Thursday 31 July 2014

నాగపంచమి - సర్పాలను కాపాడి, నాగజాతి అనుగ్రహం పొందండి

మహాభారతం పంచమవేదం. అది అనేక ధర్మసూక్ష్మాలతో కూడి ఉంటుంది. అందులో కొన్నిసార్లు ధర్మం అధరంగా, అధర్మం ధర్మంగా కనిపిస్తుంది. మహాభారతాన్ని వ్యాఖ్యానం చేయడం చాలా కష్టం. అయినప్పటికి నాగపంచమికి సంబంధించి పరీక్షిత్ మహారాజుకు చెందిన ఈ చారిత్రిక సంఘటనను చాలా క్లుప్తంగా తెలుసుకుందాం.......

మహాభారతం ముగిసాక హస్తినాపురాన్ని అధిష్టించిన పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్ళిన సమయంలో, తపస్సులో ఉన్న ఋషి మెడలో చనిపోయిన పామును వేసి, ఆ మునికుమారుడి శాపానికి గురై శాపకారణంగా తక్షకుడి (పాము) కాటుకు మరణిస్తాడు. తన తండ్రి మరణానికి కారణమైన తక్షకుడిని, సర్పజాతిని సంహరించడం కోసం పరీక్షిత్ మహారాజు కుమారుడైన జనమేజయుడు సర్పయాగం చేస్తాడు. ఆ యాగ ప్రభావం చేత ఎక్కడెక్కడో ఉన్న సర్పాలన్నీ వచ్చి హోమగుండంలో పడి ప్రాణులు వదిలేస్తాయి. తనను రక్షించమని వేడుకుంటూ తక్షకుడు ఇంద్రుని శరణువేడి, ఇంద్ర సింహాసనాన్ని చుట్టుకుంటాడు. కానీ జనమేజయుడి ఆదేశం మీద వేదపండితులు ఇంద్రుని సింహాసనంతో కూడి తక్షకుడు యాగంలో పడి మరణించాలని మంత్రపూర్వకంగా చెప్తారు. దాంతో ఇంద్రుడి హడలిపోతాడు. ఇంతలో మానసాదేవి ఆదేశం మేరకు ఆమె కుమారుడైన ఆస్తిక మహర్షి యాగం ఆపటానికి వస్తారు.. యాగాన్ని ఆపి, సర్పజాతిని కాపాడటంలో ఆస్తిక మహర్షి విజయవంతమవుతారు. ఆయన కారణంగా సర్ప సత్ర యాగం ఆగిన రోజు శ్రావణ శుక్ల పంచమి. ఆ తర్వాత మానవజాతికి, సర్పజాతికి మధ్య స్నేహభావాన్ని పెంపొందేలా ఆ మహర్షి కృషి చేశారు. అందుకు గుర్తుగా అప్పటి నుంచి ప్రతి ఏటా శ్రావణ శుక్ల పంచమిని నాగపంచమిగా జరుపుకుంటున్నాం.

ఒక విషయం గుర్తుంచుకోండి. పాములు సరీసృపాలు కనుక పాలు త్రాగవు. అలా అని అన్ని పాములు పాలు త్రాగవని కాదు, దేవతసర్పాలు మాత్రమే పాలు త్రాగుతాయి. మాములు పాములు పాలు త్రాగితే అరగక కక్కెస్తాయి, తర్వాత మరణిస్తాయి. దేవత సర్పాలు ఎక్కడపడితే అక్కడ ఉండవు. మనిషి కంటికి కనిపించవు, మానవ కదలికలను లేని మహారణ్యాలలో మాత్రమే ఉంటాయి. అందువల్ల పుట్టలో పాక్యేట్ల కొద్ది పాలు పోయకండి. నాగజాతిని తలుచుకుని నాగదేవతకు నైవేద్యంగా ఒకటి, రెండు చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగితావి ప్రసాదంగా స్వీకరించడం మంచిది. నాగదేవత పూజలో పసుపుకుంకుమలను పుట్ట దగ్గర వాడవద్దు. అసలు పుట్టలో పాలు పోయకూడదు, నాగశిలకు, నాగబంధానికి మాత్రమే పాలు పోసి, పూజించాలి. ధార్మిక గ్రంధాల్లో అలాగే చెప్పారు. నాగబంధం/ నాగశిల మీద మాత్రమే చల్లవచ్చు. పసుపు అంటే పాములకు అలర్జీ. పసుపు వాటి శరీరానికి అంటుకోవడం వలన కూడా అవి మరణించే అవకాశం ఉంటుంది. పండుగ పూట పాపం చేయకండి. పసుపుకుంకుమలను పుట్ట దగ్గర వాడకండి.

కొందరు ఇంటి ముందుకు పాములను తీసుకువస్తూ ఉంటారు. వాటికి పాలు పోయకండి, అలా వచ్చేవారికి రూపాయి కూడా ఇవ్వకండి. ఎందుకంటే వారు పాములను 3 నెలల ముందే పట్టి, నీరు, ఆహారం ఇవ్వకుండా, ఒక బుట్టలో పెట్టి, ఆ బుట్టను ఒక చీకటి గదిలో పడేస్తారు. 3 నెలలపాటు తినడానికి ఏమి దొరకని ఆ పాము, ఆఖరికి ఏమి పెట్టినా తినేందుకు సిద్ధం అవుతుంది, బలం కోల్పోతుంది, మరణానికి చేరువవుతుంది. అదే సమయంలో వాటిని తీసి, కోరలను పీకేసి, నోరు కుట్టెస్తారు, చిన్న సందు మాత్రమే వదులుతారు. వాటినే నాగపంచమి రోజున జనం మధ్యకు, గుడి దగ్గరకు తీసుకువచ్చి, పాలు సమర్పించమని చెప్పి, డబ్బులు తీసుకుంటారు. ఏది దొరకని ఆ సర్పం, తాత్కాలికంగా పాలు త్రాగిన, తర్వాత అది మరణిస్తుంది. అందుకని ఎక్కడైనా, అటువంటివి కనిపించినా, ఎవరైనా మీ దగ్గరకు పాము తీసుకువచ్చినా, వెంటనే పోలిసులకు కానీ, స్నేక్ సెల్ వారికి కానీ సమాచరం ఇవ్వండి. సర్పాలను కాపాడి, నాగజాతి అనుగ్రహం పొందండి.

ఇవిగో అటవీ శాఖవారి టొల్ ఫీ నెబరు - 1-800-425-5364
ప్రెండ్స్ ఆఫ్ స్నేక్ హెల్ప్ లైన్ నెంబరు - +91 83742 33366.      

1 comment: