Tuesday 23 July 2013

శాకంబరీ దేవి

మన సంస్కృతిలో శక్తి ఆరాధనకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. అందులోనూ పరబ్రహ్మాన్ని స్త్రీగా, అమ్మగా కొలిచే ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి మాత్రమే. అటువంటి ఆ మహాశక్తిని ఆషాఢమాసంలో శాకంబరి/శాకంభరి దేవిగా అలంకరిస్తారు. ఆషాఢమాసంలో శాకంభరి దేవి నవరాత్రులు చేస్తారు. ఈ మాసంలో అమ్మవారిని శాకంభరిదేవిగా ఆరాధించడం వలన లోకమంతా చల్లగా ఉంటుంది. శాకంబరి దేవి గురించి శ్రీ దేవి భాగవతంలో ప్రస్తావించబడింది. శాకంబరి దేవి అవతార వైశిష్ట్యం గురించి తెలుసుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయి.

--------------------------------------

జనమేజయ ఉవాచ:

వేదవ్యాస మహర్షితో జనమేజయుడు "ఓ మహర్షి! రాజర్షి హరిశ్చంద్రుడు శతాక్షిదేవి భక్తుడని సెలవిచ్చారు. శివుని భార్య అయిన శివా (శివ అంటే శివుడు, శివా అంటే పార్వతీ దేవి), శతాక్షి దేవిగా ఎందుకు పిలువబడుతోంది? అందుకుగల కారణం వివరించండి. విని నా జన్మను సార్ధకం చేసుకుంటాను. ఎవరు ఆ మహాదేవి ఒక్క మహిమలను పరిశుద్ధమైన మనసుతో, ఆదిశక్తి యందు అచంచలమైన భక్తితో వింటారో/తెలుసుకుంటారో, వారు విన్న ఒక్కో వాక్యానికి ఆశ్వమేధ యాగం చేసిన పుణ్యం ప్రాప్తిస్తుంది. కనుక శతాక్షి దేవి గురించి చెప్పగలరు" అన్నాడు.

వ్యాస ఉవాచ -

"ఓ రాజా! నువ్వు దేవి భక్తుడవు. అందువల్ల నీకు ప్రత్యేకంగా పరమేశ్వరి గురించి చెప్పనవసరం లేదు. నేను శతాక్షి దేవి గురించి చెప్తాను విను" అంటూ వ్యాస మహర్షి ప్రారంభించారు.

పూర్వం దుర్గముడనే మహాకౄరుడైన అసురుడు/దానవుడు ఉండేవాడు. హిరణ్యాక్షవంశంలో జన్మించాడు. రురు చక్రవర్తికి యొక్క కొడుకు. చాలా శక్తివంతుడు, భయానకుడు. 'వేదం చెప్పినట్టుగా వేదమంత్రాలతో చేసిన యజ్ఞభాగాన్ని దేవతలు గ్రహించి శక్తివంతులవుతారు. శక్తివంతమైన దేవతలు జనుల యొక్క కోరికలను సిద్ధింపజేస్తారు. దేవతలకు బలం వేదం. దేవతలను నాశనం చేయాలంటే, దేవతలను ఓడించాలంటే, వేదాలను వశం చేసుకోవాలి. అప్పుడు దేవతల వలె శక్తిని పొందవచ్చు. అందులో సందేహం ఏంత మాత్రమూ లేదు' అనే ఆలోచన వాడి మనసులో కలిగింది.

ఈ ఆలోచన రాగానే హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మదేవుడి గురించి ఘోరతపస్సు ప్రారంభించాడు. కేవలం గాలిని మాత్రమే తీసుకుంటూ, ఏ ఇతర ఆహారపదార్ధం తీసుకోకుండా వేయి సంవత్సరాలు తీవ్రంగా తపస్సు చేశాడు. దుర్గముడి తపస్సు నుంచి పుట్టిన తేజస్సుతో కూడిన తాపం (వేడి) దేవ, దానవ లోకాలను తపింపచేసింది.

దుర్గామాసురుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు వికసించిన తామరపూవు వంటి ప్రసన్నమైన వదనం (ముఖం) తో వరం ప్రసాదించడానికి హంసవాహనం మీద ప్రత్యక్షమయ్యారు. చిన్నగా తన కన్నులు తెరిచి, తీవ్రమైన ధ్యానంలో ఉన్న దుర్గమాసురుడి వంక చూసి, నీకు ఏ వరం కావాలో కోరుకో, నీ మనసులో ఉన్నది నీకు సిద్ధించుగాక, నీవు అన్ని శుభాలే పలుకుగాక అన్నాడు. నేను నీ తీవ్రమైన తపస్సుకు మెచ్చి, నీకు వరం ఇవ్వడానికి వచ్చాను అన్నారు.

అది విన్న దుర్గముడు తన సమాధి (ధ్యానం) నుంచి మేల్కొని బ్రహ్మను స్తుతించాడు. తరువాత తాను భావించినట్టుగానే "ఓ సురేశ్వరా! వేదాలన్నీ నా దగ్గర ఉండాలి. మూడు లోకాల్లో ఋషులు, బ్రాహ్మణుల దగ్గర ఉన్న వేదమంత్రాలు నా ఆధీనంలో ఉండాలి. ఓ మహేశ్వరా! నాకు దేవతలను ఓడించగలిగే శక్తి కావాలి" అని పలికాడు. బ్రహ్మదేవుడు 'తదాస్తు' అని పలికి సత్యలోకానికి వెళ్ళిపోయాడు.

తతః ప్రబృతి విప్రైస్తు విస్మృతా వేదరహస్యాః
స్నాన సంధ్యా నిత్య హోమ శ్రాద్ధా యజ్ఞ జపాదయః

దుర్గముడికి బ్రహ్మ ఇచ్చిన వరప్రభావం చేత బ్రాహ్మణులు వేదాలను మర్చిపోయారు. బ్రాహ్మణులే అన్ని వర్ణాల వారికి వేదవిహితకర్మలను, వేదోక్త ధర్మాన్ని ప్రవచించాలి, అందరిని నడిపించాల్సిన బ్రాహ్మణులే వేదాలను మర్చిపోవడంతో మిగితా అన్ని వర్ణాల వారు కూడా ధార్మిక జీవనానికి దూరమయ్యారు. ఫలితంగా స్నానము, సంధ్యావందనము, నిత్యాగ్నిహోత్రము, శ్రాద్ధ కర్మలు, యజ్ఞాలు, జపాలు అన్ని భూమి మీది నుంచి మాయమైపోయాయి. దాంతో కరువు ఏర్పడింది. భూగోళం మొత్తం రోదలనలు, హాహాకారాలు, ఆర్తనాదాలతో నిండిపోయింది. ఇది ఎలా జరిగింది? ఇది ఎలా జరిగింది? అని బ్రాహ్మణులు ప్రశ్నించుకోసాగారు. వేదం లేనినాడు మాకు విధింపబడిన కర్మలను మేము ఏ విధంగా ఆచరించాలి అని విచారించసాగారు.

యజ్ఞంలో వేయబడిన హవిస్సును స్వీకరించిన దేవతలు శక్తిని పొంది జనుల యొక్క కోరికలని తీరుస్తారు. యజ్ఞాలు ఆగిపోవడం చేత నిర్జరులైన (ముసలితనం అంటూ లేనివాళ్ళు) దేవతలు బలహీనులు, వృద్ధులుగా మారిపోయారు. దాంతో దేవతల యొక్క రాజధాని అయిన అమరావతి మీద దైత్యులు (రాక్షసులు) దాడి చేసారు.

హవిస్సు లేక బలహీనులైన దేవతలు వజ్రం వంటి ధృడమైన శరీరంగల రాక్షసులతో యుద్ధం చేయలేకపోయారు. ఫలితంగా దైత్యులు అమరావతిని స్వాధీనపరుచుకుని దేవతలను వెళ్ళగొట్టారు. దేవతలందరూ రాక్షసులు చేరుకోవడానికి కష్టతరమైన మేరు/సుమేరు పర్వత గుహలలోకి చేరుకుని ఆదిశక్తి మీద మనసు నిలిపి, అచంచలమైన, ఉత్కృష్టమైన భక్తితో ధాన్యంలో మునిగిపోయారు.    

చాలామంది ఇక్కడ ఒక సందేహం వస్తుంది. దుర్గాముసుడు వేదాలను పొందదం వల్ల లోకంలో క్షామం (కరువు) ఏర్పడడమేమిటి? సర్వశక్తివంతులు, కోరిన కోరికలను తీర్చే దేవతలు యజ్ఞాలు చేయకపోవడం వలన శక్తిహీనులవడమేంటి? యజ్ఞ హవిస్సు లేక శక్తిహీనులైన దేవతలను అమరావతి నుంచి తరిమేయడమేంటి? అని చాలామందికి అనిపిస్తుంది. కధలో ముందుకు వెళ్ళే ముందు వాటి ఈ సందేహాలను క్లుప్తంగా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం.

సనాతన ధర్మంలో దేవతలకు పరమాత్మకు (పరబ్రహ్మానికి) తేడా ఉంది. ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు మొదలైన అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు మొదలైనవాళ్ళు దేవతలు. శివ, విష్ణు, పార్వతీ, లక్ష్మీ, గణపతి, వేంకటేశ్వర స్వామి మొదలైనవారు పరబ్రహ్మం(పరమాత్మ) యొక్క ప్రతిబింబాలు. దేవతలు కూడా మనవంటి వారే, పుణ్యకర్మ చేయడం వలన వారికి దేవతాజన్మ వచ్చింది, పుణ్యం సుఖంగా రూపాంతరం చెంది సంతోషం అనుభవిస్తారు, సుఖం అనుభవించగానే పుణ్యం క్షీణిస్తుంది, అలా పుణ్యం క్షీణించిన ఇంద్రాది దేవతలు తిరిగి భూలోకంలో పుడతారు. కానీ పరబ్రహ్మం వీటికి అతీతుడు. ఆయన అన్నిటికి సాక్షి, ద్రష్ట, అంతర్యామి. పరమాత్మ సర్వశక్తివంతుడు, నిత్యపుష్టుడు, శాశ్వతుడు. దేవతలు ప్రకృతి శక్తులు. ప్రకృతిలో అంతర్యామిగా ఉంటూ మానవాభివృద్ధికి కారణమవుతుంటారు. ప్రకృతిలో ఉండే విద్యుత్ శక్తి ఇంద్రుడు. మిత్రావరుణులు ఆక్సిజెన్, హైడ్రోజెన్ అణువులు. ఇంద్ర, మిత్ర, అగ్ని, వరుణ అనేవి నానార్ధాలు కలిగిన పేర్లు. వీటికి అనేక కోణాల్లో అనేక అర్దాలున్నాయి.

సృష్టి ఆదిలో పరమాత్ముడు మనుష్యులను, దేవతలను, వీరితో పాటు యజ్ఞాన్ని సృష్టించాడు. మానవులు, దేవతలు ఒకరిమీద ఒకరు పరస్పరం ఆధారపడి ఉండేలా, మనుష్యులు చేసిన యజ్ఞం యొక్క హవిస్సును (యజ్ఞంలో వేయబడిన ఆహుతులను హవిస్సు అంటారు) దేవతలు స్వీకరించి శక్తివంతులయ్యేలా, శక్తివంతమైన దేవతలు మనుష్యుల కోరికలను తీర్చాలని, కోరికలు తీరడంతో సంతుష్టులైన మానవులు తిరిగి యజ్ఞాలు చేయాలని పరమాత్మ శాసనం చేశారు. భగవద్గీతలో ఈ విషయమే కృష్ణ పరమాత్మ చెప్తారు. ఈ దేవతలను శక్తివంతం చేస్తుంది నిత్యాగ్నిహోత్రం. ఈ నిత్యాగ్నిహోత్రం అన్ని వర్ణాల వారూ చేయాలి. ఇందులో ఎవరికి మినహయింపు లేదు.

హోమం, యజ్ఞం మొదలైనవి కాలుష్యాన్ని తగ్గిస్తాయని మన గ్రంధాలు చెప్తున్నాయి, ఆధునిక పరిశోధనలూ చెప్తున్నాయి. అగ్నిహోత్రం చేయడం చేత ఆరోగ్యం సంతరించడంతో పాటు, మన చుట్టూ ఉన్న కాలుష్యాన్ని తగ్గించినవారం అవుతాం. వీటికి తోడు యజ్ఞం పర్యావరణంలో సమతుల్యాన్ని సృష్టిస్తుంది. వేదంలో చెప్పబడినట్టుగా చేయబడిన యజ్ఞం ఏ కాలంలోనైన వర్షాన్ని కురిపిస్తుంది (ఆధునిక కాలంలో మళ్ళీ ఋజువు చేయబడింది).

ఇక వేద మంత్రం విషయానికి వద్దాం. మంత్రం శబ్దమే అయినా దానికి ఒక రూపం ఉంటుంది. మంత్రం చదివినప్పుడు కొన్ని తరంగాలు ఉద్భవిస్తాయి. యజ్ఞంలో వేసిన హవిస్సును అగ్నిదేవుడు దేవతలకు చేర్చడంలోమంత్రం కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునికులకు అర్దమయ్యేలా చెప్పాలంటే అగ్నిహోత్రంలో వేసిన ఆహుతుల మధ్య రసాయన చర్య (కెమికల్ రీయాక్షన్) జరిగి, అవి గాలిలో సూక్ష్మరూపంలో, వాయువుల రూపంలోనూ ఆకాశంలో నిర్దేశిత ప్రదేశం చేరడానికి పట్టే సమయంలో ఆ మంత్రం చదవడం పూర్తి అవుతుందన్నమాట. ఒక్కో రకమైన యజ్ఞంలో ఒక్కో రకమైన చంధస్సుతో కూడిన మంత్రాలు చదువుతారు, ఆ మంత్రం పఠనానికి పట్టే సమయంలో ఈ హవిస్సు వాయురూపంలో అతివేగంగా ఆయప్రదేశాలకు చేరుతుంది.

క్లుప్తంగా చెప్పుకోవాలంటే అంతరిక్షలోకి ప్రయోగించిన రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి చేరడానికి క్రింది రాకెట్ కేంద్రం నుంచి కంప్యూటర్ల ద్వారా ఎలా పర్యవేక్షిస్తారో, సరిగ్గా అదే విధంగా యజ్ఞ హవిస్సు దేవతలను (ప్రకృతిలో నిర్దేశిత ప్రదేశాన్ని) చేరడానికి మంత్రం సహాయపడుతుంది.

ఇది దైవికంగా చూసినప్పుడు యజ్ఞం దేవతలకు శక్తినిస్తే, సైన్సుపరంగా చూసినప్పుడు పర్యావరణంలో సమతుల్యాన్ని ఏర్పరుస్తుంది. మనిషి యొక్క మానసిక, శారీరిక స్థితులను బట్టి చెప్పవలసి వస్తే యజ్ఞం శరీరంలో ఉన్న రాక్షసులను (రోగాలను) తరిమేస్తుంది. మద్యపానం, ధూమపానం (సిగిరెట్టు) మొదలైన వాటికి బాగా అలవాటు పడినవారు, రోజు అగ్నిహోత్రం చేయడం చేత, అతి తొందరగా ఈ దురలవాట్లను మానేసినట్లు ఆధునిక పరిశోధనలు చెప్తున్నాయి.

ఇప్పుడు గమనిస్తే దుర్గామసురుడు కోరిన వర ప్రభావం చేత యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. ఫలితంగా పర్యావరణం కాలుష్యమైంది, పర్యావరణసమతుల్యం దెబ్బతిన్నది, హవిస్సు లేక దేవతలు శక్తిహీనులయ్యారు, వర్షాలు కురవడం ఆగిపోయింది. పర్యావరణం దెబ్బతింటే కలుషిత పదార్ధాలు పెరిగిపోతాయి. అవి ఓజోన్ పొర నాశనానికి, భూతాపం పెరగడానికి కారణమవుతాయి. భూతాపం పెరిగితే, ఋతువులు క్రమం అస్తవ్యస్తం అవుతుంది. అతివృష్టి, అనావృష్టి ఏర్పడతాయి. సమయం కాని సమయంలో వర్షాలు పడతాయి. ఫలితంగా వ్యవసాయం దెబ్బతింటుంది, ఆకలి పెరుగుతుంది, కాలుష్యం, భూతాపం కొత్తరోగాలను పుట్టిస్తుంది. దాంతో ప్రపంచమంతా హాహాకారులు వినిపించాయి. ఇక అసురులు అమరావతిని స్వాధీనపరుచుకోవడం కూడా చూస్తే, దేవతలు మానవ మనసుపై ప్రభావం చూపిస్తారు, మంత్రపఠనం, అగ్నిహోత్రం ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. మనిషి మనసే అమరావతి (దేవతలకు రాజాధాని). వేదం మనిషి యొక్క జీవనాన్ని నిర్దేసిస్తుంది. ఇవన్ని మర్చిపోవడం వలన మనిసి మనసులోకి చెడు ఆలోచనలు (రాక్షసులు) ప్రవేశిస్తాయి. అత్యాశ, హింస, స్వార్ధం, భౌతిక వాదం పెరిగిపోతాయి. బయట ఏర్పడిన కరువు ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి మనిషిలో ఉన్న దైవత్వం పోయి, మనసును రాక్షసత్వం ఆక్రమిస్తుంది. అందుకే దేవతలు రాక్షసుల చేతిలో ఓడిపోయి సుమేరు పర్వత గుహలలో తలదాచుకున్నారని కధలో కనిపిస్తుంది.  

జనమేజయుడితో వ్యాసమహర్షి ఈ విధంగా పలుకుతున్నారు. ఓ రాజా! పవిత్రమైన అగ్ని ఆరాధన (అగ్నిహోత్రము, యజ్ఞయాగాదులు), హవిస్సులు లేని కారణం చేత వర్షాలు కురవడం ఆగిపోయింది. ఎప్పుడు జలాలతో నిండుగా ఉండే చెరువులు, తటాకాలు, నదులు అన్ని పూర్తిగా ఎండిపోయాయి. భూగోళం మీద త్రాగడానికి చుక్క నీరు కూడా లేదు. భూమి మొత్తం ఎండిపోయింది. ఈ పరిస్థితి ఒక వంద సంవత్సరాల పాటు కొనసాగింది. కరువు కారణంగా జనులు, జంతువులు, ఆవులు, గేదెలు, ఒక్కటేమిటి అన్ని జీవులు చాలావరకు మరణించాయి. వేదమూ, వైదిక క్రియలు మర్చిపోయిన కారణం చేత చనిపోయిన శవాలకు దహన సంస్కారం (కాల్చడం) నిలిచిపోయింది. ప్రపంచంలో ఎక్కడ చూసిన అందరి ఇళ్ళలో శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. (వేదమే సమస్తకర్మలకు మూలం. చెప్పులు కుట్టడం నుంచి యజ్ఞం వరకు, రాకెట్ తయారి, అణుబాంబు తయారి వరకు అన్నిటికి వేదమే మూలం.) ఇలాంటి సందర్భంలో ప్రశాంత చిత్తులైన బ్రాహ్మణులు (బ్రహ్మ జ్ఞానం కలిగినవారిని బ్రాహ్మణులు అంటారు. బ్రహ్మజ్ఞానికి జన్మతో సంబంధం లేదు) ఈ అనర్ధాన్ని చూసి 'శివా'ను వేడుకోవడం కోసం హిమాలయ పర్వతాలకు పయనమయ్యారు.

పూజ, సమాధి, ధ్యానం మొదలైనవాటితో ఆ పరమేశ్వరిని సంతుష్టురాలిని చేయడానికి ఏ రోజు కారోజు ప్రయత్నిస్తూనే ఉన్నారు. నిరాహారులై, 'అమ్మ' యందే మనసు నిలిపి 'అమ్మ'ను శరణాగతి చేశారు .

దయాం కురు మహేశాని పామరేషు జనేషు హి|
సర్వాపరాధయుక్తేషు నైత్ఛలాఘ్యాం తవాంబికే||

ఓ మహేశాని (మాహా మహా ఐశ్వర్యములకు అధికారిణి; మహేశ్వరుని భార్య;)! మా యందు దయ చూపు. మేము పామరులము (ఏమి తెలియనివారము). ఎన్నో తప్పులు చేసాము. నిన్ను స్తుతించే అనుగ్రహం పొందే అర్హత కూడా లేదు. అయినా నీ బిడ్డలం కదమ్మా! మా యందు దయ చూపవూ!

కోపం సంహార దేవేశి సర్వాంతర్యామిరూపిణి |
త్వయా యతా ప్రేరయేతే2ం కరోతి స తధాజనాః ||
నాన్య గతిర్జనస్యస్యా కిం పశ్యసి పునఃపునః|
యతేఛ్చసి తధాకర్తుం సమర్ధోసి మహేశ్వరీ ||

ఓ దేవేశి (దేవతలకు ఈశ్వరి)! మా మీద నీ కోపాన్ని తగ్గించమ్మా. నీవు సర్వజీవులలో అంతర్యామిగా ఉంటూ అందరిని నడిపిస్తున్నావు, అందరి కర్మలకు సాక్షిగా ఉన్నావు. అందరి యొక్క ఆలోచనలు ఎరిగినదానివి, అందరిని ఆలోచింపచేసేదానివి కూడా నీవే. నువ్వు ఏ విధంగా నడిపిస్తే జనులు ఆ విధంగా నడుస్తారు. నీవు తప్ప మాకు వేరే గతి లేదు. నువ్వే శరణు. ఓ మహేశ్వరీ! నీవు ఏమైనా చేయగల సమర్ధురాలవు. అయినా నీవు దేని కోసం మళ్ళీమళ్ళీ మౌనంగా  చూస్తున్నావు.

సముద్ధర మహేశాని సంకటాత్పరమోత్థితాత్ |
జీవనేన వినా2స్మాకం కథం స్యాత్స్థితిరంబికే ||
ప్రసీదం త్వం మహేశాని ప్రసీద జగదంబికే |
అనంతకోటి బ్రహ్మాండా నాయికెతే నమోనమః ||

ఓ మహేశాని! ఇప్పుడు సంభవించిన సంకట పరిస్థితి నుంచి మమ్ముల్ని రక్షించు తల్లీ. ఓ అంబికా (అమ్మా)! నీరు లేకపోతే మేము ఎలా జీవించగలము. దయచూపు ఓ మహేశాని! ఓ జగదంబ (జగత్తునకు అమ్మ) ! కనికరించు. ఓ మహేశాని! కరుణించు! అనంతకోటి బ్రహ్మాండాలకు నాయికవు (నడిపించే దానివి) అయిన నిన్ను మళ్ళీమళ్ళీ వేడుకుంటున్నాం అమ్మా!

నమః కుటస్థం రూపాయై చిద్రూపాయై నమోనమః |
నమో వేదాంతవేద్యాయై భువనేశ్యై నమోనమః ||
నెతినెతీతి వాక్యైర్యా బోధ్యతే సకలాగమైః |
తాం సర్వకారణాం దేవీం సరభావేన సన్నతాః ||

సకల జనుల యొక్క భ్రూమధ్యంలో (రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశంలో) 'కూటస్థ' అనే పేరుతో చైతన్యరూపంలో ఉన్న ఓ దేవి, నీకు మా నమస్సులు.
- భ్రూమధ్యలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఇది జీవుడి స్థానం. జపం, ధ్యానం, ప్రాణాయామం మొదలైనవి సాధన చేసే సమయంలో కన్నులు మూసుకుని దృష్టినంతా ఆజ్ఞాచక్రం మీద నిలపమని గురువులు చెప్తారు. బ్రహ్మచర్యం, అహింస, శమము, దమము, అస్తేయం మొదలైన అనేక లక్షణాలను (యోగశాస్త్రాంలో, ధర్మశాస్త్రంలో చెప్పబడ్డవి) కలిగి ఉంటూ, ఈ ఆజ్ఞాచక్రం మీద దృష్టి నిలిపి రోజు ధ్యానం చేయడం చేత సిద్ధులు ప్రాప్తిస్తాయని చెప్పబడింది. దూరశ్రవణం, దూరవీక్షణం, భవిష్యద్దర్శనం మొదలైనవి ఎన్నో. అయితే సాధకుల లక్ష్యం ఈశ్వరుడే కావాలి కానీ సిద్ధులు కాదు. ఈ ఆజ్ఞాచక్రం నిద్రాణమవ్వకుండా ఉండటం కోసమే తిలక ధారణ చేస్తారు. సనాతనధర్మాన్ని అవలంబించేవారందరూ విధిగా బొట్టు పెట్టుకోవాలి. ప్రతి శుభకార్యానికి ముందు దీపారాధన చేస్తారు. దాని కంటే ముందు కుంకుమ ధరిస్తారు. బొట్టు లేకుండా చేసే ఏ కార్యం కూడా ఫలితాన్ని ఇవ్వదని ధర్మం గట్టిగా చెప్తోంది. బొట్టు అంటే స్టిక్కర్లు, రంగులు కాదు, అచ్చమైన కుంకుమ, లేదా గోమయంతో చేసిన విభూతి, లేదంటే చందనం. ఇలా బొట్టు పెట్టుకోవడం ఈ ఆజ్ఞాచక్రాన్ని ప్రేరేపించడం కోసమే. పిల్లలకు చిన్నవయసు నుంచే బొట్టు పెట్టుకోవడం అలవాటు చేస్తే, ఈ ఆజ్ఞాచక్రం చైతన్యంగా ఉంటూ, ఇంద్రియ నిగ్రహాన్ని, మనోనిగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అమ్మవారు ఈ ఆజ్ఞాచక్రంలో కూటస్థం రూపంలో ఉంటుంది. అనగా చైతన్యం అన్నమాట. సాధకుడు ఈ స్థాయికి చేరుకున్నప్పుడు, అతడు కళ్ళతో పనిలేకుండా తన చుట్టూ 360 డిగ్రీల్లో జరిగేవి, దూరంగా జరిగేవీ కూడా వీక్షించగలడు. అందుకే ఇక్కడ అమ్మవారికి 6 ముఖాలని లలిత సహస్రనామాల్లో చెప్పబడింది. 6 ముఖాలు 4 దిక్కులను, పైన, క్రింద చూస్తుంటాయి, అనగా భగవంతుడు లక్షణమైన సర్వతోముఖం అన్నమాట.
చిత్ అంటే చైతన్యం, కదలిక, సర్వజీవుల్లోను చైతన్యం రూపంలో వ్యకతమవుతున్న తల్లే అమ్మవారు. చిద్రూపిణిగా, పరిపూర్ణమైన చైతన్యంగా నిత్యం వెలుగొందుతూ ఉండే నీకు నమస్సులు.
వేదవేదాంతల ద్వారా తెలుపబడేదానివి నీవు.
సకల భువనాలకు ఈశ్వరివైన నీకు మా నమస్కారాలు.
ఇది కాదు, ఇది కాదు అంటూ ఆగమాల ద్వారా తెలుపబడే అన్నిటికంటే ఉన్నతమైన, సర్వాతీతమైన పరతత్వం నీవు.
ఓ దేవి! అన్నిటికి కారణం నీవేనమ్మా! ఇంత వైభవం కలిగిన ఓ మహాదేవి సర్వ భావములతో నీకు నమస్కరిస్తున్నాము అంటూ వేడుకుంటున్నారు.

ఇతి సంప్రార్థితా దేవీ భువనేశీ మహేశ్వరీ |
అనంతాక్షిమయం రూపం దర్శయామాసపార్వతీ ||
నీలానజనసమప్రఖ్యాం నీలపద్మాయతేక్షణం |
సుకకర్షసమోత్తుంగవృతపీనఘనస్థనం ||

ఈ విధంగా అందరూ కలిసి సకల భువనాలకు ఈశ్వరీ అయిన మహేశ్వరిని ప్రార్ధించడంతో ఆఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి,  నిరాకార రూపిణి, త్రిగుణాత్మికా, సచ్చిదానంద స్వరూపిణి, సమస్త లోకాలను కేవలం తన సంకల్ప మాత్రంచేత సృజించగలిగిన శక్తిస్వరూపిణి, అయిన ఆ జగజ్జనని కాటుకరంగును పోలిన నల్లని వర్ణంతో, దివ్యప్రభలను విరజిమ్మే తేజస్సుతో, నీలి పద్మాలవంటి విశాలమైన కన్నులు శరీరమంతా కలిగినదై, అనంతమైన అక్షములతో (కన్నులతో), పెద్ద వక్షోజములతో మూర్తీభవించింది.

బాణముష్టించ కమలం పుష్పపల్లవ మూలకాన్ |
శాకాదీన్ ఫలసమాయుక్తాన్ అనంతరస సమ్యుతాన్ ||
క్షుత్ తృష్ణ జరాపహ హస్తైర్బిభృతిచ మహాధనుః |
సర్వసౌందర్య సారం తద్రూపం లావణ్యశోభితం ||

ఒక చేతితో బాణం, రెండవ చేతితో కమలం పట్టుకుంది, మూడవచేతితో సారవంతమైనవి, తినగానే పుష్టినిచ్చేవి, ఆకలిని తీర్చేవి, బలహీనతలను నశింపజేసేవైన పుష్పములు (పువ్వులు), మొలకలు, కందమూలాలు, కూరగాయలు, ఆకుకూరలు, రసము కలిగిన పండ్లు ధరించింది. నాల్గవ చేతితో ఒక మహాధనస్సును ధరించి కనిపించింది. ప్రపంచంలో ఉన్న అందమంతా ఒక చోట చేర్చిన సరితూగని మహాసౌందర్యంతో, అన్ని రకాల సౌందర్యాలను కలబోసిందా అన్నట్టుగా సర్వ సౌందర్యరాశియై, ప్రేమ, కరుణ మొదలైన గుణాలను వ్యక్తపరుస్తూ సర్వజీవులను సమ్మోహ పరుస్తున్నట్టుగా ఉన్నది ఆ దేవి యొక్క దివ్య స్వరూపం. అది జగన్మోహన స్వరూపం. ఆ రూప సందర్శనమే కామవాంఛలను పటాపంచలు చేస్తుంది.

కోటిసూర్యప్రతీకాశం కరుణారససాగరం |
దర్శయిత్వా జగద్దాత్రీ సో2నంతనయనోద్భవో ||
మోచాయమాస లోకేషు వారిధారాః సహస్రశః |
నవరాత్రం మహావృష్టిరభూనేత్రోద్భవైర్జలం ||


కరుణా సముద్రురాలు అయిన ఆ తల్లి కోటి సూర్యల కాంతితో వెలిగిపోతోంది. జగత్తు మొత్తాన్ని ధరించే ఆ మహాశక్తి అక్కడున్న దయనీయ పరిస్థితిని అనంతమైన కన్నులతో వీక్షించింది. సర్వాతితురాలైనప్పటికి ఆ మహాశక్తి బ్రహ్మ మొదలు సకల జీవులకు అమ్మ. ఏ తల్లీ కూడా తన బిడ్డలు కష్టాలు పడుతుంటే చూడలేదు. బిడ్డలు పడే బాధకంటే, వారి బాధను చూసి తల్లి పడే బాధయే ఎక్కువ. ఆ పరమేశ్వరీ కూడా తన బిడ్డల కష్టాలను చూడలేక విలపిస్తూ కన్నీరు కార్చింది. అమ్మ యొక్క అక్షయమైన కన్నుల వెంట వచ్చిన నీరు ఏరులై పారింది. దాంతో తొమ్మిది రాత్రుల పాటు ఎన్నడు ఎరుగని అతిభారీ వర్షాలు కురిసి ఎండిపొయిన భూమి మీద జలం పొంగి ప్రవహించింది.

దుఃఖితాన్వీక్షస్య సకలాన్నేత్రాశృణీ విముంచతి |
తర్పితాస్తేన తే లోకా ఓషధయః సకలా అపి ||
నదీనదాప్రవాహాస్తైర్జలైః సమభవన్నృపా |
నీలీయ సంస్థితాః పూర్వం సురారస్తే నిగర్తా బహిః ||

దుఃఖితులైన జనులను, జీవులను చూసి అమ్మ ధారగా కార్చిన కన్నీరు జనులు, ఓషధుల యొక్క బాధలను తీర్చేసింది. ఆ కన్నీటి ధారతో నిండిన నదులు తిరిగి ప్రవహించసాగాయి. అప్పటివరకు మేరు పర్వత గుహలలో దాక్కున దేవతలు బయటకు వచ్చారు.

వ్యాఖ్య - అమ్మవారి కన్నుల వెంట వచ్చిన నీరే నదులుగా, సరసుల్లో ప్రవహించింది. ఇప్పుడున్న జలవనరులన్నీ అమ్మవారి ప్రసాదమే. అదంతా ఆవిడ మనకోసం ప్రేమతో కార్చిన కన్నీరే. అటువంటి జలాన్ని మనం ఎంతో జాగ్రత్తగా ఉపయోగించాలి. ప్రసాదంగా భావించాలి. నీటిని వృధా చేయకూడదు. జలవనరులను కలుషితం చేయకూడదు. అప్పుడే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలా కాకుండా నీటిని వృధా చేస్తూ, జలాలను కలుషితం చేస్తుంటే, ఎన్ని పూజలు చేసిన అమ్మ అనుగ్రహం ఎలా కలుగ్తుంది? పైగా అమ్మవారిని అవమానించిన పాపం కూడా వస్తుంది.

మిలిత్వా ససురావిప్రా దేవీంసమభితుష్టువుః |
నమో వేదాంతవేద్యేతే నమో బ్రహ్మస్వరూపిణీ ||
స్వమాయయా సర్వజగద్దాత్రై తే నమోనమః |
భక్తకల్పద్రుమే దేవి భక్తార్ధం దేహదారిణి ||

బ్రాహ్మణులతో కలిసి దేవతలు కూడా 'అమ్మ'ను స్థుతించసాగారు.  వేదాంతము ద్వారా తెలియబడే దానివి, సాక్షాత్తు పరబ్రహ్మానివి అయిన నీకు వందనాలు. సకల జగత్తును నీ మాయ చేత సృష్టిస్తావు. భక్తుల పాలిటి కల్పవల్లివి, కల్పవృక్షానివి, కోరిన కోరికలు తీర్చేదానివి. భక్తుల కోసమే నీవు ఒక రుపాన్ని ధరిస్తావు/పొందుతావు. అటువంటి నీకు శిరస్సువంచి నమస్కరిస్తున్నాం తల్లీ.

నిత్యతృప్తే నిరుపమే భువనేశ్వరి తే నమోనమః |
అస్మత్ఛంత్యార్ధమతులం లోచనానాం సహస్రకం ||
త్వయా యతో ధృతందేవి శతాక్షీ త్వం తతోభవ |
క్షుదయాపీడితా మాతః స్తోతుంశక్తిర్నచాస్తినః ||

నిత్యం అనంతమైన తృప్తితో ఉండేదానివి, ఎవరుతోనూ పోల్చదగినదానివి కావు, సమస్త భూవనాలకు ఈశ్వరివైన నీకు మా నమస్కారములు. సహస్ర (అనంతమైన) కన్నులు కలిగినరూపంతో వ్యక్తమై లోకాలకు శాంతిని పంచావు. అందువల్ల నీవు 'శతాక్షీ దేవి'గా పిలువబడుతావు. ఆకలితో పీడింపబడుతున్న మాకు ఇంక నిన్ను స్తుతించే శక్తి లేదు తల్లీ.

అమ్మా మా యందు కృప చూపించి వేదములను తిరిగి మాకు ప్రసాదించు అని దేవతలు, జనులు మహేశ్వరిని వేడుకున్నారు.



వ్యాసుడు జనమేజయుడుతో "ఓ రాజా! ఈ మాటలు వినగానే అమ్మ తన చేతిలో ధరించిన రుచికరమైన కూరగాయలు, పండ్లను జనులకు ఇచ్చింది. ఆ పరమేశ్వరి.......... బ్రహ్మ దేవుడు మొదలు చిన్న కిటకముల వరకు అందరికి తల్లి కదా. అందువల్ల జనులతో పాటు ఇతర జీవుల ఆకలిని కూడా తీర్చింది. జంతువులకు, పక్షులకు వాటికి సరిపడా ఆహారాలను అందించింది.

ప్రార్ధనలు చేయగానే కరుణించి మంచి రసకరమైన, పుష్టికరమైన కూరగాయాలను, పండ్లను అందరికి ప్రసాదించింది కనుక ఆ రోజు నుంచి 'శాకంబరి' / 'శాకంభరి' అనే పేరుతో ప్రపంచంలో ప్రసిద్ధి పొందింది. శాకంబరీ దేవి ఆహారానికి, ప్రకృతికి ప్రతిరూపం. శాకములంటే కూరలని అర్ధం. శాకంభరి హరితజీవనానికి ప్రతీక. స్తోత్రాలే కాక, ఆహారాన్ని, కాయగూరలు, పండ్లను వృధా చేయకపోవటం, సద్వినియోగం చేయటం, అమ్మ కన్నీటి నుంచి వచ్చినాయి కనుక నీటిని వృధా చేయకుండా ఉండటం, ప్రకృతిని రక్షించడం, ప్రకృతికి పుష్టి కలిగించే పనులు చేయటం కూడా శాకంభరి దేవికి చేసే ఆరాధనయే అవుతుంది.

అమ్మ అందరికి ఆకలిని తీర్చిందన్న విషయం, దేవతలందరూ సమావేశమవడం వలన కలిగిన శబ్దాన్ని దూత ద్వారా తెలుసుకున్న దుర్గామాసురుడు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. అమ్మతో యుద్ధం చేయడానికి భారీ సైన్యంతో రణరంగంలోకి దూకాడు.

దుర్గమాసురుడు వేయి అక్షౌహిణుల సైన్యంతో (ఒక అక్షౌహిణిలో 21,780 ఏనుగులు, 21,780 రధాలు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది సైనికులు ఉంటారు), అత్యంత వేగంగా బాణాల సంధిస్తూ, దేవతల సైన్యాన్ని చేధించుకుంటూ ముందుకు కదిలి అమ్మవారి ముందు నిలబడ్డాడు. విప్రులను చుట్టుముట్టేశారు రాక్షసులు. ఈ సంఘటనను చూసిన దేవతలు, విప్రులు భయంతో 'మమ్మల్ని రక్షించమ్మా! మమ్మల్ని కాపాడు' అంటూ రోదించారు. వెంటనే అమ్మవారు దేవతలు, ద్విజుల రక్షణార్ధం, వారి చుట్టు ఒక తేజోమయమైన, చక్రం వంటి వలయాన్ని సృష్టించింది. రాక్షసులతో పోరడడానికి తాను ఆ తేజోవలయం బయట నిల్చుంది.


అప్పుడు దేవికి, దైత్యులకు (రాక్షసులకు) మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. యుద్ధరంగంలో విడువబడుతున్న బాణాలు వర్షంలా కురుస్తున్నాయి. సూర్యమండలాన్ని కూడా ఈ బాణాలు కప్పివేశాయా అన్నట్టుగా జరుగుతోంది యుద్ధం. బాణాలు పరస్పరం ఢీకొనడం వలన వాటి మధ్య అగ్నిజ్వాలలు ఎగిసి పడుతున్నాయి. భీకరమైన శబ్దాలు, కళ్ళతో చుడలేనంత కాంతి వెలువడుతోంది. ఆ యుద్ధ భూమిలో ధనుస్సును లాగి వదలడం వలన ఏర్పడిన శబ్దాలు దిక్కులన్నిటికి వ్యాపిస్తున్నాయి. దిక్కులను సైతం చెవిటివాటిగా మారుస్తున్నాయి. ఈ సమయంలోనే అమ్మవారి శరీరం నుంచి తీవ్రశక్తులు ఉద్భవించాయి.

కాళి, తారా, బాలా త్రిపుర సుందరి/ త్రిపుర బాలా, త్రిపుర భైరవి, రమా, బగళా, మాతంగి, త్రిపుర సుందరి, కామాక్షి, తులజా, జంభిని, మోహిని, చిన్నమస్త మొదలైన విద్యలు/శక్తులు, పదివేల చేతులు కలిగిన అనేక మంది గుహ్యకాళీలు శాకంబరీ దేవి నుంచి ఉద్భవించారు.

పరాశక్తి శరీరం నుంచి 32 మహాశక్తులు, మరో 64 మహాశక్తులు ఉద్భవించారు. వీరితో పాటు అనేకమంది ఆయుధాలు ధరించిన దేవి స్వరూపాలు అమ్మవారి శరీరం నుంచి అవతరించారు. యుద్ధభూమి మొత్తం మృదంగం, శంఖం, వీణ, ఇతరాత్ర సంగీత వాయిద్యాల ఘోషతో మార్మోగుతోంది. అంతటా దేవి స్వరూపాలతో నిండిపోయింది. ఈ మహాశక్తులందరి చేత 100 అక్షౌహిణిల రాక్షస సైన్యం నశించింది. ఇదంతా చూస్తున్న రాక్షస అధిపతి, దేవతల శత్రువు అయిన దుర్గమాసురుడు ముందుకు వచ్చి మొదట మహశక్తులతో పోరాడాడు. యుద్ధం మరింత భీకరమైంది. అమ్మవారి దేహం నుంచి పుట్టిన శక్తులచేత 10 వ రోజు నాటికి అన్ని అక్షౌహిణిల సైన్యం సంపూర్తిగా నశించిపోయింది. (ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అమ్మవారు తల్చుకుంటేనే దుర్గమాసురుడు, వాడి సైన్యం మొత్తం నశించిపోతుంది. అమ్మ సర్వసమర్ధురాలు, సర్వశక్తులకు అధిదేవత. కానీ ఎంతైనా అమ్మ కదా. ఏ తల్లి తన బిడ్డలని తానే చంపుకోదు. వాడు ఎంత కౄరుడైన వాడు మారుతాడేమో అన్ని వేచి చూస్తుంది. అందుకే అమ్మవారైన, ఏ ఇతర దైవమైనా ఒక్కసారిగా రాక్షసులను అంతం చేయరు. వారిలోని రాక్షసత్వాన్ని మాత్రమే నాశనం చేయాలని భావిస్తారు. ఎంత ప్రయత్నించినా వాళ్ళు మారకపోతే, మొండిగా మారి లోకాలకు సంకటంగామారితే లోకకల్యాణం కోసం వారిని సంహరిస్తుంది. కానీ దయాసముద్రురాలు కనుక మళ్ళీ తనలోనే కలిపేసుకుంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే కర్మపండాలి. కర్మ తీరేవరకు మరణం సంభవించదు. అమ్మవారు ఎంత ఓర్పు వహించినా, ఇంకా రెచ్చిపోయి, అంత తపస్సు చేసినా, మూర్ఖత్వంతో అమ్మవారి మీద యుద్ధం చేసి, కర్మను ఇంకా పెంచుకోని, తనకు తానుగా భయంకరమైన చావు కొని తెచ్చుకుంటున్నాడు దుర్గముడు. జీవుడికి కర్మ చేయడంలో అధికారం ఉంది, కర్మఫలం ఈశ్వరుడిస్తాడని గీతలో భగవానుడు చెప్పిందే ఇక్కడ కనిపిస్తోంది. వాడికి మంచైనా, చెడైనా చేసే అధికారం ఉంది, ఆ తర్వాత జరగబోయే పరిణామాల్లో మాత్రం వాడికి అధికారంలేదు. అప్పుడు ఈశ్వరుడు చూసుకుంటాడు. ఇలా మనం ఏది చేయాలో, ఏదో చేయకూడదో తెలియదు కనుకే ధర్మం అనేది ఈశ్వరుడిచ్చాడు. దాన్ని తెలుసుకుని సన్మార్గంలో నడిస్తే, అప్పుడు సత్కర్మ చేసి, సత్ఫలితాలను పొందుతాము. లేదంటే పాపకర్మ చేసి, కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వాళ్ళమవుతాము.)

యుద్ధం 11 రోజు ఉధృతమైంది. దుర్గముడు ఎర్రని పూలహారం ధరించి, శరీరానికి ఎర్రచందనం పూసుకుని, విజయం తనేదననే ఉత్సాహంతో రధం ఎక్కాడు. గట్టిగా అరుచుకుంటూ, మహాశక్తులందరిని చేధించుకుంటూ వేగంగా వెళ్ళి రధాన్ని మహాదేవి ముందు నిలిపాడు. అమ్మవారికి, దుర్గమాసురుడికి మధ్య రెండు ప్రహరల పాటు (ఒక ప్రహర అంటే దరిదాపుగా 3 గంటల సమయం) మహాయుద్ధం జరిగింది. ఆ యుద్ధం అందరి గుండెల్లో భయాన్ని నింపింది. ఆ సమయంలో అమ్మవారు 15 అత్యంత శక్తివంతమైన బాణాలను విడిచిపెట్టింది.

అమ్మవారి విడిచిపెట్టిన 15 బాణాల్లో 4 బాణాలు రధాన్ని లాగుతున్న నాలుగు గుర్రాలను హతమార్చాయి. ఒక బాణం రథసారధిని నశింపజేసింది. రెండు బాణాలు దుర్గామాసురుడి రెండు కళ్ళను, మరో 2 బాణాలు వాడి రెండు భుజాలను, ఒక బాణం రధంపైనున్న ధ్వజాన్ని(జెండాని) నాశనం చేశాయి. జగదంబ చేత విడిచిపెట్టబడిన మిగిలిన 5 దుర్గమాసురుడి హృదయంలోనికి చొచ్చుకొనిపోయాయి. వెంటనే దుర్గముడు రక్తం కక్కుకుని చచ్చిపోయాడు. వాడి దేహం నుంచి జ్యోతిస్వరూపంలో ఆత్మ బయటకు వచ్చి అమ్మవారిలో కలిసిపోయింది. శక్తివంతమైన రాక్షసుడు మరణించడంతో మూడులోకాల్లోనూ శాంతి నెలకొంది. బ్రహ్మ, ఇతర దేవతలు సర్వలోకాలకు అధిష్టాత్రి అయిన అమ్మవారి ముందు నిలబడి భావావేశంతో, భక్తిపారవశ్యంతో గద్గద స్వరంతో అమ్మవారినిను స్థుతించారు.

దేవ ఉవాచ :
జగద్భ్రమ వివర్తైక కారణే పరమేశ్వరీ |
నమః శాకంభరీ శివే నమస్తే శతలోచనే ||
సర్వోపనిషదోద్ఘుష్టే దుర్గమాసురనాశిని |
నమో మహేశ్వరీ శివే పంచకోశాంతరస్థితే ||

దేవతలు అంటున్నారు :

ఓం పరమేశ్వరీ, ఈ జగత్తు యొక్క ఆది, అంతాలకు, కారణం నీవు. నీవే శాకంభరివి. అక్షయమైన (లెక్కలేనన్ని) కన్నులు కలదానివి. సకల ఉపనిషత్తుల చేత కీర్తించబడిన దివ్యత్వానివి. దుర్గమాసుర సంహారిణివి. సకల శుభాలకు ఈశ్వరివి, పంచకోశముల లోపల ఉండే తత్వాన్ని నీవు. అటువంటి నీకు మా నమస్కారములు.

చేతసాం నిర్వికల్పేన యా ధ్యాయంతి మునీశ్వరః |
ప్రణావార్తస్వరూపాం తాం భజామో భువనేశ్వరీం ||
అనంతకోటి బ్రహామండజననీం దివ్యవిగ్రహాం |
బ్రహ్మవిష్ణ్వాదిజననీం సర్వభావైర్నతా వయం ||


ఈ సృష్టిలో ప్రతీదీ నిత్యం మార్పునకు లోనవుతూనే ఉంటుంది. కానీ నీవు ఈ స్థితికి అతీతమైనదానివి, చైతన్య తత్వానివి. మునీశ్వరుల చేత ధ్యానింపబడే దానివి. ప్రణవ(ఓంకారం) స్వరూపానివి. సకల భువనాలకు ఈశ్వరివైన నిన్నే కీర్తిస్తున్నాము. ఎన్నో కోట్ల బ్రహ్మాండాలకు అమ్మవు. చిన్మయస్వరూపిణివి. బ్రహ్మ, విష్ణూ మొదలైన వారందరికి తల్లివి, వారందరు సర్వభావములతో నీకు పాదాభివందనం చేస్తారు.

కః కుర్యాత్ పరమాం దృష్ట్వా రోదనం సకలేశ్వరః |
సదాయం పరమేశానీం శతాక్షి మాతరం వినా ||

అత్యంత దీనులు, బలహీనులైన మా బాధలను చూసి అన్నిటికి అతీతమైన నీవు, శతాక్షిదేవిగా, దయాస్వరూపిణివై రోదించావు. మా కష్టాలను తీర్చావు. నీవు తప్ప అటువంటి పని ఇంకెవరు చేయగలరు?

వ్యాస ఉవాచ :
ఇతి స్థుతాసురైర్దేవి బ్రహ్మవిష్ణ్ణవాదిభిర్వరైః |
పూజితా వివిధైర్ ద్రవ్యైః సంతుష్టాభూచ్చ తత్క్షణే ||



ఈ విధంగా స్థితిస్తూ బ్రహ్మ, విష్ణు మొదలైన దేవతలు అమ్మను వివిధ ద్రవ్యాలతో పూజించి ఆరాధించారు. వెంటనే అమ్మ సంతుష్టురాలయ్యింది. వేదాలను తిరిగి తెచ్చి ఇచ్చింది. వెంటనే మధురమైన స్వరంతో అందరిని, ముఖ్యంగా బ్రాహ్మణులను ఉద్ద్యేశించి ఈ విధంగా పలికింది. " వేదాలు నా శరీరంలో ముఖ్యమైన భాగాలు. కాబట్టి వేదం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. వేదం లేకపోతే ఎటువంటి కష్టనష్టాలు, ఉపద్రవాలు వస్తాయో, మీరు చూశారు. నన్నే నిత్యం పూజించండి. నిత్యం నా సేవ చేయండి. మీకు శుభాలు కలగడానికి ఇంతకంటే వేరెమార్గం లేదు. అత్యుత్తమమైన నా ఈ మహత్యాన్ని నిత్యం చదవండి. నేను పరసన్నురాలనవుతాను. మీకు ఉన్న ఆపదలను, భవిష్యత్తులో రాబోయే ఉపద్రవాలను మొత్తం ఈ విధంగా తీసేస్తాను.

దుర్గమాసుర సంహారం చేత నేను పొందిన 'దుర్గా' నామాన్ని, అక్షమయమైన కన్నులతో సాక్షాత్కరించాను కనుక నేను పొందిన 'శతాక్షి' అనే నామాన్ని నిత్యం ఎవరు స్మరిస్తారో వారు నా మాయ నుంచి విముక్తులై, పరమపదానికి నడుస్తారు, నేనే నడిపిస్తాను. ఈ సమయంలో నేను నా అసలు తత్వం మీతో ఇంకేమి చెప్పగలను. అనేక తత్వాలసారం నేను. నేనే అన్నిటి వెనుక ఉన్న అసలు తత్వాన్ని, అందరిని అన్నిటిని నడిపించేదానిని నేనే, దేవతలు, రాక్షసులు కూడా నన్నే ఆరాధిస్తారని గ్రహించండి, గుర్తించండి.

వ్యాస ఉవాచ:

ఈ విధంగా పలికి, సచ్చిదానంద స్వరూపిణి అయిన అమ్మ, జనులకు ఆనందం కలిగించి దేవతల కన్నుల ముందు నుంచి అదృశ్యమైంది. ఓ రాజా! జనమేజయ! అత్యంత రహస్యమైన, మహాగోప్యమైన ఈ కధను నీకు వివరించాను. 'గోపనీయం ప్రయత్నేన సకలకల్యాణకారకం' సకల కల్యాణాలను/శుభాలను కలిగించే ఈ కధను ప్రయత్నపూర్వకంగా అత్యంత రహస్యంగా ఉంచు (అంటే ఎవరు అడగకుండా చెప్పకు. ఒకవేళ ఈ కధ చెప్పినా అత్యంత శ్రద్ధగా ఎవరు వింటారో, ఎవరు కధను పరిహాసం చేయరో, వారికే చెప్పాలి). అత్యంత భక్తి తత్పరతో ఈ కధను ఎవరు నిత్యం వింటారో, పఠిస్తారో, వారి సకల కోరికలు తీరి, అంతిమంగా దేవీలోకానికి చేరుతారు.

ఇతి శ్రీ వ్యాసప్రోక్త శ్రీ దేవిభాగవతే మహాపురాణే సప్తమస్కంద అష్టాదశోధ్యాయః |

శ్రీ శాకంబరీ దేవీ ప్రకృతి స్వరూపం. పాడిపంటలకు అధిదేవత. శాకంబరీ దేవిని ఎక్కడ ఆరాధిస్తారో అక్కడ వర్షాలు బాగా కురుస్తాయి. శాంతి వర్ధిల్లుతుంది. ఆకలి బాధలు తీరిపోతాయి. అటువంటి శాకంబరీ దేవి ఆశీస్సులతో మన దేశం, ఈ సమస్త ప్రపంచం శాంతిసౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుందాం. పర్యావరణాన్ని రక్షిద్దాం.

ఓం శాంతిః శాంతిః శాంతిః 

Sunday 21 July 2013

Pantajali and the siddhis :

Pantajali and the siddhis :

Patanjali, a sage of ancient times wrote in his scriptures about the eight siddhis, what we call supernatural powers.

1. Anima- The siddhi by which a yogi reaches a minute state. As small as an ant or totally invisible.

2. Mahima- The siddhi by which a yogi is able to be so big that he may even tear apart the clouds and looks as if he has reached the sun.

3. Laghima- Making the body as light as a feather or cotton. The power to levitate; to make yourself light so that one could float in the air or walk on the water.

4. Garima- Heaviest body like a mountain by swallowing draughts of air.

5. Prapti- Yogi attains the power to change any object from one state to another, as he desires. Can predict future events, gains the power of clairvoyance, clairaudience, telepathy, thought-reading, etc. He can understand any unknown language, the language of any beast or bird. He can cure all diseases.

6. Prakamya- Entering the body of another (Parakaya Pravesh).

7. Vashitvam- Power of taming wild beasts and bringing them under control. It is the power of mesmerising people by the exercise of will and making them obedient to one’s own wishes and orders. It is the restraint of passions and emotions. It is the power to bring men, women and the elements under subjection.

8. Ishathvam- Attainment of divine power. The Yogi himself becomes the Lord of universe.The Yogi who has this power can restore life in dead bodies.

http://vivekananda.hubpages.com/hub/supernatural_powers_and_indian_yogis

గురుపూర్ణిమ

జూలై 22, సోమవారం ఆషాఢ పూర్ణిమ, గురు పూర్ణిమ. గురు పూర్ణిమ విశిష్టత గురించి ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, జగ్గి వాసుదేవ్ గారు ఒక కధ చెప్తారు.

పూర్వం హిమాలయాల్లో పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం కలిగిన ఒక యోగి కనిపించాడు. ఆత్మజ్ఞానం వలన కలిగిన ఆనందంతో ఆ యోగి అధ్భుతమైన తాండవం చేశాడు, కాసేపటికి అతని ఆనందం అవధులు దాటే సరికి మౌనంగా ధాన్యంలో కూర్చుని ఆత్మనందాన్ని పొందుతున్నాడు. అతన్ని గమనించిన జనానికి ఇతను మనకంటే గొప్పదైన దాన్ని ఎదో పొందాడు, అందువల్లే ఇతను ఇంత ఆనందంగా ఉన్నాడన్న భావన కలిగి ఆ రహస్యం తెలుసుకుందామని అతని వద్దకు చేరుకున్నారు. ఎంతమంది అతను చుట్టూ చేరినా, ఆ యోగి ఎవరిని పట్టించుకోకుండా తనలో తానూ ఆత్మనందాన్ని అనుభవిస్తున్నాడు. జనానికి విసుకువచ్చి వెళ్ళిపోయారు, ఒక్క ఏడుగురు తప్ప.

ఆ మహాపురుషుడి వద్ద నుంచి ఆ రహస్యం తెలుసుకోవాలన్న తపనతో అక్కడి నిలబడిపోయారు. కానీ ఆ యోగి వారిని పట్టికుంచుకోలేదు. కాసేపటికి వారు యోగి ఆనందానికి గల కారణం చెప్పమని ప్రాధేయపడ్డారు. "మీరు మూర్ఖులు, ఇప్పుడు మీరున్న స్థితి నుంచి మీకు ఈ అధ్బుత జ్ఞానం అందడానికి కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఈ జ్ఞానం పొందాలంటే చాలా సాధన కావాలి. కాలక్షేపం కాక చేసే సాధన కాదిది" అన్ని ఆ యోగి ఏదో చెప్పి, వాళ్ళని పట్టించుకోవడం మానేసి, ధాన్యంలో ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాడు.

రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఈ ఏడుగురు నిత్యం విడువకుండా సాధన చేస్తూనే ఉన్నారు. 84 ఏళ్ళ తర్వాత దక్షిణాయనంలో ఒకానొక పూర్ణిమ రోజున ఆ యోగి వీళ్ళపై తన దృష్టిని ప్రసరించాడు. ఆ మహాద్భుత జ్ఞానాన్ని పొందాలన్న తపనను వాళ్ళలో గుర్తించాడు. ఇక వాళ్ళకు ఆ మహాజ్ఞానం తప్పకుండా చెప్పాలన్న నిర్ణయానికి వచ్చి, వారిని మరింత దగ్గరగా గమనించడం మొదలుపెట్టాడు. మరొక పౌర్ణమి వచ్చేసింది. ఇప్పటికి వరకు ప్రపంచంలోనే ఆదియోగి అయిన ఇతను గురువు స్థానంలో కూర్చుని వారికి ఉపదేశం చేయాలని నిశ్చయించుకున్నాడు. ప్రపంచానికి 'ఆది గురువు' అయ్యాడు. దక్షిణ ముఖంగా కూర్చుని, కేధార్‌నాథ్‌కు దగ్గరలో ఉన్న కాంతి సరోవరం దగ్గర తన యోగవిద్యను ఉపదేశించాడు. మానవశరీరానికి సంబంధించిన సమస్తమైన రహస్యాలను, మనిషి యొక్క శరీరం, బుద్ధి, మనసు, ప్రాణశక్తులను ఏకీకృతం చేసి, సమస్త మానవజాతి శాశ్వతమైన ఎదుగుదలను, ఆనందాన్ని పొందే ఆ మహోన్నత విద్యను వాళ్ళకు కొన్ని సంవత్సరాల పాటు పంచాడు.

జ్ఞానభోధ పూర్తయ్యేసరికి ఈ ఏడుగురు మహావిజ్ఞానవంతులయ్యారు. ఈ ఏడుగురే సప్తఋషులు. భారతీయసంస్కృతికి మూలపురుషులు. వారు నేర్చుకున్న యోగ విద్యను ప్రచారం చేయమని ఈ 7మందిని ప్రపంచలో 7 దిక్కులకు పంపించాడు. మానవుడికి సాధ్యకానిది ఏది లేదని నిరూపించగల ఈ యోగవిద్యను సప్తఋషులు ప్రపంచమంతా ప్రచారం చేశారు. ఆ ఆదియోగి ఏవరో కాదు, సాక్షాత్తు పరమశివుడే. ఆయన బోధించినది మరేమిటో కాదు, ఈ రోజు మొత్తం ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తూ, అసాధ్యాలను కూడా సుసాధ్యం చేస్తూ, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ, భారతదేశ పూరాతన వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్న యోగా. యోగా/యోగ విద్యను మొదట బోధించినవాడు పరమశివుడే. ఆయన దక్షిణానికి తిరిగి బోధన ప్రారంభించిన పూర్ణిమతో కూడుకున్న దినమే గురుపూర్ణిమ. 

ఆషాఢ పూర్ణిమ గురుపూర్ణిమ

ఆషాఢ పూర్ణిమ, గురుపూర్ణిమ :

ఆషాఢ పూర్ణిమను గురుపూర్ణిమగా జరుపుకుంటాం. ఈ రోజున శ్రీ వేదవ్యాస మహర్షిని తప్పకుండా పూజించాలి.

భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేకస్థానం ఉంది. యోగ సంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి. గురుసంప్రదాయంలో శివుడే ఆదిగురువు. పరమశివుడి తాండవంలోఆయన చేతి ఢమరుకం నుంచి నాదం(శబ్దం) పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. ఈ వేదాన్ని శ్రీ మహా విష్ణువు బ్రహ్మదేవునకు ఉపాదేశించాడు(శివకేశవులకు బేధం లేదు, ఇద్దరూ ఒకే పరమాత్మ యొక్క భిన్న కోణాలు). బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మ దేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి, ఆయన తన కూమరుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు.

ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయింది, అనేక మంది ఈ మహాజ్ఞానం ఉపదేశించబడదింది. కానీ అప్పటివరకు వేదం ఎప్పుడు గ్రంధస్థం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు(అందుకే వేదానికి 'శ్రుతి' అని పేరు). మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది. కానీ కలియుగంలో మనుష్యుల యొక్క ఆయుషును(జీవిత కాలాన్ని), బుద్ధిని, జ్ఞాపకశక్తిని దృష్టిలో ఉంచుకుని, కలియుగ ప్రారంభానికి ముందు వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి వేదవ్యాసుడిగా పేరుగాంచారు. ఈయనే మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంధస్థం చేశారు. వాటిని తన నలుగురు శిష్యులకు ఉపదేశించి ప్రచారం చేయమని ఆదేశించారు. వేదాన్ని అర్ధం చేసుకోవడం కష్టమని, అందరికి అర్దమయ్యే విధంగా వేద సారం మొత్తాన్ని అష్టాదశ(18) పురాణాల్లోనూ, ఉపపురాణాల్లోనూ నిక్షిప్తం చేశారు. బ్రహ్మసూత్రాలను రచించారు. పంచమవేదంగా ప్రసిద్ధిచెందిన మహాభారతాన్ని వినాయకుడి సాయంతో గ్రంధస్థం చేశారు. ధర్మాచరణలో వేదమే ప్రామాణికం. మన సంస్కృతికి ఆది, పూనాది వేదమే. అటువంటి వేదాన్ని నాలుగుగా విభజించి, లోకానికి ఎంతో ఉపకారం చేసిన వేదవ్యాస మహర్షికి కృతజ్ఞతగా ఆషాఢ పూర్ణిమను గురుపూర్ణిమగా, వ్యాసపూర్ణిమగా జరుపుకుంటాం.

వ్యాసమహర్షి తనకు పరంపరాగతంగా వస్తున్న విద్యను తన పుత్రుడైన శుకమహర్షికి ఉపదేశించాడు. శుకమహర్షి గౌడపాదాచార్యులవారికి, ఆయన గోవిందపాదాచార్యులవారికి, గోవిందపాదులు శ్రి శంకరాచార్యులవారికి ఉపదేశించారు. వైదిక సంస్కృతిని బౌద్ధ, చార్వాక, జైన మతాలు అంతం చేసే పరిస్థితి ఏర్పడినప్పుడు కైలాస శంకరుడే ఆదిశంకరాచరుడిగా అవతరించాడు. శ్రీ శంకరాచార్యులవారు దైవ, ఋషి పరంపరగా వస్తున్న ఈ మహాద్భుత జ్ఞానాన్ని తన నలుగురు శిష్యులైన పద్మపాదాచార్యులు, హస్తమలకాచార్యులు, తోటకాచార్యులు, సురేశ్వరాచార్యులవారికి ఉపదేశించారు. వైదిక సంస్కృతిని పునరుద్దరించారు.

ఆత్మ జ్ఞానమైన, బ్రహ్మజ్ఞానమైన, వేదమైన, ఎటువంటి జ్ఞానమైన ఆధునిక కాలంలో కొత్తగా తెలుసుకుని/కనిపెట్టి చెప్పినవారు లేరు. నారాయణుడి దగ్గరినుండి పరంపరగా వస్తున్న జ్ఞానాన్ని, ఏదైతే వ్యాసుడి చేత చెప్పబడిందో, అది మాత్రమే చెప్తారు. వ్యాసుడి చెప్పినదానికి భిన్నంగా ఏది చెప్పలేరు. ఒకవేళ చెప్పినా అది ఆమోదయోగ్యం కాదు. ఎంతో పురాతనమైన, సనాతమైన ఈ సంపద మనకు అందడంలో ముఖ్యపాత్ర పోషించిన వ్యాసమహర్షిని మన గురువులలో చూసుకుని ఆరాధించడమే గురు పూర్ణిమ.                                           

Wednesday 17 July 2013

దక్షిణాయనం విశేషాలు

17 జూలై  నుంచి దక్షిణాయనం


ఖగోళ శాస్త్ర పరంగా చూస్తే సూర్యుడి గమనంలో కలిగిన మార్పులే ఉత్తరాయణ, దక్షిణాయనాలు. 'అయనం' అంటే ప్రయాణం అని అర్ధం. దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడమనే అర్ధం వస్తుంది. సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని మనకు తెలుసు. కానీ మనం సూర్యోదయాన్ని గమనిస్తే, అది సరిగ్గా తూర్పు దిశలో జరగదు. సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది సంవత్సరంలో 2 రోజులు మాత్రమే. మొదటిది సెప్టెంబరు 23, రెండవది మార్చి 21. మిగితా రోజులలో 6 నెలల కాలం కాస్త ఈశాన్యానికి దగ్గరగానూ, మరో 6 నెలల కాలం ఆగ్నేయానికి దగ్గరగానూ సూర్యోదయం జరుగుతుంది. సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'ఉత్తరాయాణం' అని, ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'దక్షిణాయనం' అని అంటారు. ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు.


ఆధ్యాత్మికంగా చెప్పుకోలవలసి వస్తే ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే, దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం. ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. ఇటువంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సహాయం బాగా అవసరం. అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడనికి ఈ కాలంలో అనేక ఉపాసనలు చేస్తారు. అందువల్ల ఇది ఉపాసన కాలం కూడా అయ్యింది. సంవత్సరంలో ఉత్తారాయనానికి ఎంత విశిష్టత ఉందో, దక్షిణాయనానికి కూడా అంతే ఉంది. రెండు కాలపురుషుని అంతర్భాగాలే.

శాస్త్రీయంగా చూసినప్పుడు దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీదకు తక్కువగా ప్రసరిస్తుంది. ఫలితంగా ప్రజలలో రోగనిరోధకశక్తి క్షీణించి రోగాల బారిన పడతారు. వీటిని నిరోధించడం కోసం ఈ కాలంలో బ్రహ్మచర్యం, ఉపసాన, తరుచుగా ఉపవాసాలు, పూజలు, వ్రతాల పేరున మన పాటించే నియమాలు రోగనిరోదక శక్తిని పెంచి, ఆయుషును వృద్ది చేస్తాయి.

దక్షిణాయనంలో బ్రహ్మచర్యానికి ఆయుర్వేదం అత్యంత ప్రాముఖ్యతనిచ్చింది. ఆయుర్వేదం వేరు, ధర్మశాస్త్రం వేరు కాదు. ఆయుర్వేదం కూడా ధర్మశాస్త్రంలో ఒక భాగమే. దక్షిణాయనంలో ధాతువులను రక్షించుకోవాలి, వృధా చేసుకోకూడదు. ఈ సమయంలో ధాతువులను వృధా చేసుకోవడం వలన రోగాల బారిన పడతారని, దక్షిణాయనం ఆయుర్వేదం చెప్తోంది.

ఎలా చూసిన దక్షిణాయనంలో మనం చేసే జప, దాన, పూజలు ఆరోగ్యాన్ని, అధ్యాత్మిక అనుభూతుని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి.

Tuesday 16 July 2013

బోనం సమర్పించి అమ్మకు కృతజ్ఞతలు చెప్తున్నాం.

మన కోసం ఆ జగన్మాత ఊరి పొలిమేరలో గ్రామదేవతగా కూర్చుంది. సంవత్సరమంతా ఎండకు ఎండి, వానకు తడిసి, ఎముకలు కొరికే చలిలో కూడా ఆ శక్తి మనలని, మన గ్రామాల్ని రక్షిస్తూనే ఉంది. ఆమెకు ఏ విధంగానైన సాయం చేయగలమా? అంటే అది అసాధ్యం. ఆమెకు ధనం ఇద్దామనుకుంటే ఆవిడకు డబ్బు అవసరమే లేదు. అందరికి లక్ష్మీదేవి రూపంలో ధనం  ఇస్తుంది. మరి గ్రామదేవతకు కృతజ్ఞతలు చెప్పడం ఏలా?  అన్నిటిని మనకు ప్రసాదించగల ఆ దివ్యశక్తికి మనం ఇచ్చే కృతజ్ఞతలు చెప్పుకోవడంలో భాగమే ప్రతి ఏటా నిర్వహించే జాతరలు, బోనాలు, ఉత్సవాలు మొదలైనవి. ఆ సమయాల్లో మొత్తం ఊరంతా ఏకమై తరిలివెళతారు.

ఆషాఢం అనగానే గుర్తుకువచ్చేచు బోనాలు. భాగ్యనగరం(హైద్రాబాదు)లో ఎంతో వైభవంగా జరుగుతాయి.బోనం భోజనం అనే పదానికి వికృతి. మా పిల్లల్ని, కుటుంబసభ్యులను, మొత్తం గ్రామాన్ని చల్లగా చూస్తున్న ఓ జగన్మాత! అందరికి అన్ని ఇవ్వగల నీకు భక్తితో ఈ బోనం సమర్పిస్తున్నానమ్మా! మా అందరి కోసం ఊరి పొలిమేరలో కూర్చున్నావు, నీకు ఏదైనా ఇద్దామంటే నీ దగ్గర లేనిదేది లేదు. కానీ అమ్మ భక్తితో నీకు బోనం(భోజనం) తెచ్చాను. స్వీకరించి మమ్మల్ని సదా అనుగ్రహించు తల్లీ! అంటూ
బోనం సమర్పించి అమ్మకు కృతజ్ఞతలు చెప్తున్నాం.       

Monday 15 July 2013

గ్రామదేవతను ప్రాధాన్యం ఏమిటి?

గ్రామదేవతయే గ్రామానికి అధిష్టాన దేవత. గ్రామదేవతలను ఈరోజున మనం మర్చిపోతున్నాం కాని మన సంస్కృతిలో గ్రామదేవతలకు పెద్దపీట వేశారు. గ్రామదేవతలు ఆదిశక్తి అంశలు, ప్రకృతి శక్తులు అంటుంది దేవీ భాగవతం. పేర్లు ఏవైనా కావచ్చు, ఆరాధానపద్ధతి మారవచ్చు కానీ శక్తి ఒక్కటే. దేశమంతా ప్రతి ఊళ్ళో ఒకటే శక్తిని కొలుస్తోంది.


మనం ఉండే ఊరి నుంచి ఇతర ప్రదేశానికో, లేక తీర్ధయాత్రకో తరలిపోయే ముందు, మనం నివసిస్తున్న ఊరి గ్రామదేవతను దర్శించాలి.

సర్వదా సర్వదేశేషు పాపుత్వాం భువనేశ్వరీ
మహామాయా జగద్ధాత్రీ సచ్చిదానంద రూపిణీ

అని శ్లోకం చెప్పాలి.

సకల భువనాలకు ఈశ్వరి, మహామాయ, జగత్తును భరించే దానివి, సచ్చిదానందస్వరూపిణి, ఓ అమ్మా! ఎల్లప్పుడూ, అన్ని ప్రదేశాల్లో నన్ను రక్షించు అని శ్లోకార్ధం.

 ఊరి నుంచి ఏ కారణం చేత బయటకు వెళ్తున్నామో ఆమెకు చెప్పాలి. ఆమెకు మనం ఏ కారణం చేత వెళుతున్నామో  తెలియక కాదు, ఇన్నాళ్ళు మనందరిని రక్షిస్తూ ఉన్నది ఆవిడే కదా. మనమంతా రాత్రి హాయిగా పడుకున్న సమయంలో ఊరిలోకి ఏ దుష్టశక్తులు రాకుండా ఉండేందుకుగానూ ప్రతి రోజు రాత్రి గ్రామసంచారం చేస్తుంది గ్రామదేవత. మనకోసం అమ్మ నిద్రపోకుండా తిరిగుతుంటే మరి ఆమెను విస్మరించడం తగదు కదా. అందుకుగానూ ఆ చల్లనితల్లికి కృతజ్ఞలు చెప్పాలి. ఉదాహరణకు ఎవరైనా చదువు కోసం ఏ విదేశానికో వెళ్తున్నారనుకోండి. అప్పుడు అమ్మవారి దగ్గరకు వెళ్ళి అమ్మా! నేను నా ఉన్నత విద్య కోసం ఫలాన చోటుకు వెళ్తున్నాను తల్లీ. నీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండేలా అనుగ్రహించు అని ఆవిడను కోరాలి. మన వెళ్ళిన పని పూర్తియై తిరిగి మన ఉంటున్న గ్రామం/పట్టణం లోకి రాగానే మళ్ళీ గ్రామదేవత దర్శనం చేసుకోవాలని పెద్దల మాట. మన ఇంటిలో ఏ శుభకార్యం జరిగిన ముందుగా గ్రామదేవతకు ఆహ్వానం పంపాలి. సారె ఇవ్వాలి. అయితే ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదు. దేశాధినేతలు మొదలైనవారికి Protocol ఉన్నట్లే, దీనికి కూడా ఉంది. ముందు కులదేవతను స్మరించాలి. గణపతి, కులదేవత, ఇష్టదేవత, గ్రామదేవత,.... అలా ఉంటుంది.

మనం సొంతఊరు వదిలి వేరే ఊరికి జీవనం కోసం వెళ్ళినా, ముందు గ్రామదేవతను ప్రార్థించి కదలాలి. కొత్తగా స్థిరపడే ఊళ్ళో, లేదా పట్టణంలో అక్కడి గ్రామదేవతను అనుమతి అడిగి, ఆవిడను దర్శించి ప్రవేశించాలి. గ్రామదేవత అనుమతి లేకుండా ఎవరూ కొత్త ఊర్లలోకి వెళ్ళలేరు. అందుకే ఆవిడకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అక్కడి సంప్రదాయ పద్ధతిలో పూజించాలి.

గ్రామదేవత అంటే ఆ గ్రామంలో ఉండే అందరి ఇంటి ఆడపడుచు. ఆమెయే రాత్రి గ్రామసంచారం చేస్తూ గ్రామంలోకి అంటువ్యాధులు రాకుండా కాపాడుతుంది. గ్రామదేవతను ఎప్పుడూ విస్మరించకూడదు. తరుచుగా గ్రామదేవతను దర్శించుకోవాలి.

పిల్లలకు వచ్చే జ్వరాలు, వారికి ఉన్న బాలారిష్ట దోషాలను శమింపజేసే శక్తి గ్రామదేవతలకు ఉంది.

గ్రామదేవతల ఆలయాలకు ప్రత్యేకించి ఆగమాలు ఉండవు. అక్కడి అమ్మవారిని అందరూ దగ్గరకు వెళ్ళి పూజించవచ్చు. ఆ సదుపాయాన్ని శాస్త్రమే కల్పించింది. ఆ అమ్మవారికి ఎవరి పూజ వారు చేసుకోవచ్చు. గ్రామదేవతలకు నివేదనగా చద్ది పెడతారు, చద్ది అంటే పెరుగన్నం. చద్ది పెట్టడం వలన అమ్మవారు చల్లగా చూస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఉల్లిపాయలు కూడా నివేదిస్తారు. అమ్మవారికి ఇచ్చే నైవేధ్యంలో ప్రధానంగా చద్ది, పుట్నాలపప్పు, బెల్లం, ఉల్లిపాయలు ఉంటాయి.

కొన్ని గ్రామాలకు ఆ గ్రామదేవత పేరు ఆధారంగానే పేరులు వచ్చాయి. అందుకు ఉదాహరణ ముంబాయి నగరం. ముంబాయి గ్రామదేవత ముంబాదేవి. ఆవిడకు ప్రత్యేక ఆలయం కూడా ఉంది.

ఈ రోజుకి కొన్ని గ్రామాల్లో ప్రజలు రాత్రి ఒకానొక సమయం దాటాక బయట తిరగరు. ఆ సమయంలో గ్రామదేవత సంచారానికి వస్తుందని చెప్తారు. తూర్పుగోదావరి జిల్లా 'లోవ' (విశాఖపట్టణానికి దగ్గరలో ఉన్నది) అనే గ్రామానికి అధిదేవత తలుపులమ్మ తల్లి. అక్కడ సాయంత్రం ఒక నిర్ణీత సమయం దాటక మొత్తం అంతా ఖాళీ అయిపోతుంది. అప్పుడు తలుపులమ్మతల్లి అక్కడ సంచరిస్తుందని, ఆ సమయంలో అక్కడ ఉంటే మరణం తప్పదని అక్కడి ప్రజలు చెప్తారు.      

Originally Published: 15-July-2013
1st Edit: 1-August-2015 

Saturday 13 July 2013

రమణ మహర్షి ఆధ్యాత్మిక కధలు

భగవాన్ రమణ మహర్షి భక్తులలో ఒక భక్తుడి కొడుకు అకస్మాత్తుగా మాత్తుగా మరణించడంతో ఆ బాధను తీర్చగల సమర్ధుడు రమణులే అని భావించి ఆయన వద్దకు వచ్చారు. రమణ మహర్షిని కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలలో అతని బాధ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రమణులు ఎప్పటిలాగా ఆత్మ గురించి విచారణ చేయమని, అసలు బాధపడుతున్నది ఎవరో తెలుసుకోమని సమాధానం చెప్పగా, ఆ సమాధానంతో ఆ భక్తుడు తృప్తి చెందలేదు.

అప్పుడు రమణ మహర్షి నేను ఇప్పుడు విచారసాగరం అనే కధ చెప్తా విను అంటూ చెప్పసాగారు.

రామ, కృష్ణ అనే ఇద్దరు యువకులు వారు విదేశాలకు వెళ్ళి అక్కడ బాగా చదువుకుని డబ్బులు సంపాదిస్త్నాని వారివారి తల్లిదండ్రులకు నచ్చజెప్పి విదేశానికి వెళ్ళారు. కొంతకాలానికి వరిద్దరిలో ఒకడు మరణించగా, మరొకడు బాగా చదువుకుని, మంచి జీవనం గడుపుతున్నాడు. కొంతకాలం గడించింది. తన స్వదేశానికి అక్కద ఉండే వ్యాపారి వెళ్తున్నాడని తెలుసుకుని, తాను ఇక్కడ మచి జీవనం గడుపుతున్నాని తన తల్లిదండ్రులకు చెప్పమని, వచ్చిన మిత్రుడు మరణించాడని అతని తల్లిదండ్రులకు చెప్పమని ప్రార్ధిస్తాడు. బ్రతికున్న వాడి తల్లిదండ్రులకు తమ బిడ్డ మరణించాడని, చచ్చిపోయిన వ్యక్తి తల్లిదండ్రులకు తమ పిల్లాడు ఉన్నతమైన జీవనం గడుపుతున్నాడని పొరపాటుగా తప్పుడు సమాచారం చేరవేస్తాడు. దాంతో జీవించిఉన్నవాడి అమ్మనాన్నాలు తీవ్రంగా బాధ పడుతుంటారు. మరణించినవాడి తల్లిదండ్రులు తమ పిల్లాడు ఎప్పటికైనా తిరిగివాస్తాడని సంతోషంగా కాలం గడుపుతుంటారు. నిజానికి ఈ తల్లిదండ్రులు ఇద్దరూ తమ పిల్లలను చూడనే లేదు. కాని ఒకరు సంతోష పడుతున్నారు, ఒకరు అవేదన చెందుతున్నారు. మనం కూడా అంతే. మనం మన మనసు చెప్పినవన్నీ నమ్మేస్తాం. అందుకే ఏదీ లేదో అదే ఉన్నదని, యదార్ధానికి ఏది ఉన్నదో అదే లేదని భావిస్తాం. మనం మనసుమాట వినకుండా, హృదయంలోనికి ప్రవేశించి అక్కడున్న కొడుకును చూసుకుంటే, ఇక బయట ప్రత్యేకంగా పిల్లలను చూసుకుని ఆనందించవలసిన అవసరం లేదు అన్నారు రమణ మహర్షి.(ఈ కష్టాలు, బాధలు, సంతోషాలు, బంధాలు, బంధుత్వాలు మొదలైనవన్నీ మనసుకే కానీ, ఆత్మకు కావు, ఆత్మయే చిదానంద స్వరూపం. ఆత్మ గురించి తెలుసుకుని, ఆత్మ స్థితిలో ఉండగలిగితే మనల్ని ఏవి బాధించలేవు).      

Friday 12 July 2013

సర్వం జగన్నాథమయం

సర్వం జగన్నాథమయం

పూరీలో జరిగే జగన్నాథ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధం. మీకు తెలుసా..............పూరీలో స్వామి రధయాత్రలో ఆయనకు చాలా రకాల నైవేధ్యాలు సమర్పిస్తారు. అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వారు, ధనిక పేద అనే తేడా లేకుండా తమకు ఉన్న దాంట్లో నైవేధ్యం తయారుచేసి అర్పించి, రధయాత్రలో భక్తులకు అది పంచిపెడతారు. కటిక పేదలు కూడా కుండల్లో నైవేద్యం వండి పంచిపెడతారట(ఇప్పుడు ఈ పద్ధతి ఉందో లేదో తెలియదు కాని, కొన్నేళ్ళ ముందు మాత్రం ఉండేది). ఇలా పేదలు, అట్టడుగు వర్గాలవారు పంచిన నేవదన కొందరికి స్వీకరించడం నామోషిగా అనిపించవచ్చు. అలా భావించి నైవేధ్యం తీసుకోని వారు పూరీలో సముద్రంలో స్నానం చేయడానికి వెళ్ళి అందులో కొట్టుకుపోయేవారట. ఇలా అక్కడ ప్రసాదం స్వీకరించడంలో తారతమ్యం చూపినవారందరికి ఇదే గతి పట్టిందని చెప్తారు. కనీసం జాడ కూడా దొరికేది కాదట. ఈ సమస్త జగత్తంతా జగన్నాథుడే. అందరిలోనూ ఆ జగన్నాథుడు దర్శించాలని, అందరిని సమభావంతో చూడాలని, అందరిలో ఉన్న అ పరమేశ్వరుడిని దర్శించాలని, ఈ జగత్తంతా జగన్నాథమయమేనని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

జై జగన్నాథ            



Thursday 11 July 2013

ఔషధమూలిక గోరింటాకు

 ఔషధమూలిక గోరింటాకు .......................



గోరింటాకు అంటే అదేదో ఆడవాళ్ళకు సంబంధించిన విషయం అనుకోకండి. ఆయుర్వేదం పరంగా గోరింటాకు ఒక ఔషధం. గోరింటాకును రుబ్బి గోర్లపై భాగంలో పెట్టుకోవడం వలన గోర్లు పుచ్చిపోకుండా ఉంటాయి. అరిచేతిలోనూ, అరికాళ్ళలోనూ పెట్టుకోవడం వలన శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ శరీరంలో ఇతర భాగాలకు సంబంధించిన నాడులు ఉంటాయి. ఆయుర్వేదంలో కొన్ని పద్ధతుల ద్వారా గోరింటాకును శరీరంలోకి ఔషధంగా తీసుకోవడం వలన అల్సర్ మొదలైన రోగాలను నయం చేయడమే కాకుండా, పేగులను శుభ్రపరుస్తుందని ఆయుర్వేద గ్రంధాల్లో కనిపిస్తుంది. శరీరంలో వేడి బాగా పెరిగినప్పుడు గోరింటాకును అరికాళ్ళ నిండ పట్టించుకుంటే వేడి తగ్గిపోతుంది. మార్కెట్‌లో గోరింటాకుతో చేసిన నూనె దొరుకుతుంది. శరీరానికి గాయమై రక్తం కారుతున్న సమయంలో, కాసింత గోరింటనూనెను గాయమైన భాగం మీద రాస్తే కాసేపట్లోనే విడిపోయిన చర్మం కలిసిపోయి, గాయం అతి త్వరగా మనిపోతుంది.

గోర్లు, శరీరంలో వేడి కేవలం ఆడవాళ్ళకే ఉండవు, మగవారికి కూడా ఉంటాయి. తగిన జాగ్రత్త తీసుకోకపోతే ఎవరి గోర్లైనా పుచ్చిపోతాయి. ఆరోగ్యం కోసం గోరింటాకు అందరూ పెట్టుకోవాలి. గోరింటాకు ఆడవాళ్ళకే అని ఎక్కడ చెప్పలేదు. వ్రతం, పూజలు, వివాహాల సమయంలో, పెద్ద పెద్ద క్రతువులు చేసే సమయంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు.

ఇక్కడ గోరింటాకు అంటే బయట దుకాణాల్లో మెహంది లేక గోరింటాకు పోడి కాదు. గోరింటకు చెట్టు నుంచి కోసి రుబ్బిన ఆకుకే ఔషధ గుణాలు ఉంటాయని మర్చిపోకండి. పెట్టుకొవలసిన చోట పెట్టుకోకుండా మోచేతులు, మోకాళ్ళ వరకు పెట్టుకున్నా ఉపయోగం లేదని గుర్తించండి. అందరి ఆరోగ్యమే దేశసౌభాగ్యం.    

Tuesday 9 July 2013

ఆషాఢమాసంలో అందరూ తప్పకుండా గోరింటాకు పెట్టుకునే ఆచారం ఉంది.

ఆషాఢమాసంలో అందరూ తప్పకుండా గోరింటాకు పెట్టుకునే ఆచారం మన సంస్కృతిలో ఉంది. అసలు దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి?

ఆషాఢమాసంతో గ్రీష్మ ఋతువు పూర్తిగా వెళ్ళిపోయి వర్ష ఋతువు ప్రారంభవుతుంది. వాతావరణంలో మార్పు వస్తుంది. శ్రావణం నుంచి వర్షాలు పూర్తిగా ప్రారంభవుతాయి.  ఇంతకముందున్న గ్రీష్మ ఋతువు కారణంగా మన శరీరంలో వేడి పెరుగుతుంది. బయటి వాతావరణం ఒక్కసారిగా చల్లబడడం, మన శరీరంలో ఉన్న వేడి, రెండూ పరస్పరం విరుద్ధం కనుక అనారోగ్యం ఏర్పడవచ్చు. గోరింటాకుకు శరీరంలో అధిక వేడిని తీసే శక్తి ఉంది.  గోరింటాకు ఆషాఢంలో పెట్టుకోవడం వలన శరీరంలో వేడి తగ్గి వర్ష ఋతువు అనుగుణంగా శరీరాన్ని తయారు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందువల్ల మన ప్రాచీనులు ఆషాఢమాసంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకునే సంప్రదాయాన్ని తీసుకువచ్చారు.


గోరింటాకు ఉపయోగాల కోసం ఈ లుంక్ చూడండి - ఔషధమూలిక గోరింటాకు 

Monday 8 July 2013

ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులను దూరంగా ఉంచుతారు. ఎందుకు?

మన సంప్రదాయం- శాస్త్రీయం

ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులను దూరంగా ఉంచుతారు. అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళతారు. ఎందుకు?

ఆషాఢమాసంలో స్త్రీ నెలతప్పితే, 9 నెలల తరువాత అంటే వేసవి కాలంలో(మార్చి నుంచి మే మధ్య కాలంలో) ప్రసవం జరుగుతుంది. సాధారణంగానే మన దేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వేసవిలో మరింత విజృంబిస్తాయి. అప్పుడే పుట్టిన శిశువుకు ఈ వేడివాతావరణం బాగా ఇబ్బంది కలిగిస్తుంది. శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. ఇది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే ఆషాఢమాసంలో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారు.

మాతశిశు సంక్షేమమే దేశ సంక్షేమానికి తొలి మెట్టు అన్నది మన పూర్వీకులు ఆలోచన. అందుకే ఈ సంప్రదాయం.

అదే కాకుండా ఆషాఢంలో ధాతుసంరక్షణ, బ్రహ్మచర్యం తప్పనిసరి అని ఆయుర్వేదశాస్త్రం చెప్తున్నది. కొత్తగా పెళ్ళైనా భార్యాభర్తలకు నిగ్రహం తక్కువగా ఉంటుంది, అందుకని వాళ్ళని దూరంగా ఉంచుతారు. మిగితావారు కూడా ఈ మాసంలో బ్రహ్మచర్యం పాటించాలి. దీనివల్ల ఆరోగ్యం రక్షించబడుతుంది.      

Friday 5 July 2013

బయటనుండి రాగానే ముందుగా కాళ్ళు కడుక్కున్న తరువాతే ఇంట్లోకి ప్రవేశించమని మన పెద్దలు చెప్తారు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటి?

మన సంప్రదాయం - శాస్త్రీయత

బయటనుండి రాగానే ముందుగా కాళ్ళు కడుక్కున్న తరువాతే ఇంట్లోకి ప్రవేశించమని మన పెద్దలు చెప్తారు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటి?

చెప్పులు వేసుకుని వెళ్ళినా, మన రకరకాల ప్రదేశాల్లో తిరుగుతాం. అవి పరిశుభ్రంగా ఉండచ్చు, ఉండకపోవచ్చు. ప్రతి చోటా అనేక రకాల క్రిములు ఉంటాయి. మనం బయట తిరిగినప్పుడు ఆ క్రిములు మన శరీరానికి, ముఖ్యంగా పాదాలకు అంటుకుంటాయి. మనం నేరుగా ఇంట్లోకి ప్రవేశిస్తే, ఆ రోగకారక క్రిములు ఇంట్లోకి చేరి ఆ ఇంట్లో నివసించేవారికి వ్యాధులు కలిగించవచ్చు. అదే పసిపిల్లలు ఉంటే వాళ్ళు ఇల్లంతా పాకుతారు కనుక ఇంకా త్వరగా అనారోగ్యం వచ్చేస్తుంది. అందుకే మన పెద్దలు బయటకు వెళ్ళిరాగానే ఇంట్లోకి ప్రవేశించే ముందు కాళ్ళు కడుక్కోమన్నారు.

మన నడిచే దారిలో మనకు హాని కలిగించేవి అనేకం ఉండచ్చు. కొందరు దిష్టి తీసిన నీళ్ళు, నిమ్మకాయలు వంటివి ఎక్కడపడితే అక్కడ పడేస్తారు. మనం వటిని దాటే అవకాశం ఉంది. ఒకవేళ మనం అలాంటి వాటిని దాటితే, ఆ దోషం తొలగిపోవడానికి, మనకు ఎటువంటి కీడు జరగకుండా ఉండడం కోసం బయటకు వెళ్ళి రాగానే కాళ్ళు కడుక్కుంటాం.

మరొక ఆరోగ్య రహస్యం కూడా ఉందండి. మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. మెదడు, కళ్ళకు సంబంధించిన నాడులు కొన్ని పాదాల్లోనూ, అరికాల్లోనూ ఉంటాయి. కాళ్ళు పరిశుభ్రంగా లేకపోతే కంటికి సంబంధించిన వ్యాధులు వస్తాయంటోంది ఆయుర్వేదం. వీటితో పాటు బయటకు వెళ్ళి రావడం వలన అలసట ఏర్పడుతుంది. వెళ్ళిరాగానే కాళ్ళ మీద చల్లటి నీరు పడడంతో ఆ చల్లదనం నాడులు ద్వారా మెదడకు చేరి మెదడు సేద తీరుతుంది. అలసట త్వరగా పోతుంది.

ఇన్ని శాస్త్రీయ విషయాలు, ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి కనుకే మనం బయటకు వెళ్ళిరాగానే కాళ్ళు కడుక్కుంటాం. కానీ ఇప్పుడు మనం మర్చిపోయాం. కనీసం ఇక నుంచి మీరు కూడా పాటిస్తారు కదూ.  

Thursday 4 July 2013

మనం చేసిన పాపం మనమే అనుభవించాలి, అందులోకి అమ్మను లాగడం అనవసరం అంటున్నారు ధారీ దేవి ఆలయ పూజారి.

కేధార్‌నాధ్‌లో వరదలకు ధారిదేవి ఆగ్రహమే కారణమన్న వాదనను ధారీదేవి ఆలయ పూజారి కొట్టిపారేస్తున్నారు. మనం ప్రకృతిని విధ్వంసం చేసిన ఫలితానికి ప్రకృతి వేసిన శిక్ష ఈ వరదలు, మనం చేసిన పాపం మనమే అనుభవించాలి, అందులోకి అమ్మను లాగడం అనవసరం అంటున్నారు ధారీ దేవి ఆలయ పూజారి.

అది 100 శాతం నిజం. అమ్మవారు సర్వాంతర్యామి, అంతటా ఉంది. అమ్మ లేని ప్రదేశమే లేదు. ఆది శక్తి ప్రకృతి రూపంలో చెట్లను, జంతువులను, పశువులను, పక్షులను, క్రిమికీటకాలను, మనుష్యులను నిత్యం రక్షిస్తూ, పోషిస్తూ ఉంది. ఆ ప్రకృతిలో భాగమే శిల(రాయి). అంతటా ఉన్న ఆ పరమేశ్వరిని ఆరాధించడం అందరికి సాధ్యమవ్వదు కనుక తనలోనే భాగమైన రాయిలో తననే(అమ్మవారినే) చూసి పూజించారు మన పూర్వీకులు. కానీ మనకు ఈ దృష్టి ఎప్పుడో పోయింది. ఈ రోజు మనకు తెలిసినంత వరకు అక్కడున్నది ఒక రాయి మాత్రమే. ఆ రాయి మన కోరికలు తీరుస్తుంది. అంతే! మనకు కష్టం వచ్చినప్పుడు, లేక మనకు ఏదైనా అవసరం కలిగినప్పుడు మాత్రమే మనకు అందులో శక్తి కనిపిస్తుంది.

భగవంతుడి మీద భక్తి ఉన్నది అనడానికి సంకేతం ఆయన యొక్క సృష్టిని గౌరవించడం. అంటే ప్రకృతిని రక్షించడం. కానీ ఈరోజు మన ఈ పని మాత్రం చస్తే చేయం. ఉత్తరాఖండ్‌లో కూడా అదే జరిగింది. ఉత్తారఖండ్ గ్రామదేవత ధారీ దేవి. ఉత్తరాఖండ్ మొత్తం ఆమె ఆధీనంలో ఉంటుంది. మరి అక్కడ జరిగిందేమిటి? అమ్మ 'ఇలాకాలో'అక్రమ నిర్మాణాలు చేశారు. తన బిడ్డలైన చెట్లను, అడవులను నరికేశారు. పక్షులు, జంతువుల ఆవాసాలను నాశనం చేశారు. అక్కడ యాత్రకు వెళ్ళిన భక్తులేమి తక్కువ కాదు. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం, ప్లాస్టిక్ కవర్లు పడేశారు. నదుల్లో మలమూత్ర విసర్జనలు చేసి, సబ్బులు వాడి, ఉమ్మి అపవిత్రం చేశారు. ఇదంతా ధారి దేవికి జరిగిన అవమానమే కదా. అప్పటివరకు అంతటా వ్యాపించి ఉన్న ఆ దివ్యశక్తికి అపచారం చేస్తూనే ఉన్నాం. అంతిమంగా అమ్మకు ప్రతిరూపమైన విగ్రహాన్ని ప్రక్కకు తొలగించాం. తొలగించామా లేక అమ్మే పక్కకు తప్పకుందా అనేది మనం ఆలోచించాలి.

ఒకవేళ ధారిదేవి విగ్రహాన్ని తొలగించడం వల్లనే వరదలు వచ్చాయనుకుంటే మరి దేవభూమి(ఉత్తరాఖండ్)ను మనం నాశనం చేసినప్పుడు ఇంకేంత కోపం వచ్చి ఉండాలి. అక్కడ పాపభారం పెరిగింది, పర్యావరణ విధ్వంసం తారాస్థాయికి చేరింది. అందుకే వరదలు వచ్చాయి. ఇదంతా మన స్వయంకృతమే.                   

Wednesday 3 July 2013

అంతా అమ్మ మహిమే అంటున్నారు స్థానికులు

~ ఉత్తరాఖండ్‌లో అలకానంద నదిపైపై హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. మన రాష్ట్రానికి చెందిన జీవీకే సంస్థ అనుబంధ కంపెనీ అలకానంద హైడ్రో పవర్ కంపెనీ, 330 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్ర నిర్మాణానికి సిద్ధమయ్యింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వలన ధారీదేవి ఆలయం నీట మునుగుతుందని అక్కడి స్థానికులు ఆందోళన చెందారు. బీజేపీ నేతలు, సాధువులు, స్థానికులతో పాటు ప్రాజెక్టు నిర్మాణంతో పర్యావరణానికి హాని జరుగుతుందన్న భయంతో పర్యావరణవేత్తలు కూడా ఈ భారీ జల విద్యుత్ ప్రాజెక్టును గట్టిగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇక్కడ జరిగే పర్యావరణ విధంవసం విషయమై పర్యావరణ శాఖ సుప్రీం కోర్టులో అపిడవిట్ దాఖలు చేసింది.  

ప్రాజెక్టు నిర్మాణానికి గట్టిగా పూనుకున్న కంపెనీ అమ్మవారి విగ్రహాన్ని ఎత్తైన ప్రదేశానికి తరలించాలని భావించింది. ప్రాజెక్టు నిర్మాణానికి అనుగుణంగా, నీటిలో మునగనంత ఎత్తున ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసి దానిపైకి ధారిదేవి విగ్రహాన్ని తరలించుకోవచ్చంటూ తాత్కాలికంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తూ తిది నిర్ణయాన్ని వాయిదా వేసింది.  

విగ్రహాన్ని తరలింపును స్థానికులు అడ్డుకుంటామని హెచ్చరించడంతో, ప్రాజెక్టు అధికారులు వ్యూహాత్మకంగా డ్యాంలో నీటిమట్టాన్ని పెంచుతూ వచ్చారు. దీంతో, అమ్మ ఆలయం మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. విగ్రహం మునిగిపోతుందంటూ హడావుడి చేసి, గత నెల(జూన్ 16), ఆదివారం రాత్రి 7.30కు ధారీదేవి పైభాగాన్ని పెకిలించి, ఎత్తున నిర్మించిన ప్లాట్ ఫామ్ పైకి మార్చారు. విగ్రాహాన్ని ప్రవైటు సిబ్బంది సాయంతో మార్చారు.

ధారి దేవి విగ్రహాన్ని మార్చుతున్న సమయంలోనే ఆకాశంలో ఉరుములు, మెరుపులు విపరీతంగా వచ్చాయని ధారీదేవిని పెకిలించిన సిబ్బందే చెప్తున్నారు. కొద్దిసేపటికే భారీ వర్షం మొదలయ్యింది. హిమాలయాల్లో క్లౌడ్ బ్రస్ట్ జరిగి, భారీగా వరద పోటెత్తడంతో పెద్ద నష్టం జరిగింది. ఇదంతా అమ్మ ప్రకోపించడం వల్లే సంభవించిందంటున్నారు స్థానికులు. వందలాది భవనాలు నామరూపాల్లేకుండా పోయినా, వేలాదిమంది కొట్టుకు పోయినా, అలకానంద నది మధ్యలో ఉన్న కేదర్్నాథ్ ఆలయం మాత్రం చెక్కుచెదరకుండా ఉండడం, ఆలయంలోని శివలింగం బురదలో కూరుకుపోకుండ ఉడడం (పూజకోసం తెచ్చిన బిల్వ పత్రాలు శివలింగాన్ని కప్పిఉంచడం),
అంతా అమ్మ మహిమే అంటున్నారు స్థానికులు.

1882లోనూ ఓ సారి ధారాదేవిని ఈ స్థానం నుంచి తరలించడానికి స్థానిక రాజు, సైన్యంతో కలిసి ప్రయత్నించారు. అప్పుడూ ఇదే తరహాలో భారీగా వరదలు వచ్చి ప్రాణ నష్టం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. ఇప్పటి వరదలు కూడా ధారీదేవి ఆగ్రహం వల్లే వచ్చాయని అంటున్నారు.           

Tuesday 2 July 2013

ఉత్తరాఖండ్ ఉపద్రవానికి కారణం ధారీదేవి ఆగ్రహం అంటున్నారు అక్కడి స్థానికులు. అసలు ఏవరీ ధారీ దేవి?

ఉత్తరాఖండ్ ఉపద్రవానికి కారణం ధారీదేవి ఆగ్రహం అంటున్నారు అక్కడి స్థానికులు. అసలు ఏవరీ ధారీ దేవి?

సూమారు 800 ఏళ్ళ క్రితం ఉత్తరాఖండ్‌లో గార్హ్వాల్ ఎగువ ప్రాంతంలో వచ్చిన వరదలకు ఒక అమ్మవారి విగ్రహం కొట్టుకువచ్చి ఇప్పుడు ధారీదేవిని ప్రతిష్టించిన ప్రదేశంలో ఉన్న ఒక శిలకు తగిలింది. దీంతో అక్కడున్న శిల(రాయి) విలపించిందట. అప్పటి నుంచి ఆ ప్రాంతంవారు ఆ శిలను పూజిస్తున్నట్టు అక్కడివారు చెప్తారు.  

అలకానంద నది మధ్యలో ఒక ఉంటూ, నది యొక్క ధారను(ప్రవాహాన్ని) నియంత్రిస్తుంది కనుక ఈ అమ్మవారికి ధారీ దేవి అని పేరు వచ్చిందని కొందరు చెప్తారు.

ధారీదేవి కాళీమాత ప్రతిరూపం, శక్తి స్వరూపిణి. చార్‌ధాం క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తులకు రక్షకురాలు, ఉత్తరాఖండ్ గ్రామ దేవత ఈ ధారీ దేవి.  

ధారీ దేవి కేధార్‌నాధ్‌లో నిత్యం సంచారం చేస్తూ, రక్షిస్తూ ఉంటుంది. ఉదయం బాలిక స్వరూపంలో, మధ్యాహ్నం యవ్వన స్త్రీ రూపంలో, రాతి వేళ ముసలి స్త్రీ రూపంలో దర్శనమిస్తూ, కేధార్‌నాధ్ క్షేత్రంలో  తిరుగుతూ ఉంటుంది.

బధ్రీనాధ్ నుంచి శ్రీనగర్ వెళ్ళే దారిలో, రుద్రప్రయాగకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో, శ్రీనగర్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది ధారిదేవి ఆలయం.

ఈ తల్లి యొక్క సగభాగం ఇక్కడ ధారిదేవి రూపంలో పూజింపబడుతుంటే, మిగితా సగభాగం కాళీమట్ ప్రాంతంలో కాళీ దేవి రూపంలో పూలందుకొంటున్నది.

శ్రీ దేవీ భాగవతంలో చెప్పబడిన శక్తి యొక్క 108 దివ్య క్షేత్రాల్లో ఈ ధారీ దేవి కూడా ఉండడం విశేషం.

Monday 1 July 2013

ఈ మొత్తం ప్రపంచంలో కేవలం 12 జ్యోతిర్లింగాలు మాత్రమే ఉన్నాయి.

ఈ మొత్తం ప్రపంచంలో కేవలం 12 జ్యోతిర్లింగాలు మాత్రమే ఉన్నాయి. ఆ 12 కూడా మన పవిత్ర భారతదేశంలో ఉండడం విశేషం. సౌరాష్ట్రలో సోమనాధుడు, శ్రీశైల మల్లిఖార్జునుడు, ఉజ్జైయిని మహాకాళేశ్వరుడు ......ఇలా మొత్తం 12 ప్రదేశాల్లో పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపంలో  దర్శనమిస్తున్నాడు.

ఖగోళ, అంతరిక్ష శాస్త్రాలను అనుసరించి ఎక్కడైతే పవిత్రమైన కాస్మిక్ శక్తి అత్యధికస్థాయిలో కేంద్రీకృతమవుతుందో, ఎక్కడైతే దైవ శక్తులు, దివ్య శక్తుల సంచారం అధికంగా ఉంటుందో, ఏ ప్రదేశానికి వెళ్ళడం చేత మానవుడు అతి త్వరగా పరమాత్మ జ్ఞానాన్ని పొందగలడో అటువంటి ప్రదేశాల్లో కొలువై ఉన్నాయి ఈ ద్వాదశ(12) జ్యోతిర్లింగ క్షేత్రాలు.

జ్యోతిర్లింగం అనే పేరే చెప్తోంది అవి జ్యోతి స్వరూపాలని. కొంత సాధన చేసి, వాటిని దర్శించవలసిన రీతిలో దర్శించడం చేత అవి మనలో కమ్ముకున్న దట్టమైన అజ్ఞాన పొరల్నీ కాల్చివేసి ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించగల దివ్య ఉపకరణాలు. వాటి దగ్గర ధ్యానంలో కూర్చోవడం చేతనే ఎన్నో వందల జన్మలుగా మనం కూడగట్టుకున్న పాపపు వాసనలను ఒక్క క్షణంలో తీసివేయగల దివ్య ధామాలు.

వాటిలో ఒక్కటే, హిమాలయ పర్వతాల్లో కొలువై ఉన్న కేధార్‌నాధ్ జ్యోతిర్లింగ క్షేత్రం.

ఓం నమః శివాయ