శక్తి. భౌతికమైన శక్తి అంటే బలం మాత్రమే. కానీ ఆధ్యాత్మికమైన శక్తి ఆత్మ నుంచి ఉద్భవిస్తుంది. అది ప్రపంచానికి పంచాలి. అంతకుముందుగా మనం కూడా జ్ఞానం, ప్రేమ, శక్తులను పొందాలి. తత్త్వాన్ని సరిగ్గా అర్దం చేసుకోవాలి. ఈ మూడింటిని అర్దం చేసుకుంటే భారతదేశం అర్దమవుతుంది, ఆదిపరాశక్తి అర్దమవుతుంది. అదే అరోబిందో చెబుతునారు.


ఇంతటి గొప్ప భారతదేశం వందల సంవత్సరాలు విదేశీయుల ఆక్రమణలకు బలైంది. తన శక్తిని దాచిపెట్టుకుంది. తన ఆత్మను తాను కప్పిపెట్టుకుని బందీగా బ్రతికింది. అవమానాలను, అత్యాచారాలను, చీత్కారాలను భరించింది. ఇంత దారుణమైన పరిస్థితి మనకు ఎందుకు వచ్చిందో కూడా ఆయనే ఇంకో చోట చెప్పారు. అయినప్పటికి భారతదేశం మరణించలేదు. ఆమె ఇంకా బ్రతికే ఉంది. ప్రపంచానికి ఏదో చేయటానికి సిద్ధంగా ఉంది.... ఎందుకంటే ఆమె పరమపావని ఐన దుర్గా మాత అంశ. సా.శ.1,900 నుంచి భారతదేశానికి స్వర్ణయుగం మొదలైందని అరోబిందో దర్శించారు. ఇక్కడ అదే చెబుతున్నారు. రాబోయే యుగంలో, రాబోయే రోజుల్లో సమస్త ప్రపంచాన్ని తన కౌగిట్లోకి తీసుకుని ప్రేమను పంచటానికి, ప్రపంచప్రజలను ఓదార్చి, పోషించటానికి భారతమాత (ఆ ఉద్భవించిన మాతయే 18 చేతులతో వ్యక్తమైన మహాదుర్గ) జాగృతమవుతోంది. రా మాత! నీకు ఆహ్వానం పలుకుతున్నాము. భారతదేశంలో నిన్ను నువ్వు ప్రకటించుకో..... 

మాతః దుర్గే! మేము నీ సంతానము, నీ ప్రసాదం చేత, నీ ప్రభావం చేత మహత్వమైన భావలను, మహత్వకార్యాలను చేయుటకు ఉపయుక్తంగా ఉన్నాము. క్షుద్రత్వం వినాశనం చెయ్యి, స్వార్ధాన్ని వినాశనం చెయ్యి, భయాన్ని వినాశనం చెయ్యి |7| 

దుర్గా మాత! మేము (భారతీయలము) నీ సంతానము (అంశలము). నీ చేత ప్రభావితమై, నీ అనుగ్రహంతో గొప్పకార్యాలను నెర్వేర్చటానికి, గొప్ప భావాలను కలిగి ఉండటానికి ఉపయుక్తంగా ఉన్నాము. అమ్మా! మాలోని క్షుద్రమైన గుణాలను నశింపజెయ్యి. స్వార్ధాన్ని నాశనం చేయ్యి. భయాన్ని సమూలంగా నశింపజెయ్యి.


దుర్గా మాత! మేము (భారతీయలము) నీ సంతానము (అంశలము). నీ చేత ప్రభావితమై, నీ అనుగ్రహంతో గొప్పకార్యాలను నెర్వేర్చటానికి, గొప్ప భావాలను కలిగి ఉండటానికి ఉపయుక్తంగా ఉన్నాము. అమ్మా! మాలోని క్షుద్రమైన గుణాలను నశింపజెయ్యి. స్వార్ధాన్ని నాశనం చేయ్యి. భయాన్ని సమూలంగా నశింపజెయ్యి |8|

మాత దుర్గమ్మ! నీవే కాళీ స్వరూపిణివి. దిగంబరివి. దిక్కులెల్లా, కదలడానికి చోటు లేకుండా అంతటా, అన్నింటా వ్యాపించి ఉన్నది కనుక అమ్మవారు దిగంబరి. మానవుల పుర్రెలను మాలగా ధరించినదానివి. చేతిలో ఖడ్గం ధరించినదానివి. అసురులను సమూలంగా నాశనం చేసేదానివి. అమ్మా! నీవు కృరూమైన, అతిభీకరమైన నినాదంతో, నిర్దయగా, మా అంతఃకరణంలో ఉన్న శతృగుణాలను అంతం చెయ్యి. వాటి పట్ల ఏమాత్రం కనికరం చూపకు. దుర్గుణాల్లో ఒకట్టి కూడా, మాలో మచ్చుకైనా జీవించడానికి వీల్లేదు. మేము విమలులం కావాలి, నిర్మలులం కావాలి (మలం అంటే చెడు, విసర్జించదగినది, నిర్మలం అంటే ఎంటువంటి చెడు లేకుండా ఉండటం), పవిత్రులం కావాలి. నీ పిల్లలైన మేము ప్రతి చర్యలో నిన్నే ప్రతిబింబించాలి. నీవు ఏ రాక్షసగుణాలతో పోరాటం చేశావో, మేమా రాక్షసగుణాలను మాలో నిలుపుకోలేము. వాటిని అంతం చెయ్యి మాత! అంతే, ఇదే మా ప్రార్థన మాత. భారతదేశంలో అవతరించు, నిన్ను నీవు ప్రకటించుకో.

మాతః దుర్గే! స్వార్థం, భయం, క్షుద్రాశయాలతో భారతదేశం మృతప్రాయమవుతోంది| మమ్మల్ని మహోన్నతులను చెయ్యి, మహత్ప్రయాసులను చెయ్యి, ఉదారచేతనులను చెయ్యి, సత్యసంకల్పులను చెయ్యి| ఇప్పటి నుంచి మాలో నిశ్చేష్టత, అలసత్వము, భయభీతి లేకుండుగాకా |9|

దుర్గా మాత! స్వార్థం, భయం, క్షుద్రమైన ఆశయాలతో భారతదేశం జీవచ్ఛవమైంది, మరణశయ్యపై మృత్యువుకు సిద్ధంగా ఉంది. 
జనులు స్వార్థంతో నిండిపోయారు. పదిమంది కలిసి దేశం కోసం, ధర్మం పనిచేయడానికి ముందుకు రావట్లేదు, ఎవరి వ్యక్తిగత అభివృద్ధిని వారు చూసుకుంటున్నారు. సంపద పోతుందనో, లేదా మరణిస్తామానో, లేదో ఇంకేదో కోల్పోతామనో భయపడుతూ మంచి మార్పు దిశగా ఒక్కరూ అడుగు వేయడంలేదు. క్షుద్రమైన ఆలోచనలు జనుల మనస్సులను ఆవరించాయి. తాము గొప్ప పనులు చేయరు. ఇంకేవరైనా చేస్తుంటే, తట్టుకోలేరు. వారిని క్రిందకు లాగాలనే చూస్తుంటారు. పదిమంది కలిసి ఒక సంఘంగా ఏర్పడలేరు. ఏర్పడినా, తామే నాయకులవ్వాలని అనుకుంటారు, పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తారు. ఒకరి గురించి ఒకరు చాటుమాటుగా చాడీలు చెప్పుకుంటారు. ఇలాంటి దుర్గుణాల కారణంగా భారతదేశం మృతప్రాయమైంది. మరణించడానికి సిద్ధమైంది.

అమ్మా! మా ప్రార్థన ఒక్కటే. మమ్మల్ని మహోన్నతులను చెయ్యి, గొప్ప ప్రయత్నాలు చేసే దిశగా మమ్ము ప్రేరేపించు. మా హృదయాలను విశాలం చెయ్యి. మేము సంకల్పించుకున్న కార్యానికి కట్టుబడి ఉండే శక్తిని ప్రసాదించు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, మేము అనుకున్న కార్యం దిశగా మరింత ఉత్సాహంతో ముందుకు దూకే శక్తినివ్వు. సత్యం దిశగా సాగే సంకల్పాలను చేసే శక్తిని ప్రసాదించు. ఇప్పటి నుంచి మాలో నిశ్చేష్టత ఉండకూడదు. అలసత్వం ఉండకూడదు. మేము దీనికి భయపడకూడదు. అటువంటి గొప్ప స్థితిని భారతీయులకు ప్రసాదించు మాత.

మాతః దుర్గే! యోగశక్తిని విస్తరించు. నీ ప్రియమైన ఆర్యసంతతి మేము. మేము కోల్పోయిన విద్య, శీలము, మేధాశక్తి, శ్రద్ధాభక్తులు, తపస్సు, బ్రహ్మచర్యము, సత్య-జ్ఞానాలు తిరిగి మాలో వికసింపజేసి, జగత్తుకు పంచు. మానవసహాయి దుర్గతినాశినీ జగదంబ, ప్రకటనం అవ్వు |10|


అమ్మా దుర్గామాత! యోగశక్తిని విస్తరించు. అది అందరికి సులువుగా అందేలా, దాన్ని అర్దం చేసుకునే శక్తిని ప్రసాదించు. భారతీయులమైన మేము నీ ప్రియమైన ఆర్యసంతతిమి. ఆర్య అనగా శ్రేష్టమైనది అని అర్ధం. శత్రువు ఎదురుగా లేనప్పుడు, వాడి యందు కోపం లేనివాడు; సత్యమే మాట్లాడేవాడు; ధర్మం తప్పనివాడు అంటూ కొన్ని లక్షణాలను శాస్త్రం చెప్పింది. ఆ లక్షణాలు కలిగి ఉన్నవారిని ఆర్యులు అని అన్నది శాస్త్రం. ఈ లక్షణాలను వేల ఏళ్ళుగా భారతీయులు అనుష్టించారు కనుక వారిని ఆర్యులు అన్నారు...... అన్యమత దాడుల్లో, దురాక్రమణాల్లో భారతీయులు ఎంతో కోల్పోయారు. మేము కోల్పోయిన విద్య, నడవడిక, మేధస్సు, శ్రద్ధ, భక్తి, తపస్సు, బ్రహ్మచర్యము, సత్యము, జ్ఞానాలను తిరిగి మాలో వికసింపజెయ్యి. వాటిని జగత్తుపై వర్షించు. మానవులకు సహాయం చేయుటకు దుర్గతులను నశింపజేసే ఓ జగన్మాత, భారతదేశంలో అవతరించు, ప్రపంచానికి నీ ఉనికిని చాటుకో.

మాతః దుర్గే! అంతరంగంలోని శతృవులను సంహరించు, బాహ్య బాధలు-విఘ్నాలను నిర్మూలించు| బలశాలీ, పరాక్రమీ, ఉన్నతచేతనమైన భారత జాతి పవిత్ర వనాల్లో, సారవంతమైన పంటపొలాల్లో, ఆకాశాన్ని తాకే పర్వతాల క్రింద, స్వచ్ఛమైన ప్రవాహం కలిగిన నదీతీరాల్లో, ఐక్యమత్యంలో, ప్రేమలో, సత్యంలో, శక్తిలో, శిల్పంలో, సాహిత్యంలో, విక్రమంలో, జ్ఞానంలో శ్రేష్ఠంగా నివాసముండు. మాతృచరణాల యందు ఇదే మా ప్రార్థన. ప్రకటనమవ్వు |11|


అమ్మా దుర్గమ్మ! (కోపం, తన యందే సానుభూతి, ద్వేషం, అసూయ, దురాశ, ఈర్ష్యా, లోభం, మోహం మొదలైనవి అంతరంగంలోని శతృవులు) అంతరంగంలో ఉన్న శతృవులను సంహరించు. బాహ్యంలో మాకు ఎదురవుతున్న బాధలను, కష్టాలను, విఘ్నాలను నిర్మూలించు. శ్రేష్టమైన బలము, పరాక్రమము, ఉన్నతమైన భావాల్లో తన రక్తంలోనే నింపుకున్న భారతజాతి యొక్క పవిత్రమైన అడవుల్లో, సారవంతము, ఆరోగ్యకరమైన ఆహారానిచ్చే పంటభూముల్లో, ఆకాశాన్ని తాకే ఎత్తైన శిఖరాలు కల పర్వతాల క్రింద, స్వచ్ఛమైన, శుద్ధమైన, పవిత్రమైన నీటి ప్రవాహం కలిగిన నదీతిరాల వెంబడి; అనేక సంప్రదాయాలు, ఆచారాలతో భిన్నత్వం కనిపిస్తున్నా, పూసల దండ మధ్యలో ఉండే దారంవలే ధర్మం వలన ఏర్పడిన ఐకమత్యంలో, దివ్యమైన ప్రేమలో, సత్యంలో, శక్తిలో, జ్ఞానంలో గొప్పగా నివసించు. అమ్మా! నీ పాదాలయందు ఇదే మా ప్రార్థన. భారతదేశంలో ప్రకటనమవ్వు.

మాత దుర్గేః! యోగబలంతో మా శరీరములయందు ప్రవేశించు. మేము నీ యొక్క యంత్రాలు కావాలి, అశుభనాశనం చేసే ఖడ్గాలము, అజ్ఞానాన్ని వినాశనం చేసే దీపాలము కావాలి, భారతీయ యువకుల ఈ అభిలాషను పూర్తి చెయ్యి. యంత్రివై యంత్రాన్ని నడుపు, అశుభహంత్రివై ఖడ్గాన్ని త్రిప్పు, జ్ఞాన-దీపప్రకాశినివై దీపాన్ని చేతిలోకి తీసుకో మాతః, ప్రకటనమవ్వు |12| 


దుర్గమ్మా! యోగబలంతో మా శరీరాల్లోకి ప్రవేశించు. మేము కేవలం భౌతిక, మానసిక శక్తులతో కాదు, యోగశక్తితో, దైవశక్తితో భారతదేశ పునర్వైభవం కోసం పాటుపడాలి. ఆ శక్తిని నీవే ఇవ్వాలి. మేము నీ యొక్క యంత్రాలము కావాలి. నీ పని మా ద్వారా జరగాలి. మేము అశుభాలను నశింపజేసే నీ చేతి ఖడ్గము కావాలి. అజ్ఞానాన్ని నశింపజేసే జ్ఞాన దీపపు జ్యోతులము కావాలి. భారతీయ యువత యొక్క అభిలాష ఇదే. భారతీయ యువతకు తెలుసు, ప్రతి పనిలోనూ పురుషాకారము (మానవప్రయత్నము), దైవానుగ్రహం ఉండాలని. కేవలం పురుషాకారంతోనే ఏదీ సాధ్యం కాదని కూడా వారికి తెలుసు. మేము నీ యంత్రాలము. నీవు యంత్రాన్ని నడిపే దానవు. మమ్ము ముందుకు నడుపు. అశుభాలను తొలగించడం నీ లక్షణం. అందుకే నీకు అశుభహంత్రి అనే పేరుంది. అశుభహంత్రివై ఖడ్గాన్ని త్రిప్పు. నీవే ఖడ్గాన్ని త్రిప్పే ఆ వేగానికి భారతదేశం జోలికి వచ్చే అశుభాలు నశిస్తాయి. జ్ఞానప్రకాశినివై నీ చేతిలో ఉన్న జ్ఞానాదీపాన్ని మాకు చూపు. ఆ వెలుతురు మాలోని అజ్ఞానమనే అంధర్కారాన్ని తొలగించాలి. నీవే మాకు అమ్మవు. మాత, భరతదేశంలో ప్రకటనమవ్వు.

మాతః దుర్గే! నిన్ను పొందిన తర్వాత మళ్ళీ విసర్జించము, శ్రద్ధ-భక్తి-ప్రేమతో నిన్ను బంధించి ఉంచుతాము. రా మాతః, మా మనస్సులో, ప్రాణంలో, శరీరంలో ప్రకటనమవ్వు. |13|


అమ్మా దుర్గమ్మా! ఒక్కసారి నీవు మాలో అవతరించిన తర్వాత, మేము నిన్ను పొందిన తర్వాత, ఇక మళ్ళీ నిన్ను విడిచిపెట్టము. మా దేశము, ధర్మం, మేమూ, ఇన్ని కష్టాలు ఎదురుకొనడానికి కారణం ఇతఃపూర్వం నిన్ను విడిచిపెట్టడమే. నీవు శ్రద్ధ, భక్తి, ప్రేమలకు తప్ప వేరే వేటికీ లొంగవు. వీటితో నిన్ను బంధించి ఉంచుతాము. రా అమ్మ! నీ బిడ్డలైన భారతీయుల మానస్సులో, ప్రాణంలో, శరీరంలో ప్రకటనమవ్వు. భారతదేశంలో అవతరించు.

వీరమార్గప్రదర్శిని, రావమ్మా! ఇప్పుడు విసర్జించము. మా జీవితమంతా అవిచ్ఛినమైన దూర్గాపూజగా అగుగాక, మా సమస్త కర్మలు నిరంతరం పవిత్రమైన ప్రేమమయమము, శక్తిమయమైన మాతృసేవ అగుగాక, ఇదే మా ప్రార్థన మాతః, భారతదేశంలో అవతరించు, ప్రకటనమవ్వు. |14| 


వీర మార్గాన్ని మాకు చూపేదానవు. రావమ్మా! ఈ సారి నిన్ను విడిచిపెట్టము. మా సమస్త జీవితము అవిచ్ఛిన్నమైన దూర్గాపూజ అగుగాక, మే చేసే ప్రతి కర్మ (పని), ప్రేమతో, శక్తితో నిండి, ఆ భవానీ మాతకు నిరంతరం చేసే సేవ అగుగాక. ఇదే మా ప్రార్థన, ఓ మాత, భూమి మీదకు దిగిరా, భారతభూమిలో అవతరించి నిన్ను నువ్వు ప్రకటనం చేసుకో.

Monday 16 October 2017

ప్రపంచ ఆహార దినోత్సవం- ప్రపంచ ఆహార దినోత్సవం



16 అక్టోబరు ను ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుతారు. ఆ సందర్భంగా ప్రపంచ ఆహార దినోత్సవం....

ఆహారం మన జీవితంలో భాగం. ఆహారం లేకపోతే జీవనం లేదు. ఆహార దినోత్సవం సందర్భంగా ఇప్పుడు ప్రపంచమంతా ఆహారభద్రత, పౌష్టికాహార లోపం గురించి మాట్లాడుతోంది. కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం మనం విస్మరిస్తున్నాం. అదే మారుతున్న ఆహారపు అలవాట్లు. ఆహారం కేవలం ఆకలి తీర్చేదే కాదు, అది మన జన్యువుల పై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆధునిక పరిశోధనలు ఋజువు చేస్తున్నాయి. మన పూర్వీకులు ఏ ఆహారం తీసుకున్నారో, దానికి అనుగుణంగా మన జన్యువులు స్పందిస్తాయి. కొత్తరకం ఆహారం తీసుకుంటే శరీరవ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. దాని ప్రభావం భవిష్యత్తులో కనిపిస్తుంది.....  

ఉదాహరణకు మన పూర్వీకులకు పొద్దుతిరుగుడు పూల నూనె, బియ్యపు పొట్టు (రైస్ బ్రాన్) నూనె మొదలైన తెలియవు. ఆయా ప్రాంతాలను బట్టి కొబ్బరి నూనె, నువ్వుల నూనె, పల్లీనూనె, కుసుమనూనె, ఆవనూనెను ఉపయోగించేవారు. ఇప్పుడు మనం వాటిని విడిచి, కొత్తరకం నూనెలు వాడటం వలన అనేక రోగాలు ఉత్పన్నమవుతున్నాయి.

ఒక 50 ఏళ్ళ క్రితం వరకు అన్నం అంటే జొన్న అన్నం, సజ్జ అన్నం, సామ బియ్యం మొదలైనవిగా పేర్కొనేవారు. ఇప్పుడు అన్నం అంటే మనకు తెలిసింది వరి అన్నం ఒక్కటే. అది కూడా పొట్టు తీసిన తెల్ల బియ్యం మాత్రమే. ఒకపట్టు బియ్యం, దంపుడు బియ్యం అసలు తినము. రాగులు, కొర్రలు, వరిగెలు, సజ్జలు మొదలైన చిరుధాన్యాలను మన పూర్వీకులు విరివిగా ఉపయోగించేవారు. అందుకే వారు ఆరోగ్యంతో షుగర్, బిపీ లాంటివి లేకుండా హాయిగా జీవించారు. మరి మన సంగతి?..... నిజానికి బి విటమిన్స్, ఐరన్ మరియు ఇతర పోషకాలు ఉండేది చిరుధాన్యాల్లోనే కాని తెల్ల అన్నంలో కాదు. చిరుధాన్యాలు మంచి ప్రోటీన్ కలిగిన ఆహారం. తెల్లబియ్యంలో ఉండేది పిండి పదార్ధం మాత్రమే.

అదే కాక ఆహారదిగుబడి కోసం వాడే రసాయనిక ఎరువులు, పురుగుల మందులు పంటదిగుబడిలోకి చేరి, తినేవారి శరీరంలోకి చేరుతున్నాయి. అవి క్యాన్సర్ మొదలైన భయానకమైన వ్యాధులను కలిగిస్తున్నాయి. అంతేకక జన్య్వులను సైతం నాశనం చేసి, భావితరాలకు పుట్టుకతోనే రోగాలను, అవిటి తనాన్ని కలిగిస్తున్నాయి. ఆహారం దినోత్సవం అంటే కేవలం ఆకలి గురించే కాక, ప్రస్తుత ఆహారం మానవులకు చేస్తున్న కీడును సైతం గుర్తు చేసేదిగా ఉండాలి.

ఆహారం గురించి ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఏ ప్రాంతంలో ఉంటామో, ఆ ప్రాంతంలో దొరికే ఆహరమే స్వీకరించాలి. ఆయా ప్రాంతాలవారికి అన్ని పోషకాలు అందించడానికి స్థానిక జాతుల్లో అన్ని పోషకాలు లభించేలా ఏర్పాటు చేసింది. ఉదాహర్ణకు ఇప్పుడు మన మార్కెట్ లో కివి పండు దొరుకుతోంది. ఇది ఆస్ట్రేలియాలో పండుతుంది. విటమిన్ సి అధికంగా ఉందని ఇప్పుడు దాన్ని ఇక్కడ అలవాటు చేస్తున్నారు. కానీ కివి కంటే అధికంగా విటమిన్ సి ఉసిరి, జామ కాయలో లభిస్తుంది. ఉసిరికాయ మనదేశంలో పండుతుంది. దాన్ని మాత్రమే మనం స్వీకరించాలి. అలా కాక విదేశీ పండ్లను స్వీకరిస్తే, అవి జన్యువులపై వ్యత్రిఏక ప్రభావాన్ని చూపి, భవిష్యత్తులో సమస్యలను సృష్టిస్తాయి.

అన్నిటికంటే ముందు రసాయనిక వ్యవసాయం ఆగిపోవాలి. గోఆధారిత ప్రకృతి వ్యవసాయం విస్తరించాలి. అప్పుడు మాత్రమే అందరికి సంతులిత పౌష్టికాహారం అందుతుంది. అప్పుడే ప్రపంచం నిజమైన ఆహార దినోత్సవం జరుపుకుంటుంది.

గోవత్స ద్వాదశి



ఆశ్వీయుజ బహుళ ద్వాదశికి గోవత్స ద్వాదశి అని పేరు. పూర్వం దేవదానవులు అమృతం కోసం సముద్ర మధనం చేసినప్పుడు, ఈ రోజున మందర పర్వతం నుంచి నందిని అనబడే గోవు ఉద్భవించింది. దానికి ప్రతీకగా గోవత్స ద్వాదశిని జరుపుకునే సంప్రదాయం వచ్చింది. వత్సము అంటే దూడ. గో అంటే ఆవు. ఈ రోజున దూడతో కూడి ఉన్న గోమాతను పూజించి, అర్ఘ్యం సమర్పించాలి. గోమాత నందిని, కోరిన కోరికలన్నీ తీరుస్తుంది. గోవులోనే సకల దేవతలుంటారు. అలాంటి గోవుకు సేవ చేస్తే ఎంతో పుణ్యం, కార్యసిద్ధి కూడా. ఇదే రోజున ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురంలో శ్రీపాద శ్రీ వల్లభ ఆరాధన ఉత్సవం నిర్వహిస్తారు. మహారాష్ట్రలో దీన్ని దీపావళీ పండుగకు ప్రారంభంగా భావించి, వసు బరస్ అనే పేరుతో జరుపుకుంటారు.

ఓం గోమాత్రే నమః
వందే గోమాతరం