Sunday 7 August 2016

హిందూ ధర్మం - 220 (జ్యోతిష్యం - 2)

విశ్వగతిలోని అంతరార్ధాన్ని వేదసంస్కృతి అర్దం చేసుకుంది. విశ్వగమనానికి, ఋతువులు, కాలనుగుణంగా జరిగే పరిణామాలకు సంబంధాన్ని తెలుసుకుంది. అనుదులో భాగంగానే గ్రహగతులు, పగులు, రాత్రి గణన, ఋతువులను నిర్ణయించడాన్ని లోతుగా పరిశీలించింది. అందువల్లనే జ్యోతిష్యం (ఇక్కడ ఫలిత జ్యోతిష్యం గురించి ప్రస్తావించడం లేదు) గ్రహాలు, గ్రహకూటములు, నక్షత్ర కూటములు, ఉల్కలు, తోకచుక్కలు, భ్రమణాలు, కాంతిని వెలువరించే ఇతర వస్తువులను వివరించింది.

ఋగ్వేదానికున్న వేదాంగ జ్యోతిష్యాన్ని అందించిన మహానుభావుడు మహర్షి లగధాచార్యులు. ఇందులో 36 శ్లోకాలున్నాయి. అలాగే యజుర్వేదానికి, అధర్వణ వేదానికి కూడా జ్యోతిష్య శాస్త్రం ఉంది. యజుర్వేద జ్యోతిష్యానికి మూలపురుషుడు శోషాచార్యులు, ఆయన 34 పద్యాల్లో దాన్ని వివరించారు. అధర్వణవేద జ్యోతిష్యంలో 14 కాండలు, 102 శ్లోకాలున్నాయి. ఇది పితామహుడు, కశ్యపుడికి మధ్య జరిగిన సంవాదం రూపంలో ఉంది, పితామహుడు చెప్పగా, కశ్యపుడు విన్నాడు.

వేదంలో జ్యోతిష్యానికి బీజం పడగా, మహర్షుల వలన అది అనుకురించింది. అటు తర్వాత ఎందరో జ్యోతిష్యవేత్తలు ఎంతో పరిశోధించి దీన్ని గొప్ప శాస్త్రంగా రూపొందించారు. అందులో పరాశర మహర్షి గురించి గొప్పగా చెప్పుకోవాలి. వారు బృహత్ పరాశరం అనే గొప్ప జ్యోతిష్య గ్రంధాన్ని రాశారు. వీరి తర్వాత ఆర్యభట్టు. ఈయన క్రీ.పూ.6 వ శతాబ్దానికి చెందినవాడు. కలియుగం 337 వ సంవత్సరంలో తాను పుట్టానాని ఆయనే తన గ్రంధమైన ఆర్యభట్టీయంలో చెప్పుకున్నాడు. ఈయన జ్యోతిష్య (ఖగోళ) శాస్త్రానికి సంబంధించి ఎన్నో రచనలు చేశారు. ఈయన ఆర్యభట్టీయంలో గణితంతో పాటు జ్యోతిష్యం (ఖగోళం) కూడా ఉంది. ఈయన తన రచనల్లో గణితం, బీజగణితం, గోళాకార త్రికోణమితి, సరళ త్రికోణమితి మొదలైనవాటికి సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించారు. వాటిలో నిరంతర భిన్నాలు, వర్గ సమీకరణాలు, ఘాతక శ్రేణి కూడికలు, సైన్ల పట్టిక వంటి ఎన్నో విషయాలున్నాయి. ఈయన రాసిన ఆర్యసిద్ధాంతం అనే గ్రంధం లుప్తమవ్వగా, ఆయన జ్యోతిష్య సూత్రాలను వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు, భాస్కరాచార్యులు-1 మొదలైనవారు తమ రచనల ద్వారా తిరిగి ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఆయన రాసిన ఆర్యసిద్ధాంతం సూర్యసిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని వచ్చింది. అందులో ఖగోళ శాస్త్రానికి సంబంధించిన అనేక పరికరాల ప్రస్తావన కూడా ఉంది. ఉదాహరణకు శంఖుయంత్రము, ఛాయా యంత్రము, ధనుర్ యంత్రము/ చక్ర యంత్రము, యస్తి యంత్రము, అవి కాక ధనుర్ యంత్రము, యస్తి యంత్రానికి సంబంధిచిన నీటి గడియారాల ప్రస్తావన వీటి యందు ఉంది.  ఆర్యభట్టు ద్వారా ప్రపంచానికి అందించబడిన ఎంతో విజ్ఞానాన్ని సా.శ.9 లో ప్రముఖ పండితుడు, ఆల్-బెరూని అరేబియన్ భాషలోకి అనువదించాడు. అలా హిందూ విజ్ఞానం అరబ్‌లోకి వెళ్ళి అక్కడివారి అజ్ఞానాన్ని తరిమే ప్రయత్నం చేసింది.

ఆర్యభట్టియంలో 108 శ్లోకాలున్న కారణం చేత దాన్ని ఆర్యశతాష్ట అనేవారు. అది ఛంధోబద్ధమైన శాస్త్రం కనుక దాన్ని అర్దం చేసుకోవడం, అనువదించడం సనాతనధర్మాన్ని, వేదవేదాంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వారికే సులువుగా ఉంటుంది. 108 శ్లోకాలు, 13 పరిచయ శ్లోకాలున్న ఈ గ్రంధాన్ని 4 పాదాలుగా విభజించవచ్చు.

గీతికాపాదం - 13 శ్లోకాల ఈ పాదంలో కల్పం, మన్వంతరం, యుగం మొదలైన విశ్వానికి సంబంధించిన పెద్ద పెద్ద కాలాల వివరణ ఉంది. ఇందులో జ్యా (sine పట్టిక గురించి కూడా చెప్పబడింది. ఒక మహాయుగంలో గ్రహ భ్రమణాల వ్యవధి 43,20,000 సంవత్సరాలు.

గణితపాదం - 33 శ్లోకాల ఈ పాదంలో క్షేత్ర వ్యవహారం (క్షేత్రగణితం/ క్షేత్రమితి), బీజగణితం, రేఖాగణిత గమనాలు, శంఖు, ఛాయ, సాధారణ, వర్గ, ఏకకాలిక మరియు అనిర్దిష్ట సమీకరణాల (simple, quadratic, simultaneous, and indeterminate equations) వివరణ ఉంది.

కాలక్రియాపాదం - 25 శ్లోకాల ఈ పాదంలో కాల విభాగాలు, ఒకానొక రోజున గ్రహాల గతి, అధికమాసాన్ని గణించే పద్ధతి, క్షయ తిధులు మరియు వారాన్ని 7 రోజులుగా, 7 రోజులకు 7 పేర్లను ఇందులో వివరించారు.

గోళపాదం - 50 శ్లోకాల ఈ పాదంలో అంతరిక్ష సంబంధమైన గోళాలు (celestial sphere), ఖగోళ కక్ష్య యొక్క లక్షణాలు (features of the ecliptic), ఖగోల మధ్యరేఖ (celestial equator), node, భూగోళ ఆకారం, పగులురాత్రికి గల కారణాలు, దిగంతం (horizon)లో రాశిచక్రాల ఉదయము మొదలైనవి రేఖాగణిత, త్రికోణమితి అంశాలతో వివరించారు. వీటితో పాటు తనకు ముందు ఉన్న మహర్షులు, ఆచార్యులు, వారి రచనలు, తనపై వాటి ప్రభావాన్ని వివరించారు.

To be continued ................

No comments:

Post a Comment