Tuesday 21 October 2014

నరక చతుర్దశి విశేషాలు

ఆశ్వీయుజ బహుళ చతుర్దశి - నరక చతుర్దశి

పురాణ ప్రాశస్త్యం: పూర్వం నరకాసురుడనే రాక్షసుడు ప్రాక్ జ్యోతిష్యపురాన్ని పరిపాలించేవాడు. ఆ ప్రాక్ జ్యోత్సిహ్యపురం అనే ప్రాంతం ఈ రోజు ఈశాన్య భారతంలో అస్సాంలోని గౌహతి ప్రాంతం. వాడు 16,000 మంది కన్యలను తన కారాగారంలో బంధించగా, శ్రీ కృష్ణుడు సత్యంభామ సమేతంగా వెళ్ళి, వాడితో యుద్ధం చేసి, వాడిని చంపి, ఆ కన్యలను విడిపిస్తాడు. నరకాసుర వధ జరిగి, స్త్రీలకు దుష్టుడైన నరకుడిని నుంచి విముక్తి లభించినందుకు ప్రతీకగా ఈ రోజు నరక చతుర్దశి జరుపుకుంటారు.  నరకుడి వధతో వాడు చేత హింసించబడి అంధకారంలో మగ్గుతున్న అనేకమంది బయటకు వచ్చారు, విముక్తి పొందారు, అందుకు ప్రతీకగా దీపాలు వెలిగిస్తారు. ఈ నరక చతుర్దశికి అంతరిక్షంలో జరిగే కొన్ని వింతల కారణంగా కూడా దీనికి ఈ ప్రత్యేకత వచ్చింది.   

నరక చతుర్దశి సంధర్భంగా అందరూ ఆచరించవలసిన విషయాలు తెలుసుకుందాం.
నరక చతుర్ద రోజు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి గంటన్నర ముందే నువ్వుల నూనెతో తల అంటుకొని స్నానం చేయాలి. దీనినే తైలాభ్యంగనస్నానం అంటారు. ఇది నరక చతుర్దశి రోజు తప్పక చేయవలసిన విధి. స్నానానికి ఉపయోగించే నీటిలో ఉత్తరేణి, తగిరస, తుమ్మి చెట్లకొమ్మలను కలియబెట్టాలి. స్నానం మధ్యలో ఉత్తరేణి ఆకులను తలపై త్రిప్పుకొని పారేయాలి. ఈరోజు చేసే స్నానం నరక భయాన్ని పొగొడుతుందని, మంగళకరమని చెప్పబడింది. ఆ సమయంలో స్నానం చేయకపోతే దరిద్రం పట్టుకుంటుందని శాస్త్రం చెప్తోంది.

నరకుడనే అహకారాన్ని వెతికి చంపినందుకు గుర్తుగా చేసే స్నానం ఇది. నరకాసురుడంటే అహకారం. జ్ఞానం మాత్రమే అహాన్ని నశింపజేస్తుంది. కనుక చతుర్దశి రోజు చేస్తున్న ఈ స్నానం జ్ఞానానికి సంకేతం అన్నారు భగవాన్ రమణ మహర్షి.

ఈ రోజున సూర్యోదయానికి ముందు నువ్వులనూనెలో లక్ష్మి దేవి, నీటిలో గంగా దేవి ఉంటారని, అందువల్ల ఆ సమయంలో చేసే పైన చెప్పిన విధంగా చేసే స్నానం వల్ల లక్ష్మీదేవి, గంగాదేవిల అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెప్తోంది. స్నానాంతరం దక్షిణదిశగా తిరిగి యమనామాలు స్మరిస్తూ మూడుసార్లు యమునికి తర్పణం విడువాలి. తల్లిదండ్రులు లేనివారు మాత్రమే ఈ తర్పణాలు వదలాలి.

ఈరోజు ప్రదోషంలో అంటే సాయంకాలం ఇంటిముందు, ఆలయాల్లోనూ దీపాలను వెలిగించాలి. నాలుగు వత్తులతో దీపాన్ని వెలిగించి దీపదానం చేయాలి. 

No comments:

Post a Comment