Tuesday 30 September 2014

గాయత్రి మంత్రం

ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం
భర్గోదేవస్య ధీమహి – ధీయో యోనః ప్రచోదయాత్‌!

గాయంతం త్రాయతే ఇతి గాయత్రి. గాయంతం అంటే గానం చేయడం,పాడడం. గాయత్రి మంత్రాన్ని నిత్యం గానం చేసే వారిని రక్షించేది గాయత్రి అని అర్దం.

గాయత్రి చంధసాం మాత - అన్ని మంత్రాలకు తల్లి గాయత్రి అని అర్దం.

తద్యత్ ప్రాణం త్రాయతే తస్మాద్ గాయత్రి.ప్రాణాలను రక్షించేది గాయత్రి అని అర్దం.

గాయత్రి వేదమాత. గాయత్రి మంత్రానికున్న శక్తి వర్ణించలేనిది. 24 అక్షరాల ఈ మహా మంత్రానికి 32 మంది అధిదేవతలున్నారు. ఈ మంత్రాన్ని రక్షించేవారు. శివు
డు, విష్ణువు, బ్రహ్మ, నరసింహుడు, ఇంద్రుడు, సూర్యుడు..... ఇలా. ఒక్కసారి గాయత్రి మంత్రాన్ని జపిస్తే ఇంతమంది మన నిత్య జీవితంలో ఏదురయ్యే కష్టాలను తొలగించగల 32 దేవతలను స్మరించిన ఫలితం వస్తుంది.

అందుకే "గాయత్రి పరమో మంత్రః"అన్నారు. అంటే గాయత్రికి మించిన మంత్రం లేదు అని, గాయత్రీ మంత్రమే పరమమంత్రమని అర్దం. జ్ఞాపక శక్తిని పెంచి తీరుతుంది గాయత్రి మంత్రం.

ప్రపంచంలో గాయత్రి మంత్రం మీద జరుగినవి, జరుగుతున్న పరిశోధనలు మరే మంత్రం మీద కాని, ఇతర మతాల్లోని ఏ అంశం మీద గాని జరగలేదంటే అతిశయొక్తి కాదు. ఇప్పటివరకు గాయత్రి మంత్రం మీద జరిపిన ఏ అధునిక పరిశోధన విఫలమవకపోవడం ఆశ్చర్యం.

అనాదికాలం నుంచి భారతీయ ధర్మంలో గాయత్రిమంత్రాన్ని వర్ణబేధం లేకుండా స్త్రీపురుషులందరూ ఉపాసించారు.

'ఓ సచ్చిదానందా! అనంతస్వరూప! ఓ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ! ఓ నిరాకారా! సర్వశక్తివంతుడగు న్యాయకారీ! ఓ కరుణామృత వారధీ! నీ దివ్యము, వరేణ్యమూ అగు విజ్ఞానరూపమునుమేము నిత్యము ఉపాసింతుము. మాకు ధారణశక్తి గల బుద్ధినిత్తువు గాక! మేము ఆ బుద్ధి సహాయమున బ్రహ్మచర్యాది సద్‌వ్రతాలను ఆచరితుము గాక! విద్యా జ్ఞానము మొదలైన పరమసుఖములను పొందెదము గాక!' అంటూ గాయత్రి మంత్రానికి ఒక అర్దం ఉంది.   

Monday 29 September 2014

అన్నపూర్ణదేవి

అన్నం పరబ్రహ్మస్వరూపం. ఇది తరచూ పెద్దలు చెప్పే మాట. శాస్త్రమూ చెప్పిన మాట. అన్నం నుండే సమస్త జీవరాసి పుడుతోంది. ఆహారం తీసుకోవడం చేత, అది సప్తధాతువులుగా మారి, శరీరపోషణకు కారణమవుతోంది. సప్తధాతువుల్లో చివరివైన వీర్యం/అండంగా మారి, జీవరాశి ఉద్భవించడానికి కారణమవుతోంది. ఆహారం చేతనే సకల జీవరాశి జీవనం సాగిస్తోంది. 

అన్నం అనగానే మన తెలుగిళ్ళలో బియ్యం ఉడకబెట్టగా తయారయ్యే పదార్ధం అని కాకుండా, సంస్కృత భాషలో అన్నం అంటే ఆహారం అన్న అర్దం ఉంది. ఈ లోకంలో ఆయా వాతావరణపరిస్థితులు, ప్రాంతాలను బట్టి వారి ఆహారపు అలవాట్లు ఉంటాయి. సంస్కృతభాషలో ఏ రకమైన పదార్ధానైనా అన్నం అనే అన్నారు. అందువల్ల ఏ విధమైన ఆహారపదార్ధానైనా పారేయడం దోషం అంటుంది శాస్త్రం. అంతే కాదు అహారం తినే సమయంలో కింద పడ్డ ఒక్కొక్క అన్నం మెతుక్కి 10,000 సంవత్సరాల నరకం అనుభవించవలసివస్తుంది. ఎన్నో జన్మలు ఆహారంలేక బాధపడవలసిన అగత్యం పడుతుందని శాస్త్రం చెప్పిన మాట.

ఎప్పుడు కూడా అన్నం మీద కోపం చూపించకూడదదు. పరబ్రహ్మస్వరూపమైన ఆహారాన్ని వృధా చేయకుండా తినడమే మనం అన్నపూర్ణదేవికి ఇచ్చే గౌరవం. ఆకలితో మానవులకు, ఇతర జీవరాశులకు ఆహారాన్ని అందించి క్షుద్(ఆకలి) బాధ తీర్చడమే మనం అన్నపూర్ణాదేవికి చేసే నిజమైన అర్చన.

ఆదిభిక్షువైన 
ఆ సదాశివునికి భోజనవే నిత్యం బంగారుపాత్రలో ఉన్న ఆహారన్ని, బంగారు గరిటెతో వడ్డించే ఆ అన్నపూర్ణదేవి ఈ లోకంలో అందరికి యొక్క ఆకలిని తీర్చుగాకా. అందరికి జ్ఞానాన్ని, వివేకవైరాగ్యాన్ని ప్రసాదించుగాకా. 

Thursday 25 September 2014

పూజ మాత్రం మానకండి

శ్రీ దేవి ఖడ్గమాల స్తోత్రం చాలా విశిష్టవంతమైనది. హిందూ సామ్రాజ్య స్థాపకుడు, ఛత్రపతి శివాజీకి తుల్జాభవాని ఖడ్గాన్ని ఈ ఖడ్గమాలా స్తోత్రం పఠించాకా ఇచ్చిందని చెప్తారు. ఖడ్గమాలా స్తోత్రం శారీరిక, మానసిక రుగ్మతలను దూరం చేస్తుంది. ఈ నవరాత్రుల్లో దేవి ఆరాధన తప్పకుండా చేయాలి. కలశం పెట్టి ఆరాధన చేయలేని వారు, ఉద్యోగ రీత్యా, విద్యాకారణాల చేత ఇంటికి దూరంగా, హాస్టల్లో ఉండేవారు, కలశ స్థాపన చేసి నిష్ఠగా ఆరాధన చేయలేనివారు బాధపడవలసిన అవసరంలేదు. ఈ 9 రోజులు రెండు పూటల శ్రీ దేవి ఖడ్గమాల స్తోత్రం పఠించడం, కుదిరితే శ్రీ లలితా సహస్రనామావళి చదవడం, అమ్మవారికి సంబంధించిన కధలు వినడం అత్యంత శ్రేయోదాయకం.

మీరు పూజ చేయడానికి స్థలం లేదని బాధపడనవసరంలేదు, పూజ మానవలసిన పనేలేదు. ఉదయం స్నానం చేశాక, సాయంత్రం కాళ్ళూ, చేతులు కడుగుకుని, ఏ కుర్చిలోనో కూర్చుని అయినా సరే, కంప్యూటర్ ముందు కూర్చున్న సరే, అమ్మవారి ముందు కూర్చున్నామన్న భావనతో అమ్మవారికి సంబంధించిన ఏదో ఒక స్తోత్రాన్ని చదువుకోండి. ఏ ఒక్క శ్లోకం కూడా కంఠస్థంగా రాకపోతే, ఇంటర్‌నెట్‌లో చూసైన చదవండి. సనాతన ధర్మంలో మానసికపూజకు విశేషస్థానం ఉంది. మీ ముందు అమ్మవారి ఫోటో కూడా ఉండనవసరంలేదు. మే మనసులో అమ్మవారి రూపం ఉంటే చాలు. మీ మనసులో అమ్మవారికి కుంకుమపూజ చేస్తున్నట్లుగా భావన చేయవచ్చు, మనసులోనే నివేదన చేయచ్చు, హారతి ఇవ్వచ్చు. మానసికంగా చేసినా, భక్తితో చేస్తే తప్పక ఫలితం ఉంటుంది. అమ్మ అనుగ్రహం కలుగుతుంది. పూజ మాత్రం మానకండి.

అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.

ఓం శ్రీ మాత్రే నమః 

Wednesday 24 September 2014

నవరాత్రి

నవ అంటే తొమ్మిది. సంస్కృత భాషలో నవానాం రాత్రీనాం సమహరః నవరాత్రి. అంటే నవరాత్రి తొమ్మిది రాత్రుల సమహారమని. ఈ తొమ్మిది రాత్రులు అమ్మవారిని ఆరాధించాలి కనుక దేవి నవరాత్రులన్నారు.

నవ సంఖ్య పరిపూర్ణతకు చిహ్నం.ఈ నవరాత్రులు మనిషికి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తాయి. ఈ నవరత్రులలో దేవిభాగవతం చదవడంకానీ,వినడంకాని చేస్తారు.

అమ్మవారు వివిధ రూపాల్లో రాక్షసులను సంహరించింది. నిజానికి రాక్షసులు ఎక్కడొ లేరు. మనలోనే,  ఆలోచనలలో, మనసులో ఉన్న చెడు భావాలలో, దురలవాట్లు, కుళ్ళు కుతంత్రాలే రాక్షసులు. వారిని ఈ తొమ్మిది రాత్రులలో ఈ దేవి భాగవత పారాయణతో వాటిని సంహరించి జయించడం, మనలను మనం సంస్కరించుకోవడమే విజయదశమి పండుగ.          

నవ అంటే పరమేశ్వరుడని, రాత్రి అంటే పరమేశ్వరి అని కూడా అర్ధాలు ఉన్నాయి. అలాగే నవ అంటే క్రొత్తది అని కూడా అర్ధం ఉంది. 9 రోజులు ఆరాధన చేయలేని వారు 7 రోజులు కానీ,5,3 లేదా కనీసం చివరి రోజైనా తప్పక ఆరధించాలి అని శాస్త్రం చెప్తొంది.

ఆ కాలంవారికి పనిపాటలేదు కనుక ఎప్పుడు పూజలు పునస్కారాలు చేసేవారు,మాకైతే ఉదయం ఆఫీసు ఉంటుంది, కాలేజీ ఉంటుంది, లేదా వేరే పని ఉన్నదని తప్పించుకోవటానికి లేదు. ఎందుకంటే ఇది రాత్రి విశేషంగా చేయవలసిన పూజ. సాయంకాలం నుండి రాత్రి 9గంటలలోపు చేయవలసిన ఆరాధన. ఆ సమయానికి అందరు ఇంటికి చేరుకుంటారు కనుక తప్పించుకునే అవకాశం లేదు.

పూర్వకాలంలో అయితే చాలామంది వ్యవసాయం మీదే ఆధారపడేవారు వారు. ఉదయం పొలానికి వెళ్ళినా సాయంకాలనికి ఇంటికి చేరినాక, సాయంకాలం తప్పక పూజ చేసేవారు. అందువల్ల పూజలేవి కూడా మన పనులకు అడ్డురావు మనంకు ఇష్టం లేకపొతే తప్ప.

పవంచ వింధ్య వాసిన్యాం నవరాత్రోపవాసతః|
ఏక భుక్తేన నక్తేన తధైవాయాచితేన చ||
ఈ నవరాత్రి వ్రతాని ధర్మబద్ధంగా సంపాదించిన ధనంతో ఆచరించాలని,ఆచరించేవారు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలని అర్దం.

పూజనీయా జనైర్దేవి స్థానే స్థానే పురే పురే|
గృహే గృహే  శక్తి పరైర్ర్గ్రామే గ్రామే వనే వనే||
ఈ వ్రతాన్ని ప్రతినగరంలోను,ఇంట్లోను,గ్రామంలోను,వనంలొ ప్రతి చోట ఆచరించాలి అని అర్దం.

ఒక సాధకుడి జీవితంలో నవరాత్రులను మూడు భాగాలుగా విభజించి ఆ దేవికి వుండే మూడు అంశలుగా భావించి ఆరాధించడంవల్ల ఎంతో పవిత్రమైన సత్యం ఆవిష్కరణ అవుతుంది. దేవికి తొమ్మిది రోజులు చేసే నవరాత్ర పూజ ఆత్మ సాక్షాత్కారానికి అనువైన మార్గంగా బోధిస్తున్నారు స్వామి శివానంద. మొదటి 3 రోజులు దుర్గగా, తర్వాతి మూడు రోజులు లక్ష్మీదేవిగా, చివరి 3 రోజులు సరస్వతీదేవిగా అమ్మను ఆరాధించాలి.

Tuesday 23 September 2014

దేవినవరాత్రులు

ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్ష పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రాత్రులను దేవినవరాత్రులు అంటారు.

పౌర్ణమి రోజున అశ్విని నక్షత్రం ఏ నెలలో అయితే ఉంటుందొ ఆ నెలను ఆశ్వీయుజమాసం అంటారు.శుక్లపక్షం అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకు గల 15 రోజుల కాలము అని అర్దం.ఇదే మొదటి పక్షం కూడా.దీనినే శుద్ధపక్షం అని కూడా అంటారు.

ఈ కాలంలో నక్షత్రమండలంలోని దేవి మండలం విశేషమైన శక్తిని కలిగి ఈ భూమి మీదకు తన విద్యుతయస్కాంత తరంగాలను,కాస్మిక్ కిరణాలను అధికంగా పంపిస్తుంటుంది.ఆ కాంతిపుంజాలను,తరంగాలను మన శారీరంలో చేరి,మనకు మరింత మానసిక,శారీరిక శక్తి చేకూరి,మేధాశక్తి పెరిగి జీవితం సుఖమయం కావాలి అంటే దేవిని (శక్తి, పార్వతి, సరస్వతి, లక్ష్మీ, దుర్గ... ఇలా ఏ పేరున పిలిచినా పలికే ఆ జగన్మాతను) ఆరాధించాలి.      

ఈ నవరాత్రులలో దేవిని ఆరాధిస్తాం కనుక వీటిని దేవి నవరాత్రులు అన్నారు.
ఇవి శరత్ ఋతువులో వస్తాయి కనుక వీటిని శరన్నవరాత్రులు అంటారు.

శరత్కాలం నిర్మలత్వానికీ,శరశ్చంద్రుడు ప్రశాంతతకూ ప్రతీకలు.నిర్మలమైన ప్రేమ,కరుణ కురిపించే చల్లని మనస్సు మాతృ మూర్తి సహజ లక్షణాలు.అందుకే నిర్మల,ప్రశాంత తరంగాలతో నిండిన శరత్కాలం అంటే జగన్మాతకు అత్యంత ప్రీతి.

శరత్కాలం,వసంతకాలలను యమద్రంస్టలని,మృత్యుకోరలని అంటారు.అంటే ఆ సమయంలో యముడు తన నోటిలొని కోరలు బయటకు వస్తాయని,వాటి ద్వార ప్రజలను హరిస్తాడని శాస్త్రం.యముడు దేవుడు కదా.ఎక్కడైనా దేవుడు తన పిల్లలను చంపుతాడా? అని మీకు అనిపించవచ్చు. యముడంటే మృత్యువని కూడా అర్దం. అనేకానేక వ్యాధులు వ్యాపించి జీవరాశి మృత్యువొడిలొకి చేరే కాలమిది. అందుకే వీటిని యమద్రంస్టలన్నారు.

అందువల్ల ఈ కాలంలో దేవి ఆరాధన చేయడం చేత అంటురోగాలు, వ్యాధులు వ్యాపించకుండా ఉండి అందరూ ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో జీవించడానికి దేవి ఆరాధన తప్పక చేయలని శాస్త్ర వచనం.

Monday 22 September 2014

శివ సంకల్ప సూక్తం - 1

యజ్జాగ్రతో దూరముపైతి దైవం
తదు సుప్తస్య తధైవైతి
దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం
తన్మేమనః శివసంకల్పమస్తు - యజుర్వేదం 31-1 (శివ సంకల్ప సూక్తం)

భావం: దివ్యగుణములు కలది, జాగ్రదావస్థలోనూ, నిద్రావస్థలోనూ దూరంపోవునటువంటిది, ఇంద్రియజ్యోతులకు ప్రకాశమైన నా మనసు శుభసంకల్పాలనే చేయుగాకా! (మంచి ఆలోచనలే నాకు వచ్చుగాకా). 

Monday 8 September 2014

గణపతి చేతిలో మోదకం

గణపతి చేతిలో మోదకం.............

'పూర్ణమోదక ధారిణం' అంటూ గణపతిని స్తుతిస్తాం. గణపతి పూర్ణ మోదకాన్ని పట్టుకుని ఉంటాడు. మోదకం జ్ఞానానికి సంకేతం. జ్ఞానం అంటే ఇహలోకానికి(మనకు కళ్ళకు కనిపించే ఈ లోకం) సంబంధించిన జ్ఞానం అని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్న ఈ జగత్తంతా, ఏదో ఒకనాడు నశించిపోతుంది. అప్పుడు ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం కూడా నశించిపోక తప్పదు. కానీ, ఎప్పటికి నశించని పరలోకం, పరతత్వం, పరబ్రహ్మం ఒకటున్నది. అది ఎప్పటికి నశించదు, దానికి సంబంధించిన జ్ఞానం కూడా శాశ్వతమైనది. అది ఆత్మకు సంబంధించిన జ్ఞానం. అది మహోత్కృష్టమైనది. అటువంటి జ్ఞానమే మనకు పూర్ణత్వాన్ని తిరిగి ప్రసాదిస్తుంది, భగవంతుడిని చూడగల శక్తినిస్తుంది, ఆఖరున పరమాత్మలో ఐక్యం చేస్తుంది, చిదానందాన్ని ఇస్తుంది. అటువంటి జ్ఞానమే జ్ఞాన ప్రదాత అయిన గణపతి చేతిలో మోదకమైంది. మోదాన్ని ఇవ్వడం గణేశ తత్వం. మోదం అంటే ఆనందం. ఎవరికి ఇతరులకు, ఆర్తులకు, కష్టాల్లో ఉన్నవారికి మాటలచేత, ఆర్ధికంగా, ఇతరత్రా విధానాల ద్వారా బాధను తగ్గిస్తారో, ఆనందాన్ని చేకూరుస్తారో, ధైర్యాన్ని ఇస్తారో వారికి తన చేతిలో మోదకాన్ని ఇస్తాడు గణపతి.

ఓం గం గణపతయే నమః           

Saturday 6 September 2014

దూర్వా (గరిక) మహత్యం

దూర్వా (గరిక) మహత్యం గురించి క్లుప్తంగా కధ చెప్పుకుందాం

ఒకసారి సమ్యమనీపూరంలో జరుగుతున్న మహోత్సవాన్ని తిలకించడానికి సర్వదేవతలు, గంధర్వులు, అప్సరసలు అందరూ తరలివచ్చారు. ఆ సభలో తిలోత్తమ నాట్యం చేస్తుండగా ఆమెను చూసి యముడు కామించగా, ఆయన రేతస్సు పతనమైంది. దాని నుంచి జ్వాలలతో మండుతోన్న వికృతరూపుడు, భయంకరమైన కోరలుగల అనలాసురుడనే రాక్షసుడు జన్మించాడు. వాడు చేసే పెద్దపెద్ద అరుపులకు లోకాలు హడలిపోయాయి. వాడి అరుపలకు భయపడిన ఋషులు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి శరుణువేడగా, విష్ణుమూర్తి వారిని తీసుకుని గణపతి వద్దకు వెళ్ళి, బహువిధాలుగా స్తోత్రం చేస్తారు.

అప్పుడు బాలగణపతి వారితో 'దేవతలారా! అనలాసురిని భయం నుంచి రక్షించడానికే నేను అవతరించాను' అని చెప్పి, వాడిని చూడగానే
మీరు నన్ను ఉద్రేకపరచండి. నేను వాడిని సంహరిస్తాను అన్నాడు. ఇంతలో అనలాసురుడు భూలోకానికి వచ్చి, విజృంబించాడు. వెంటనే మునులు భయంతో పరుగులు తీశారు. వాడి నుంచి తప్పించుహ్కోవడం బాలగణపతికి కూడా సాధ్యకాదని, ఆయన్ను కూడా పారిపొమ్మని అరిచారు. కానీ గణపతి వారి అరుపులకు భయపడలేదు. అనలాస్రుడు గణపతిని చూసి, ఆయన బాలస్వరూపాన్ని చూసి నవ్వగా, గజాననుడు మాహపర్వతంలా తన రూపాన్ని విస్తరించి కాలాగ్నిలా మండిపడుతున్న అనలాసురిడిని తన యోగమాయాబలంతో పట్టుకుని మ్రింగేశాడు. వాడి వేడి కారణం చేత గణపతికి విపరీతమైన తాపం కలిగింది.

బాలగణపతి తాపన్ని తీర్చడం కోసం ఇంద్రుడు చల్లటి చంద్రకళను ఇచ్చాడు. అది ధరించిన గణపతి ఫాలచంద్రుడయ్యాడు కానీ ఆయన తాపం తీరలేదు. వరుణుడు సముద్రాలలో ఉన్న చల్లని జలాలతో అభిషేకించాడు. విష్ణువు కమలాలను ప్రసాదించాడు. అయినా గణపతి తాపమ తగ్గలేదు. శివుడు వేయి-పడగల సర్పాన్ని గణపతి ఉదరానికి బంధించగా, గణపతికి వ్యాళబద్ధుడనే పేరు వచ్చింది. ఆయన స్వామి తాపం తీరలేదు. బ్రహ్మ సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు శక్తులను గణపతికి ప్రసాదించగా, తాపం తీరడం కోసం వారు గణపతి హత్తుకున్నారు, కానీ గణపతి తాపం తీరలేదు. అగ్నిలో వేసినది, అగ్నిలోనే లయమైనట్టు, పరబ్రహ్మమైన గణపతిలో సిద్ధిబుద్ధి ఐక్యం అయ్యారు. ఆఖరున 88,000 మహర్షులు వచ్చి, ఒక్కక్కరు 21 గరికపోచలను సమర్పించగా, స్వామి తాపం తగ్గిపోయింది. ఆ విషయం తెలుస్కున్న దేవతలు బాలగణపతిని దూర్వాంకురాలతో అర్చించారు. గరికతో అర్చించడం వలన పరమానందం పొందొ గణపతి దేవతలకు, ఋషులకు అనే వరాలు ప్రసాదించి 'ఎంత భక్తితో నా పూజ చేసినా దూర్వాకుర రహితమైన పూజ వ్రాధా అవుతుంది. అందువలన నా భక్తులైనవారు ప్రాతఃకాలంలో ఒక్కతికానీ, 21 కానీ దుర్వాలతో నన్ను అర్చిస్తే, వందయజ్ఞాలు చెసినదానికంటే అధికఫలం లభిస్తుంది. నేను గరికపోచలతో అర్చించినవారికి సులభంగా ప్రసన్నుడనవుతాను అంటూ గణపతి పలికాడు.

అందుకే గణపతి పూజలో గరికకు విశిష్టవంతమైన స్థానం ఉంది. 

Friday 5 September 2014

కుబేరుడి అహకారాన్ని అణిచివేసిన గణపతి

ఓం గం గణపతయే నమః  

ఐశ్వర్యానికి కారుకుడు ఈశ్వరుడు(శివుడు). ఈశ్వరానుగ్రహంతో ఐశ్వరం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహకారం కలిగింది. అందువల్ల దేవతలందరికి మంచి విందు భోజం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు. దేవతలందరిని ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు. శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు, నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు, ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు, అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసం చేరుకున్నాడు. (శివుడు ఇల్లు లేకపొవడం ఏమిటి? లోకమంతా శివుడి నివాసమే. శివుడు లేని ప్రదేశమే లేదు. శివుడు యోగి కనుక నిరాడంబరంగా, హిమాలయాల్లో ప్రశాంతమైన జీవనం సాగిస్తుంటాడు.)

శివుడు సర్వాంతర్యామి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమంకుంటున్నారో అన్ని తెలుసుకోగలడు. కుబేరుడు అహాన్ని పసిగట్టాడు. పార్వతీదేవి కూడా కుబేరుడి  పధకాన్ని అర్దం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు. కుబేరుడు వచ్చి, మహాదేవా! మీరు, పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు. శివుడు తనకు కుదరదన్నాడు, భర్త రాకుండా తాను కూడా రానన్నది పార్వతీ దేవి. ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు. వస్తూనే 'అమ్మా! ఆకాలేస్తోంది, ఏదైనా ఉంటే పెట్టు' అన్నాడు. పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి 'కుబేరా! మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు' అనగా,
'ఔనౌను, గణపతికి విందు భోజనం అంటే మహాఇష్టం. మా బదులుగా గణపతిని తీసుకెళ్ళు' అన్నాడు పరమశివుడు.


హా! ఈ ఏనుగు ముఖమున్న పసిపిల్లవాడా, నా ఇంటికి విందుకోచ్చేది. ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకుని అలకాపురిలో ఉన్న తన భవనంలోకి తీసుకెళ్ళి, తన భవనంలో ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపిచసాగాడు. ఇవన్నీ వ్యర్ధం, త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా, కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు.

వెంటనే బంగారు కంచం పెట్టి, రకరకాల తీపి పదార్ధలు, పానీయాలు, కూరలు, పండ్లు..... గణపతికి వడ్డించారు. కుబేరుడు చూస్తుండగానే ఒక్కపెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేసి, ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు. సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా గనపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు. ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు.

వంటవారికి ఆహారం వండడం, వండగానే గణపతికి వడ్డించడమే పనైపోయింది. కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం ఖాళీ అయిపోయింది. విషయం కుబేరుని తెలిసింది. తన సంపద మొత్తం తరిపోతోంది కానీ, గణపతి కడుపు నిండడంలేదు, ఏమి చేయాలో అర్ధంకాలేదు. ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, నీ ఇంటికి విందుకు రమ్మని, నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావ్ అంటూ పలికాడు. కుబేరుడికి విషయం అర్ధమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏ మాత్రం సంతృప్తి పరచలేదని, అన్ని ఇచ్చిన భగవంతుడినే దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహకారం అణచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగుపరుగున కైలాసానికి వెళ్ళాడు.

శివా! శంకరా! నేవే దిక్కు. ఐశ్వర్యానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహకారంతో ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్నీ ఖాళీ చేసి, అన్ని ఇచ్చిన భగవంతుడే, అహంకరించినవారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు. మీ బిడ్డడైన గణపతి ఆకాలి తీర్చలేకపోతున్నాను. ఏదైనా మార్గం చూపించండి అన్నాడు. అప్పుడు శివుడు "కుబేరా! నేవు ఇంతసేపు అహకారంతో గణపతికి భోజనం పెట్టావు. అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావల్సినది భక్తి మాత్రమే. నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం, నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మత్రామే గణపతి చూస్తాడు. ఇదిగో ఈ గుప్పెడు బియ్యం తీసుకుని, అహకారం విడిచి, చేసిన తప్పకుని ఒప్పుకుని పరమభక్తితో గణపతికి సమర్పించు" అన్నాడు.

కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి, గణపతికి భక్తితో సమర్పించాడు. ఆ గుప్పెడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి, త్రేనుపులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు. సమస్త లోకాల ఆకలి తీరుస్తున్న పరమాత్మకు ఎంతని పెట్టగలం. ఎంత పెడితే ఆయన ఆకలి తీరుతుంది. భగవంతుడు భక్తికి లొంగుతాడు, సంపదలకు, నైవేధ్యాలకు, దర్పాలకు కాదు. భక్తితో గణపతికి చిన్న బెల్లం ముక్క నివేదన చేసినా చాలు, అదే మహాప్రసాదంగా స్వీకరిస్తాడు.

మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం. కుబేరుడి అహకారాన్ని అణిచివేసిన గణపతి, మనలోని అహకారాన్ని కుడా పటాపంచలు చేయుగాకా.

ఓం గం గణపతయే నమః         

Thursday 4 September 2014

గణాధిపత్యం

సమస్త గణములను పాలించేందుకు, నడిపించేందుకు మాకో అధిపతి కావాలి, అందుకు తగినవాడిని మీరే చూడాలి అని కోరారు. చాలా పుస్తకాల్లో విఘ్నాధిపత్యం అని ఉంది, కానీ వినాయకుడు దేవతాగణాలతో, రుద్రగణాలతో పొరాడి, శివుడి త్రిశూలానికి తలతెగి క్రింద పడిన తరువాత, ఆయన శక్తియుక్తుల్ని చూసి, దేవతలు వినాయకుడికి విఘ్నాధిపత్యాన్ని ఇచ్చారు. కనుక అప్పుడు ఉమాపుత్రుడు విఘ్నేశ్వరుడయ్యాడు. కానీ దేవతలు ఇక్కడ గణాధిపత్యం గురించి అడిగారు.  సృష్టి, స్థితి, లయ కారకులు బ్రహ్మావిష్ణుమహేశ్వరులు. బ్రహ్మ పంచభూతాలకు, సృహ్స్టికి ఆధారమైన గణాలకు అధిపతి, విష్ణువు ఇంద్ర, అగ్ని, వరుణ మొదలైన అష్టదేవతలకు, వారి అనుచరులకు, ఆయా గణములకు అధిపతియై పోషణమును చేస్తున్నాడు, శివుడు లోకాలను సహరించు రుద్ర గణాలకు, భూతప్రేతపిశాచాది గణాలను నియంత్రిస్తూ విశ్వమును నడిపిస్తున్నాడు. ఈ ముగ్గురి బాధ్యతను స్వీకరించి, సమస్త గణాలను అదుపాజ్ఞాల్లో ఉంచేవాడు గణాధిపతి కాగలడని చెప్పిన పరమశివుడు, మీలో ఎవరు సమర్ధులో చెప్పండి అన్నారు దేవతాగణాలతో. ఇంత పెద్ద బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించడం కష్టమని ఎవరూ ముందుకు రాలేదు. ఇంతలో అక్కడికి కుమారస్వామి తన మయూరవాహనం మీద వేగంగా వచ్చి, వాహనం దిగి శివపార్వతులకు నమస్కరించి కూర్చున్నాడు. అక్కడున్న కొన్ని గణాలు కుమారస్వామికే గణాధిపత్యాన్ని ఇవ్వాలని జయజయధ్వానాలు చేశారు. ఇంతలో తన ఎలుక వాహనం మీద గణపతి చేరుకుని, సభాసదులందరికి నమస్కరించాడు. అంతే, అందరూ విఘ్ణేశ్వరుడే గణాధిపత్యానికి తగినవాడని జయము జయము అంటూ అరిచారు.  కుమారస్వామి వైపునున్న సైన్యం 'మా స్వామిని జయించిన వారు ఆ ఆధిపత్యమును స్వీకరించవచ్చు' అని చెప్పగా, గణపతి వైపు ఉన్న శక్తులు గణపతిని సమర్ధిస్తూ, రుద్రగణాలను, దేవేంద్రాదిదేవతాగణాలను చితగొట్టిన ఘనులు మా ప్రభువైన విఘ్నేశ్వరుల వారే. ఎందరో రాక్షసుల పీచమణిచారు. వారికి సమానామైన వారు ఎవరైనా ఉన్నారా? అంటూ గణపతికే ఆధిపత్యం ఇవ్వమని చెప్పారు.

వారి వాదనలని విన్న శివుడు వారితో చిరునవ్వుతో ' పిల్లలారా! మీలో ఎవరూ ముందుగా ముల్లోకాల్లోని నదుల్లో స్నానం చేసి నా వద్దకి వస్తారో వారిని గణాధిపత్యానికి అర్హులుగా నిర్ణయించి, వారికా ఆధిపత్యాన్నిస్తాను. వెంటనే బయలుదేరండి' అని పలికాడు. ఆ మాటలు వినీ వినగానే కుమారస్వామి నెమలినెక్కి ఆ పనిమీద రివ్వున బయలుదేరాడు. కూమారస్వామి వాహనం నెమలి, చాలా వేగంగా వెళుతుంది, ఎగరగలదు. గణపతి వాహనం చిన్న ఎలుక, ఎగరలేదు, గణపతి పెద్దవాడు. వెంటనే గణపతి ఏమాత్రం దిగులు చెందకుండా తాపీ
గా నడుచుకుంటూ తన తల్లిదండ్రుల ముందుకు వెళ్ళి, చేతులు జోడించి నమస్కరించి "జననీజనకులారా ....... ఈ లోకంలో ఎవరైనా భక్తితో వారి తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే, వారు ముల్లోకల్లోని మూడుకోట్ల యాభైలక్షల పుణ్యతీర్ధాల్లో స్నానం చేసిన పుణయం పిందుతారని వేదశాస్త్రాలు ఘోషితున్నాయి. కనుక వేదమూర్తులు, నా తల్లిదండ్రులైనమీ చుట్టు ప్రదక్షిణం చేస్తున్నానని మూడు ప్రదక్షిణలు చేశాడు. చెప్పి గణపతి మూడు ప్రదక్షిణలు చేయగా, కుమారస్వామి 3 లోకాల్లో నదికి వెళ్ళినా, ప్రతి నది దగ్గర గణపతి తనకంటే ముందు స్నానం చేసి, వెళ్ళిపోవడం చూశాడు.
                                                                                                - -     - -     - -    
మొదటగా కుమారస్వామి గంగానదికి వెళ్ళగా, అప్పటికే గంగలో స్నానం ముగించి, ఎదురొస్తున్న అన్నయ్య గజాననుడు ఎదురుపడ్డాడు. అతనికి ఆశ్చర్యం వేసింది. కుమారస్వామి మూడుకోట్ల ఏభై లక్షల నదుల్లో స్నానానికి వెళ్ళినా, గజాననుడు స్నానం చేసి ఎదురు రావడం కుమారస్వామికి కనిపించసాగింది. ఆఖరి స్నానం కూడా పూర్తిచేసి, ఎంతో ఆశ్చర్యంగా కుమారస్వామి కైలాసంలోని తండ్రి దగ్గరికి వెళ్ళెసరికి గణపతి కనిపించాడు. అప్పుడు షణ్ముకుడు పశ్చాత్తాపంతో ' నాన్నగారూ! అన్నగారి మహిమనాకు తెలియలేదు. నన్ను అహం కమ్మేసింది. అందుకే అలా ప్రవర్తించాను. నాకు అన్నగారే ఒకప్పుడు మయూరవాహనం ఇచ్చారు. బుద్ధిలో అన్నయ్యే నాకంటే అధికం.. నా కన్నా అన్నయ్యే అన్ని విధాలా సమర్ధుడు కనుక గజాననుడినే గణాధిపతిని చేయండి' అన్నాడు.

ఈ ప్రకారం భాద్రపద శుద్ధ చవితినాడు పరమేశ్వరుడు గజాననుడికి గణాధిపత్యం వేడుకని జరిపించాడు. ఈ వృత్తాంతం ద్వారా గణపతి లోకానికి తల్లిదండ్రుల విలువను చాటి చెప్పారు. తల్లిదండ్రులే సమస్త పుణ్యతీర్ధాలు, వృద్ధాప్యలో ఉన్న తల్లిదండ్రులను వదిలి, ఎవరు తీర్ధయాత్రలు చేస్తారో, వారు పుణ్యం పొందకపోగా, అతిమకాలంలో నరకానికి వెళతారని శాస్త్రం చెప్తోంది. మన ముందు కనిపించే దైవస్వరూపాలు తల్లిందండ్రులు. అందుకే వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణంతో మహాగణపతి అయినాడు.

అట్లాగే ప్రతీసారీ కండబలం ఉంటే సరిపోదు, బుద్ధిబలం కూడా ఉండాలని చెప్తుందీ  వృత్తాంతం. కొంతమంది Management నిపుణులు ఈ కధను Crisis Management  లో భాగంగా చెప్తారు. కష్టాలను బుద్ధిబలంతో ఎదురుకున్నవాడే అసలైన ప్రజ్ఞావంతుడని చెప్తున్నదీ వృత్తాంతం.

Wednesday 3 September 2014

గణపతి - గుంజీళ్ళు

ఓం గం గణపతయే నమః

పార్వతీదేవి, శ్రీ మహావిష్ణువు అన్నచెల్లెళ్ళు. ఒకసారి శ్రీ మహావిష్ణువు తన భావగారైన శివుడిని కలవడానికి కైలాసానికి వెళ్ళాడు. వెళ్తూనే తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని, గద మొదలైన ఇతర ఆయుధాలను ఒక పక్కన విడిచిపెట్టాడు. అక్కడే బాలగణపతి ఆడుకుంటున్నాడు. గణపతి చాలా అల్లరివాడు. బంగారు కాంతులతో వెలిగిపోతున్న సుదర్శన చక్రం చట్టుక్కున నోట్లో వేసుకుని, మౌనంగా కూర్చున్నాడు.

మాటల మధ్యలో తన చక్రం గుర్తొచ్చిన విష్ణువు ఎక్కడుందని వెతకడం మొదలుపెట్టాడు. 'ఏం వెతుకుతున్నావు మావయ్యా!' అని గణపతి అనగా, సుదర్శన చక్రాన్ని వెతుకున్నా అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఇంకేక్కడుంది మావయ్యా చక్రం! నేను తినేశాగా అని నవ్వేశాడు గణపతి. విష్ణువుకేమో గణపతి అంటే మహాఇష్టం. గణపతిని ఏమి అనలేడు. అసలే ముద్దుల మేనల్లుడు. అందువల్ల 'బాబ్బాబు! అది రాసక్షులను హడలుగొట్టి, సంహారం చేసే మహాసుదర్శనం, దాన్ని బయటకు విడిచిపెట్టు నాయనా' అని బ్రతిమాలాడు. కానీ వినాయకుడు పట్టువదల్లేదు.

ఇక చేసేది లేక విష్ణువు తన కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకుని గణపతి ముందు గుంజీళ్ళు తీశాడు. విష్ణువు చేసే పని గణపతికి విచిత్రంగా అనిపించడమే కాక, విపరీతమైన నవ్వు తెప్పించింది. గణపతి కడుపు నొప్పిచేంతగా నవ్వాడు. ఇలా నవ్వడంలో ఆయన కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నాడు శ్రీ మహావిష్ణువు.

అప్పటి నుంచి గణపతి ముందు గుంజీళ్ళు తీసే సంప్రదాయం వచ్చింది. గణపతి ముందు మొట్టమొదట
గుంజీళ్ళు తీసింది విష్ణువే. ఈ విధంగా శ్రీమహావిష్ణువు చేత గుంజీళ్ళు తీయించిన గణపతి మనల్ని అనుగ్రహించుగాక.

గణపతి ముందు తీసే గుంజీళ్ళలో ఆరోగ్య రహస్యం కూడా ఉంది. గుంజీళ్ళు తీయడం వల్ల మెదడుకు రక్తప్రసరణ బాగా జరిగి మేధస్సు వృద్ధి చెందుతుంది. దీని మీద జరిగిన ఆధునిక పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. అందుకే ప్రపంచంలో ఈ రోజు గుంజీళ్ళను 'సూపర్ బ్రెయిన్ యోగా'గా చెప్తున్నారు. కావాలంటే ఈ వీడియోను చూడండి.  http://www.youtube.com/watch?v=p876UDB8EN4



ఈ కధలో యోగ రహస్యం కూడా ఉంది. గణపతి మూలాధారంలో ఉంటాడు. విష్ణువు విశుద్ధచక్రానికి అధిష్టానదైవం. సుదర్శనం అనగా ఆజ్ఞాచక్రం. ములాధారంలో ఉన్న గణపతి సుదర్శన చక్రాన్ని మ్రింగడం అంటే కుండలిని శక్తి ఆజ్ఞాచక్రాన్ని చేరడమన్నమాట. కుండలిని ఆజ్ఞాచక్రాన్ని చేరితే, ఇక మిగిలేది ఒక్క మెట్టు మాత్రమే. అప్పుడు ఆనందంతో జీవుడు నాట్యం చేస్తాడు. మానవ తత్వానికి, దైవత్వానికి మధ్య నిలిచి ఉంటాడు. కొన్ని సార్లు దైవానుభవాన్ని పొందుతూ, మళ్ళీ మామూలు ప్రపంచంలోకి వస్తుంటాడు. దాన్ని సూచించేదే సర్వవ్యాపుకుడైన విష్ణువు గుంజీళ్ళు తీయడం. గణపతి ముందు రోజు గుంజీళ్ళూ తీస్తూ ఉంటే, ములాధారంలో ఉన్న కుండలినిశక్తి క్రమంగా జాగృతమవుతుంది.

ఓం గం గణపతయే నమః

Tuesday 2 September 2014

గణపతి - సందేశం

ఓం గం గణపతయే నమః

గణపతి అనే శబ్దంలో 'గ' జ్ఞానానికి, 'ణ' నిర్వాణానికి సంకేతాలు కాగా, రెండింటికి అధిపతి, రెండిటిని ఏక కాలంలో ప్రసాదించగలిగినవాడు కనుక ఆయన్ను గణపతి అన్నారు అని బ్రహ్మవైవర్త్త పురాణ వచనం. జ్ఞానమే గణపతి యొక్క రూపం. గణపతికి పెద్దతల ఉంటుంది. ఇది బాగా ఆలోచించమని సూచిస్తుంది, పెద్దతల జ్ఞానానికి, మేధాశక్తికి సంకేతం. ఏనుగు కళ్ళు చిన్నగా ఉన్నా, చిన్న సూదిని కూడా చూడగలదు. చిన్నకళ్ళు చేసే పని మీద దృష్టిని కేంద్రీకరించమని, ప్రతి చిన్న విషయాన్నిపరిశీలించమని చెప్తాయి. చేట చెరుగుతుంది. అలాగే గణపతికున్న పెద్ద చెవులు చెడును విసర్జించి, మంచిని మాత్రమే గ్రహించమని, శ్రద్ధగా వినమని తెలియజేస్తాయి. జ్ఞానమును, విద్యను ఆర్జించడంలో శ్రద్ధయే కీలకం. గురువు అందరికి ఒకేలా చెప్తాడు. కానీ అది విన్నవారిలో ఒకడు మాహామేధావి, ప్రజ్ఞావంతుడవుతుంటే, ఒకడు వక్రమార్గం పడుతున్నాదు, విద్యను అర్దం చేసుకోలేకపోతున్నాడు. దానికి కారణం శ్రద్ధ.

గణపతి ఏకదంతుడు. ఒకే దంతం ఉన్నవాడు, చెడును వదిలి, మంచిని మాత్రమే నిలుపుకోమని తన ఏకదంతం ద్వారా లోకానికి సెలవిస్తున్నాడు. గణపతి వక్రతుండం ఆత్మకు, పరిపూర్ణమైన చైతన్యానికి సంకేతం. చిన్న నోరు తక్కువగా మాట్లాడమని సూచిస్తుంది.

గణపతికి నాలుగు చేతులు ఉంటాయి. ఒక చేతిలో అంకుశం, మరొక చేతిలో పాశం ధరించి ఉంటాడు. అంకుశం అహకారాన్ని, క్రోధాన్ని నాశింప చేసుకోవాలని చెప్పగా, పాశం మోహాన్ని వశం చేసుకోవాలని తెలుపుతుంది. గణపతి చేతిలో ఉండే మోదకం(లడ్డు), ఆ స్వామి మన సాధనకు మెచ్చి, ఇచ్చే పురస్కారం, అదే ఆత్మజ్ఞానం. మరొకచేతితో అభయముద్రలొ స్వామి సాక్షాత్కరిస్తాడు. భగవంతుడి మార్గంలో నడిచేవారికి సర్వేశ్వరుడు అభయాన్ని, రక్షణను ఇస్తాడని చెప్తుందీ అభయహస్తం.

గణపతికి పెద్ద బోజ్జ ఉంటుంది. అందుకే ఆయనకు లంబోదరుడని పేరు. సర్వలోకాలు, సమస్త బ్రహ్మాండాలు తన ఉదరమందు ఉండడం చేత ఆయన లంబోదరుడయ్యాడు. జీవితం అంటే కష్టసుఖాలు, మంచి చెడుల సంగమం. జీవితంలో వచ్చే కష్టసుఖాలను, మంచి చెడులను ప్రశాంతంగా జీర్ణించుకోవాలని సూచన చేస్తుంది లంబోదరం. అట్లాగే ఎవరు ఏది చెప్పినా విను, ఇతరులు బాధలో పంచుకున్న రహస్యాలను నీలోనే దాచుకో అని చెప్తుంది లంబోదరం.

గణపతి వాహనం ఎలుక. ఎలుక మనసుకు, కోరికలకు ప్రతీక. మనసు ఒక విషయం మీద ఎప్పుడు స్థిరంగా ఉండదు. మనలని మన మనసు నియంత్రిచడం కాదు, మనమే మన మనసును నియంత్రించుకోగలిగిన సత్తా కలిగి ఉండాలని సూచిస్తుంది ఎలుక వాహన. అంతేకాదు, మనం మన కోరికల మీద స్వారీ చేయాలి కానీ, కోరికలు మన మీద స్వారీ చేసి, మనకు బాధను మిగల్చకూడదని చెప్పడానికి గణపతి ఎలుకను వాహనంగా చేసుకున్నాడు.

గణపతి పాదాలచేత ఉంటుంది ప్రసాదం. మనం కోరాలేకాని ప్రపంచం మొత్తాన్ని మన కాళ్ళ దగ్గర ఉంచగలడు గణపతి. అంతేకాదు, పైన చెప్పుకున్న లక్షణాలు ఉన్నవాడి పాదాలకు ప్రపంచం దాసొహం అంటుందని అర్ధం.

గణపతి గురించి చెప్పుకుంటే సమస్త బ్రహ్మాండం గురించి చెప్పుకున్నట్టు. అటువంటి గణపతి ఆశీస్సులు మనకు ఎల్లవేళలా ఉండుగాకా.

ఓం గం గణపతయే నమః            

Monday 1 September 2014

వక్రతుండ నామార్ధం

ఓం గం గణపతయే నమః

గణపతికి వక్రతుండుడని పేరు. వక్రతుండ అనగానే వంకర తొండము కలవాడని చెప్పేస్తారు, కానీ నిజానికి అది వక్రతొండం కాదు, వక్రతుండం. వక్రానాం తుండయతి ఇతి వక్రతుండః అని అంటున్నది గణేశపురాణం. వక్రములను తుండనము చేయువాడు వక్రతుండుడు. వక్రములంటే దుష్టశక్తులు, దురలవాట్లు, చెడు సంస్కారాలు, పాపౌ ఆలోచనలు, నీచభావనలు మొదలైనవి చెప్పుకోవచ్చు. దుష్టులను శిక్షించేవాడు కనుక గణపతి వక్రతుండుడయ్యాడు. గణపతి శాంత స్వభావుడు అయినా, దుష్టులపట్ల చండశాసనుడు, కాలుడు. తన తొండంతో దుష్టులను, అరిష్టాలను, గండాలను, దోషాలను ద్వంసం చేస్తాడు. దుష్టులంటే వ్యక్తులే అని భావించనవసరంలేదు. మనలో కూడా అనేక చెడు సంస్కారాలు, నీచపు ఆలోచనలు ఉంటాయి. వాటిని నాశనం చేస్తాడు కనుక గణపతికి వక్రతుండ అని పేరు. అంతేకాదు, మనలో చెడు తొలగించినా, మనం మంచిగానే ప్రవర్తించినా, ఎదుటివారు మనకు కీడు చేయవచ్చు. కనుక అటువంటి వారి వక్రమైన ఆలోచనల పాలిట కాలుడై, నంశింపజేయువాడు కనుక గణపతికి వక్రతుండ అన్న నామం వచ్చింది.

పిల్లలు దురలవాట్లకు లోనైనప్పుడు, తల్లిదండ్రులు గణపతికి వక్రతుండ నామంతో జపించి, అర్చించి, వేడుకుంటే, తప్పుత్రోవ పట్టిన పిల్లలు తిరిగి మంచిమార్గంలోకి వస్తారు. ఈ వక్రతుండ అన్న నామం చాలా మహిమాన్వితమైంది. తంత్రశాస్త్రంలో సదాచారతంత్ర విధానంలో 'ఓం వక్రతుండాయ నమః' అనే వక్రతుండ గణపతి మంత్రానికి ఒక బీజాక్షరం చేర్చి, జపిస్తారు. ఈ వక్రతుండ గణపతి మంత్రాన్ని గణపతి గురించి తెలిసినవారి వద్దనుంచి గ్రహించి జపించాలి. ఆ జపం చేయడం వలన ఉపాసకుడి పై చేసిన ప్రయోగాలు విఫలమవుతాయి. మనం ధార్మికంగా ఉన్నా, లోకమంతా వ్యతిరేకంగా మారి, మనపై యుద్ధానికి వస్తున్న సమయంలో, ఈ వక్రతుండ గణపతిని జపిస్తే, చాలా త్వరగా వక్రమైన ఆలోచనలు నశించి, మిత్రభావం ఏర్పడుతుంది. ప్రపంచంలో అల్లకల్లోలాలు, ఉత్పాతాలు, యుద్ధాలు ముంచుకొస్తున్న సమయంలో వక్రతుండ గణపతి మంత్రాన్ని జపిస్తే, తక్షణమే ఫలించి, లోకంలో శాంతి ఏర్పడుతుందని చెప్పారు సద్గురు శివాయ సుబ్రహ్ముణియ స్వామి వారు. ఎప్పుడైనా ఆపదలు ముంచుకోస్తే, పరిస్థితులు చేజారితే, వెంటనే వక్రతుండ అనే నామంతో గణపతి స్మరించాలి. రక్షణ కలుగుతుంది. తొండం యొక్క పర్స్తావన వచ్చింది కనుక గణపతికి ఉండే వంకర తిరిగిన తుండం ఓంకారానికి సంకేతం అని గుర్తుపెట్టుకోండి.

ఓం వక్రతుండాయ నమః

వక్రములను తొలగించే ఆ గణపతి మనలోని చెడు భావనలను తొలగించుగాకా
ఓం గం గణపతయే నమః