Friday 27 March 2015

శ్రీ రామ నవమి

* శ్రీ రామ నవమి*
************************
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు  భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.


ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. మద్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో శ్రీ రాముడి కల్యాణం జరుగుతుంది. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా వసంతోత్సవం (ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు.

సేకరణ: Sahana Meenakshi​ గారికి ప్రత్యేక కృతజ్ఞతలతో

*ఆయుర్వేద రహస్యం *
*******************************
ఈ రోజు బెల్లం, మిరియాలు కలిపి చేసిన పానకం, వడపప్పు (నానపెట్టిన పెసరపప్పు) నివేదన చేయాలి. దీనికి ఆయుర్వేదంలో ప్రాశస్య్తం ఉంది. రామనవమి వసంత నవరాత్రుల్లో చివరి రోజున చేస్తారు. ఈ నవరాత్రి ఉత్సవాలు శిస్రఋతువు ముగుసి వసంతఋతువు ప్రారంభంలో వస్తాయి. ఋతువుమార్పు వలన ప్రజల్లో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. పానకంలో వేసే మిరియాలు ఈ కాలంలో వచ్చే దగ్గు, జలుబులను నివారిస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కాని మిరియాలకు వేడిని కలిగించే లక్షణం ఉంది, దానికి విరుగుడుగా బెల్లం నీళ్ళు, వడపప్పు పెడతారు. ఇవి చలువ చేస్తాయి. పెరుగుతున్న ఎండల నుంచి తట్టుకోవాలంటే చలువ చేసే ఆహార పదార్ధాలను తీసుకోవాలి. అందుకోసమే వడపప్పు, పానకం నివేదన. కనుక శ్రీరామనవమి రోజు తప్పకుండా వడపప్పు, మిరియాలతో చేసిన బెల్లం పానకం తీసుకోవడం వలన రామనుగ్రహంతో పాటు ఆరోగ్యం రక్షించబడుతుంది.

అందరికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు 

No comments:

Post a Comment