Saturday 31 August 2013

'ఓం'కారమే గణపతి

ఓం గం గణపతయే నమః

'ఓం'కారమే గణపతి

పరమశివుడు ఒక చేత త్రిశూలం పట్టుకుని, మరొక చేతితో ఢమరుకం పట్టుకుని నిత్యం తాండవం చేస్తుంటాడు. పరమశివుడి తాండవం నుంచే ఈ సమస్త సృష్టి ఉధ్భవించింది. సృష్ట్యాదిలో అనంతదిగంతాలకు వ్యాపించిన ఈ సువిశాల విశ్వమంతా ప్రళయకాల ప్రభంజనాలతో ప్రజ్వరిల్లుతూ ఉంది. విశ్వవ్యాప్తమైన కోటానుకోట్ల గోళాలు, గ్రహమండలాలు అపరిమితమైన వేగంతో ప్రయాణిస్తూ అగింజ్వాలలు విరజిమ్ముతున్నాయి. ఎటుచూసిన సప్తవర్ణాల కాలాగ్నిశిఖలు పెనుఉప్పెనలైన బడబాగ్ని(లావా) సముద్రాలు.......అలా ఎన్నో కోట్లసంవత్సరాల పాటు విళయప్రళయాలు సృష్టించిన ఈ విశ్వాంతరాళం క్రమక్రమంగా ప్రశాంత వాతావరణాన్ని సంతరించుకుంది.

అప్పటివరకు అరుణారుణ కాంతులతో దావానంలా దహించబడిన ఈ సువిశాల విశ్వమంతా నీలిరంగును సంతరించుకుని, అంధకార శున్యాప్రదేశంగా ఏర్పడి, మొట్టమొదటగా ప్రణవనాదమైన 'ఓం'కారం పుట్టింది. 'ఓం'కారమే గణపతి. సృష్టిలో మొదట వచ్చినవాడు గణనాయకుడు, విఘ్నవినాయకుడు. గణపతి వక్రతుండం ఓంకారానికి సంకేతం. ప్రతి మనిషి మౌనంగా ధ్యానంలో కూర్చుంటే వినిపించే శబ్దం ఓంకారం. నిశబ్దంలో ఉండే శబ్దం కూడా ఓంకారమే.అసలు గణపతి తత్వమే ఓంకారం. ఈ సృష్టిలో భూమి మొదలైన గ్రహాలు తమ చుట్టు తాము తిరగడం వల్ల పుట్టే శబ్దం ఓంకారం. సూర్యుడిలో వచ్చే సౌరతుఫానుల శబ్దాన్ని ఆధునిక శాస్త్రవేత్తలు రికార్డు చేసారు. ఆ శబ్దం కూడా ఓంకారం. కావాలంటే నాసా వారి వీడియోలు చూడండి.
https://www.youtube.com/watch?v=w_toXu2WF50
https://www.youtube.com/watch?v=LQqShj6leq8
http://www.youtube.com/watch?v=e3fqE01YYWs
https://www.youtube.com/watch?v=NKbuGQtnnDA

ఈ సృష్టి అంతా ఓంకారమే ఉంది. ఓంకారం రూపంలో గణపతి ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు.ఈ సృష్టిలో నిత్యం శబ్దప్రకంపనల ద్వారా అంతటా వ్యాపించి ఉన్న పరబ్రహ్మ తత్వమే గణపతి.

ఓం గం గణపతయే నమః

Wednesday 28 August 2013

శ్రీ కృష్ణ పరమాత్మ ఎప్పుడు నెమిలిపించం ధరించి కనిపిస్తాడెందుకు?

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కృష్ణ పరమాత్మ ఎప్పుడు నెమిలిపించం ధరించి కనిపిస్తాడెందుకు?

ఈ సమస్త సృష్టిలో శారీరిక సంపర్కం లేకుండా సంతానం పొందగలిగేది ఒక్క నెమలి మాత్రమేనటుంది శాస్త్రం. మగనెమలికి పించం ఉంటుంది. మేఘాలు పట్టి వర్షం పడే సమయంలో మగనెమలి ఆనందంతో నాట్యం చేస్తుంది, ఆ సమయంలో మగనెమలి కంటి నుంచి పడే బిందువులను ఆడనెమలి వచ్చి త్రాగుతుంది. ఆ నీటిని త్రాగడం చేత ఆడనెమలి గర్భం ధరిస్తుందట. ఎటువంటి శారీరిక సంబంధం లేకుండా జరుగుతుంది ఈ ప్రక్రియ. శ్రీ కృష్ణుడు యోగి. ద్వాపరయుగంలో భూమిపై తిరగాడిన సిద్ధపురుషుడు. అటువంటి శ్రీ కృష్ణుడు తనకు అందరితో ఉన్నది ఆత్మ సంబంధమేనని, ఎవరితోనూ తనకు శారీరిక సంబంధం లేదని, తాను ఒక యోగినని తెలుపడానికే నెమలి పించం ధరించి కనిపిస్తాడు.

ఓం నమో భగవతే వాసుదేవాయ      

Friday 23 August 2013

సంకటహర చవితి వ్రత కధ

ఓం గం గణపతయే నమః

సంకటహర చవితి వ్రత కధ :

శత్రు, దారిద్ర్యాది మహాకష్టములచే బాధింపబడువారికి, ఋణబాధలు ఉన్నవారికి, సంతానం లేనివారికి, భూమి, ఇల్లూ లేకపోవడం వంటి ఈతి బాధలు పడేవారికి, ధీర్ఘవ్యాధులచే పీడింపబడేవారికి, చదువు సారిగ్గా రాకపోవడం, ముందు సాగాకపోవడం లాంటి ఆటంకాలు ఎదురయ్యేవారు అనుభవించే మానాసిక క్షోభ అంతా ఇంతా కాదు. భూలోకంలో కలియుగం మొదలై 5000 సంవత్సరములు గడిచిన తరువాత ఇట్టి క్లేశములు మనుష్యులను ఎక్కువగా బాధిస్తాయి. ఈ విధంగా క్షోభ అనుభవించే వారి కష్టములను తీర్చే వ్రత రాజమేదైనా ఉంటే చెప్పవలసిందిగా స్కందుని(కూమారస్వామిని) ఋషులందరూ అడిగారు.

"శ్రీలు సిద్ధించుటకు, తక్షణ ఫలదాయిని అయిన సంకష్టహరచవితి అనే వ్రతం మహాశ్రేష్టమైనది. ఇది వ్రతాలలోకేల్లా ఉత్తమమైనది. ధర్మరాజు అరణ్యవాస, అజ్ఞాతవాస మహాకష్టములను ఎదుర్కోన్నప్పుడు రాజ్యలాభము, పూర్వవైభవము పొందు నిమిత్తము శ్రీ కృష్ణుని ప్రేరణచే ఈ వ్రతాన్ని ఆచారించాడు. శ్రీ క్ర్ష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రతం యొక్క మహాత్యాన్ని వివరిస్తూ ఇది గణపతి స్వయంగా పార్వతీ దేవికి చెప్పినట్ట్లు, తాను ఆ వ్రతన్నే ఉపదేశిస్తున్నట్లు చెప్పాడు" అంటూ కుమారస్వామి చెప్పగానే ఋషులు ఈ విధంగా అడిగారు.

"మహాసేనాధిపతి! లోకకల్యాణ నిమిత్తం తన జనని అయిన పార్వతీ దేవికి గణపతి ఈ వ్రతాన్ని ఏ విధ్మగా చెప్పాడో, ఆ విధానం మాకు కుడా తెలియజేయండి" అని కోరారు.

" ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తే అయిన పార్వతి, సివుని పతిగా కోరి భక్తితో తీవ్ర తపస్సు చేసినా, ఫలితం లేకపోవడంతో, పూర్వలీల రూపమున తనయందు జన్మించిన హేరంబ గణపతిని మనసులో స్మరించింది.

స్మరణమాత్రానే తన ఎదుట ప్రత్యక్షమైన గణేశుని చూసి "ఇతరులకు అసాధ్యమైన కఠోర తపస్సు చేసినా, సర్వజనవశంకరుడైన శంకరుని భర్తగా పొందటంలో జాప్యం జరగుతోంది. ఇటువంటి ఆటంకాలు తొలగడానికి, స్వర్గాది లోకాల్లో నీకు సంబంధించిన సంకటహరణం అనే వ్రతాన్ని ఆచరిస్తూంటారని నారద మహర్షి ద్వారా వినాను. ఆ వ్రత విధానం వివరించి" అని కోరింది.

దానికి వినాయకుడు "తల్లీ! గురు-శుక్ర మూఢాలేవి లేని శుభశ్రావణ బహుళ చవితినాడు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, దృఢ సంకల్పంతో సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తాన్ని మొక్కుకుని, దంతధావనాధికాలు పూర్తి చెసుకుని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి, సంధావందనం మొదలైన నిత్యనైమిత్తికాలు ఆచరించి కల్పోక్త ప్రకారం గణేశ పూజ నిర్వర్తించాలి.

ఉద్యాపన విధి :

బంగార, వెండి, రాగి లేదా మట్టితోనైనా నా ప్రతిమ చేసి(లోభత్వం పనికిరాదు) నీటితో నింపి, ఎర్రని వస్త్రంతో చుట్టిన కలశంపై గాని, మంటపంపై అష్టదళపద్మం ఏర్పరిచి గాని నా ప్రతిమను ఉంచిం ప్రాణ ప్రతిష్ట చేసి, విభూతి, గంధాక్షతలతో, పుష్పబిల్వాలతో, గరికపోచలతో అర్చిచి, ధూపదీప నైవేధ్యాలు అర్పించి హారతి ఇవ్వాలి. శ్రావణ బహుళ చతుర్థీ నాడు ఈ వ్రత ఉద్యాపన చేయాలి. పూజానంతరం హవనం(హోమం) చేయాలి. వ్రతం విధానం బాగా తెలిసిన ఆచార్యునిచే పూజాది కార్యక్రమాలు నిర్వర్తింపజేయడం చాలా ఉత్తమం. ఈ పూజపై చెప్పిన తిధిలో ఏడాదికొకసారైనా సరే చంద్రోద్య సమయంలో ఆచరించదగినది.

ఏ రాత్రి పురాణోత వేదమంత్రాలతో కాలక్షేపం, దైవసంబంధిత నృత్యగీత వ్ద్యాదులచే జాగరణం వేయాలి. మరునాడు యధాశక్తి21 మంది బ్రాహమ్ణులకు దానాదులు చేసి సంతృప్తి పరచాలి. వ్రతం చేయించిన  ఆచార్యునకు వస్త్ర. భూషణ, ఛత్ర పాదుకాది సమస్త సంభారములు దక్షిణ సహితంగా ఇవ్వాలి.

నాకు ప్రియమైన ఈ వ్రతరాజాన్ని భక్తి స్రద్ధల్తో ఆచరించడం వల్ల నేను సంప్రీతి చెంది కోరికలను తీర్చుతాను" అన్నాడు గణపతి.

గణపతి ద్వారా విన్న పార్వతీదేవి యధావిధిగా సంకష్టహర గణపతిని అర్చించి, ఈ వ్రత మహిమవల్ల 6 నెలలు తిరగకుండానే ఇతర ప్రయత్నాలు అవసరం లేకుండానే శివుడిని భర్తగా పొందింది.

ఈ ప్రకారమే శ్రీ కృష్ణుడు ధర్మరాజుకు ఉపదేశించడు. భారతంలో పాండవులకు విజయప్రాప్తి కలిగినదని మేకు తెలుసు కదా! కనుక ఋషివరేణ్యులారా! లోకంలో సంకటాలు నశించడానికి, మనుష్య, యక్ష, రాక్షస, గంధరావాది సమస్త జాతులవారి సర్వాభీష్టాలు తీరడానికి ఇంతకంటే సులభోపాయం లేదు" అని స్కందుడు ఋషులకు తెలిపాడు.

"ఇంకా ఈ వ్రతం ఎవరెవరి వేత ఆచరించబదింది?" అని ఋషులు అడుగగా, " మహబలవంతుడైన వాలి, రావణునే తన చంకయందు ఇరికించుకుని బందీని చేయు సందర్భంలో రావణుడు ఈ వ్రతం ఆచరించి సుఖంగా లంక చేరుకున్నాడు. హనుమతుడీ వ్రతప్రభాముచేత లంకలో సీతమ్మవారి జాడ కనిపెట్టగలిగాడు.

అట్లే, మహారణ్యంలో భర్తను గానక, అలమటిస్తున్న దమయంతి సంకష్టహర గణపతిని సంకల్ప మాత్రాన ప్రసన్నం చేసుకుని భర్త అయిన నలమహారాజును కలిసి సుఖంగా జీవించింది. అహల్యానాత కూడా పతి శావపశాన భర్తకు దూరమై ఈ వ్రతాచరణ వల్ల తిర్గి భర్త అయిన గౌతమ మహర్షిని చేరింది.

ఈ సంకష్టహర వ్రతం చేసి పుత్రులు లేనివారు పుత్రలాభం, ధనం లేనివారు ధనలాభం, విద్యలేనివారు విద్యాప్రాప్తి, వ్యాధిగ్రస్తులు ఆరోగ్యం పొంది సుఖంగా ఉండగలరు" అంటూ కుమారస్వామి వివరించాడు.

కధా సేకరణ : శ్రీ గణేశ పుస్తకం

ఓం గం గణపతయే నమః            

Saturday 17 August 2013

యక్ష ప్రశ్నలు

మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తర ఆరణి లేడికొమ్ములలో యిరుకుకొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నల్గురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడీ మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదౄష్యవాణి పలికినది ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆదీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకనే నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. ఆ ప్రశ్నలు ఇవే!!! ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు.

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)

3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)

6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)

7. మానవునికి సహయపడునది ఏది? (ధైర్యం)

8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన)

9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును? (అధ్యయనము వలన)

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల అసాధుభావము సంభవించును.)

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మౄత్యు భయమువలన)

12. జీవన్మౄతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు)

13. భూమికంటె భారమైనది ఏది? (జనని)

14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)

15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)

16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)

17. తౄణం కంటె దట్టమైనది ఏది? (చింత)

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)

19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)

20. రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? ( యజ్ణ్జం చేయుటవలన)

21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)

22. రూపం ఉన్నా హౄదయం లేనిదేది? (రాయి)

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన)

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)

25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)

26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)

27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)

28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)

29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)

30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)

31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)

32. మనిషికి ఆత్మ ఎవరు? ( కూమారుడు)

33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)

34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)

35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)

36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)

37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస)

38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)

39. ఎవరితో సంధి శిధిలమవదు? (సజ్జనులతో)

40. ఎల్లప్పుడూ తౄప్తిగా పడియుండునదేది? (యాగకర్మ)

41. లోకానికి దిక్కు ఎవరు? (సత్పురుషులు)

42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? (భూమి, ఆకాశములందు)

43. లోకాన్ని కప్పివున్నది ఏది? (అజ్ణ్జానం)

44. శ్రాద్ధవిధికి సమయమేది? (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)

45. మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? ( వరుసగా గర్వం, క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో)

46. తపస్సు అంటే ఏమిటి? ( తన వౄత్బికుల ధర్మం ఆచరించడం)

47. క్షమ అంటే ఏమిటి? ( ద్వంద్వాలు సహించడం)

48. సిగ్గు అంటే ఏమిటి? (చేయరాని పనులంటే జడవడం)

49. సర్వధనియనదగు వాడెవడౌ? ( ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు)

50. జ్ణ్జానం అంటే ఏమిటి? (మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం)

51. దయ అంటే ఏమిటి? ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)

52. అర్జవం అంటే ఏమిటి? ( సదా సమభావం కలిగి వుండడం)

53. సోమరితనం అంటే ఏమిటి? (ధర్మకార్యములు చేయకుండుట)

54. దు:ఖం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం కలిగి ఉండటం)

55. ధైర్యం అంటే ఏమిటి? ( ఇంద్రియ నిగ్రహం)

56. స్నానం అంటే ఏమిటి? (మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం)

57. దానం అంటే ఏమిటి? ( సమస్తప్రాణుల్ని రక్షించడం)

58. పండితుడెవరు? ( ధర్మం తెలిసినవాడు)

59. మూర్ఖుడెవడు? (ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు)

60. ఏది కాయం? ( సంసారానికి కారణమైంది)

61. అహంకారం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం)

62. డంభం అంటే ఏమిటి? (తన గొప్పతానే చెప్పుకోవటం)

63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (తన భార్యలో, తన భర్తలో)

64. నరకం అనుభవించే వారెవరు? (ఆశపెట్టి దానం ఇవ్వనివాడు; వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ, దానం చెయ్యనివాడు)

65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (ప్రవర్తన మాత్రమే)

66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (మైత్రి)

67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? (అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు)

68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు? (సుఖపడతాడు)

69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తౄప్తి చెందేవాడు)

70. ఏది ఆశ్చర్యం? (ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)

71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు)

72. స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు? (నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందు, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతౄప్తుడై అభిమాన్నని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడై ఎవరైఅతే ఉంటాడో వానినే స్థితప్రజ్ణ్జుడంటారు)
 l

Tuesday 6 August 2013

సాధనా పఞ్చకము - శంకర సందేశం

శంకర సందేశం :

మనందరికీ తర తరాలకీ ఆది శంకరులిచ్చిన సందేశం.

వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం
తేనేశస్య విధీయతామపచితిః కామ్యే మతి స్త్యజ్యతామ్ !
పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషోఽనుసంధీయతాం
ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతామ్ !! ౧

ప్రతిదినము వేదాధ్యయనం చేయుము. అందులో చెప్పబడిన కర్మలను అనుష్ఠించుము. ఈ కర్మాచరణమే ఈశ్వర పూజ అగు గాక, కామ్యముతో కర్మలను చేయుటను త్యజించుము. పాపములను పోగొట్టుకొనుము. సంసార సుఖములను (నిత్య అనిత్యాది విషయ సుఖములు) అనుసంధానించి పరిశీలించుము ఆత్మజ్ఞానము పొందడంలో కోరికను పెమ్చుకొనుము. గృహ నుండి అతి శీఘ్రముగా బయటికి వెళ్ళుము (శీఘ్రముగా శరీరభ్రాంతి నుండి దూరము అవ్వడానికి ప్రయత్నించుము).

సఙ్గః సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢాధీయతాం
శాన్త్యాదిః పరిచీయతాం దృఢతరం కర్మాశు సన్త్యజ్యతామ్ !
సద్‍విద్వానుపసర్ప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం
బ్రహ్మైకాక్షరమర్థ్యతాం శ్రుతిశిరోవాక్యం సమాకర్ణ్యతామ్ !! ౨

సత్సాంగత్యమును నెరపుము, సజ్జనులతోటి కలిసి మెలసి ఉండుము. భగవంతునిపై దృఢమైన భక్తిని కలిగి ఉండుము. శాంతి మొదలగు గుణములను ఆర్జించుము, కామ్య కర్మలను వర్జింపుము. సద్విద్వాంసులను, సద్గురువులను ఆశ్రయింపుము, వారి పాదుకలను ప్రతిదినమూ సేవింపుము . బ్రహ్మప్రాప్తికి తోడ్పడు ఏకాక్షర బ్రహ్మమంత్రమగు ఓంకారమంత్రమును అర్థించుము. శ్రుతుల శిరస్సులగు (వేదాంతములు) ఉపనిషత్తుల వాక్యములను వినుము.

వాక్యార్థ్యశ్చ విచార్యతాం శ్రుతిశిరః పక్షః సమాశ్రీయతాం
దుస్తర్కాత్ సువిరమ్యతాం శ్రుతిమతస్తర్కోఽనుసన్థీయతామ్ !
బ్రహ్మైవాస్మి విభావ్యతామహరహర్గర్వః పరిత్యజ్యతాం
దేహేఽహం మతిరుజ్‍ ఝ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతామ్ !! ౩

తత్త్వమస్యాది మహా వాక్యములను అర్థం చేసుకొనుటకు ప్రయత్నింపుము (విచారణ చేయుము), శ్రుతిశిరస్సులైన వేదాంత పక్షాన్ని పొందుము/ఆశ్రయింపుము. కుతర్కము వీడుము. శ్రుతి సమ్మతమగు తర్కమునే గ్రహించతగినది. ’నేను బ్రహ్మమును’ అని ప్రతిదినము భావింపుము. గర్వాహంకారములను వీడుము. శరీరమున ’అహం’-’నేను’ అను బుద్దిని వీడుము. బుధజనులు/పండితులతో అనవసర వాదు పరిత్యజించుము.

క్షుద్‍వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం
స్వాద్వన్నం న తు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతామ్ !
శీతోష్ణాది విషహ్యతాం న తు వృథా వాక్యం సముచ్చార్యతాం
ఔదాసీన్యమభీప్స్యతాం జనకృపానైష్ఠుర్యముత్సృజ్యతామ్ !! ౪

ఆకలిదప్పులను వ్యాధికి చికిత్స చేయుము, ప్రతిదినము భిక్షాన్నమను ఔషధము సేవింపుము. రుచికరములగు భోజన పదార్థములను యాచింపక, విధివశమున లభించినదానితో తృప్తిని పొందుము. శీతోష్ణాది ద్వంద్వములను తితిక్షాబుద్ధితో సహింపుము. వ్యర్థముగా వాక్యములను మాట్లాడకుము. ఉదాసీనతను వహింపుము (ప్రతి దానికీ కదిలిపోకుండా ఉండే గుణాన్ని అలవర్చుకొనుము) , లోకుల యెడ నిష్ఠూరుడవు కాబోకు.

ఏకాన్తే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం
పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతామ్ !
ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైః శ్లిష్యతాం
ప్రారబ్ధస్త్విహ భుజ్యతామథ పరబ్రహ్మాత్మనా స్థీయతామ్ !! ౫

ఏకాంతం ప్రదేశంలో సుఖముగ కూర్చుండుము. పరబ్రహ్మతత్త్వమునకై చిత్తమున సమాధాన పరచుము. ఈ జగత్తును పూర్ణబ్రహ్మముగా జూచుచు, అది విలీనమైనట్లు భావింపుము. జ్ఞానమునాశ్రయించి రాబోవు కర్మలయందు ఆసక్తుడవు కాకుండుము, ప్రారబ్ధను (భోగమును, దుఃఖమును) అనుభవించుచు, బ్రహ్మముయందే నిలచి ఉండుము (పరబ్రహ్మస్థితియందే నిమచు ఉండుము).

ఫలశ్రుతి
యఃశ్లోక పఞ్చకమిదం పఠతే మనుష్యః
సఞ్చిన్తయత్యనుదినం స్థిరతాముపేత్య !
తస్యాశు సంసృతిదవానలతీవ్రఘోర
తాపః ప్రశాన్తిముపయాతిచితి ప్రసాదాత్ !!
ఇతి శ్రీ శఙ్కరభగవత్పూజ్యపాద విరచిత సాధన పఞ్చకమ్

ఏ మానవుడు ప్రతిదినమూ ఈ శ్లోక పంచకమును పఠించుచు స్థిరచిత్తముతో భావార్థమును చింతించుచుండునో, అతడు శీఘ్రముగానే సంసృతి- తీవ్ర దావానల - తీవ్ర ఘోర - తాపమును, చైత్యన్య స్వరూపుడైన ఈశ్వరప్రసాదమున పోగొట్టుకొనును.

ఇది పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్య కృత సాధనా పఞ్చకము

సర్వం జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యస్వామి చరణారవిందార్పణమస్తు

-శంకర కింకర:

అద్వైతం సత్యం - వేదం ప్రమాణం
ధర్మస్యజయోస్తు - అధర్మస్య నాశోస్తు