Wednesday 15 March 2017

నేడు ఫాల్గుణ బహుళ తృతీయ- ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి.


ఛత్రపతి శివాజీ నుంచి యువకులు నేర్చుకోవలసింది ఎంతో ఉంది. శివాజికి దేశభక్తి ఎంతో ఉంది, దైవభక్తి, గురుభక్తి అంతే ఉంది. శివాజీ రాజైనా గర్వం ఇసుమంత కూడా ఉండేది కాదు. ఏ యోగి కనిపించినా అతడిని గౌరవించి, రాజ్యాన్ని వదిలి వారి వెంట వెళుతూండేవాడు. భజనలు, కీర్తనలు ఎక్కడ జరుగుతున్నా శివాజీ అక్కడే ఉండేవాడు. దైవభక్తిని, ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. రాజ్యమదం అతనికి ఎంత మాత్రం లేదు. శివాజీకి శ్రీ తుకారాంబావాజీ అంటే ఎంతో భక్తి. ఎంత దూరమైన ఆయన భజనలకు వెళుతూ ఉండేవాడు. ఒకరోజు భక్తి పారవశ్యంలో శివాజీ తుకారాం వద్దకు పోయి, నిజమైన భక్తిని ఉపదేశించమని వేడుకున్నాడు. అప్పుడు తుకారం 'నేను నీకు ఉపదేశించేవాడిని కాదు. చక్కని ఉపదేశం కావాలనుకుంటే వెళ్ళి, సమర్థ రామదాసు కాళ్ళపై పడు' అని మధురమైన మాటలతో ఆనతిచ్చాడు. కానీ సమర్థ రామదాసు గారు ఎప్పుడు ఎక్కడ ఉంటారో, ఆయన శిష్యులే తెలియదు. ఇక శివాజీ ఎలా వెతకగలడు. ఆయన కోసం అనేక మఠాలు తిరిగాడు, ఎన్నో అడువులను జల్లెడ పట్టాడు. అయినా రామదాసు జాడ దొరకలేదు. చివరకు, సమర్థ రామదాసు గారి దర్శనం లభించేంత వరకు కనీసం నీరు కూడా ముట్టనని ప్రతిజ్ఞ చేశాడు. అది గురువు యందు భక్తి అంటే. శిష్యుడు సిద్ధమైనప్పుడు గురువు లభిస్తాడు. తానే నడిచి వస్తాడు. అంతటి కరుణామూర్తి సద్గురువు. ఆఖరికి స్వప్నంలో శివాజీ ఎదుట ఒక మహాపురుషుడు వచ్చి నిలబడ్డాడు. ఆయనే సమర్థ రామదాసు.

మరునాడు ఉదయం శివాజీ నిద్రలేచి మంచం దిగకముందు ఒక సన్యాసి (సమర్థ రామదాసు శిస్ష్యుడు), రామదాసుగారి నుంచి శివాజీని కలుసుకోవడం కోసం నిర్దేశించిన జాబు తీసుకువచ్చాడు. ఆ జాబులో ఇలా ఉంది. 'యాత్రకు వెళ్ళవలసిన పుణ్యక్షేత్రాలన్నీ నాశనం చేయబడ్డాయి. బ్రహ్మక్షేత్రాలు అపవిత్రం చేయబడ్డాయి. ప్రపంచమంతా అల్లకల్లోలం చేయబడింది. ధర్మం ఎక్కడా కనపడటంలేదు. ధర్మాన్ని కాపాడటం కోసం భగవంతుడు నిన్ను ఏర్పరిచాడు. ఈ దేశంలో అనేక మహారాజులు, మంత్రులు, రాజనీతికోవిదులు, గొప్పపండితులు, ఉన్నా ధర్మాన్ని రక్షించే వాతు ఎవ్వరూ లేరు. మహారాష్ట్ర ధర్మమంతా నీ మీదనే ఆధారపడి ఉంది. నేను నీ రాజ్యంలోనే ఇనాళ్ళు ఉన్నప్పటికి నన్ను నీవు కనగొన లేదు. అందుకు కారణం ఏంటో నేను చెప్పలేను. నీ మంత్రులు బుద్దిమంతులే. నీవు ధర్మమూర్తివి. అందుచేత నీకు మాటిమాటికి హితోపదేశము చేయనక్కఱలేదు. ధర్మము పునరుద్ధరించడం అనే ప్రతిష్ఠ నీకే దక్కాలి. అది నీవు పోగొట్టుకొన కూడదు. అతి సామన్యములైన రాజకీయ విషయములపై నా శ్రద్ధ నిలిచి యున్నది. ఈ ఉపదేశం వలన మనసులో ఆగ్రహించక నన్ను క్షమించు.' ఒక రాజుకు లేఖ రాస్తున్నప్పుడు ఎంత మర్యాదగా రాస్తారో అంత మర్యాదగా శివాజీకి జాబు రాశారు రామదాసు గారు. ఆ తర్వాత శివాజీని తన దగ్గరకు పిలిపించుకుని రహస్యంగా ఉపదేశం చేశారు. శివాజీకి గురువు పట్ల ఎనలేని భక్తి ఉండేది. చలించని విశ్వాసం ఉండేది. అదే ఆయనకు శక్తినిచ్చింది.

ఒకసారి యుద్ధ సమయం సమీపించిన తరుణంలో శివాజీ శ్రీశైలం వచ్చి తపస్సు చేశారు. అమ్మవారిని మెప్పించి ఖడ్గం పొందారు. ఎంతో బలం, బలగం ఉన్నా, శివాజీకి దైవభక్తి, గురుభక్తి అచంచలంగా ఉండేది. అదే ఆయన్ను అంత గొప్పగా నాయకుడిగా నడిపించింది.

No comments:

Post a Comment