Sunday 30 June 2013

2011లో అమర్‌నాధ్‌లో మంచులింగం కరగడానికి కారణం మానవ చర్యలే.

2011లో అమర్‌నాధ్ హిమ లింగం 15 రోజులు ముందుగానే కరిగిపోయింది. దాని మీద రకరకాల వాదనలు వచ్చాయి. మనం కాస్త ఆలోచిస్తే, అమర్‌నాధ్‌లో మంచులింగం కరగడానికి కారణం మానవ చర్యలే.

తన వద్దకు వచ్చే భక్తులు కష్టమైన కాలి బాటలోనే రావాలని అమర్‌నాధుడు చెప్పాడట. అలా వచ్చే సమయంలో పడే శారీరిక కష్టం అమరత్వం పొందడంలో ఉపయోగపడుతుంది. కానీ ఈ రోజు ఆధునిక మానవుడికి శరీరం మీద మమకారమో, దైవం మాట వినేదేంటన్న అహంకారమో, తీర్ధయాత్రను విహారయాత్ర చేసుకున్నాడు ఆధునిక మానవుడు. అమర్‌నాధ్ యాత్రకు హెలికాఫ్టర్లలో వెళ్ళడం ప్రారంభించాడు. ఇది శివ ఆజ్ఞకు పూర్తి వ్యతిరేకం.  

హెలికాఫ్టర్లు వాడడం వలన అవి ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయి. శివలింగం కనిపించే ఒక నెల రోజుల్లో కొన్ని లక్షలమంది దర్శించుకుంటారు. రోజుకు కొన్ని వేలమంది ఆ గుహకు వెళ్తారు. ఇది ఆ గుహలో ఉన్న ఉష్ణోగ్రతలను పెంచేస్తున్నాయి. వీటితోపాటు ఆధునిక మానవుడు గత 200 సంవత్సరాల నుంచి చేస్తున్న విధ్వంసకర అభివృద్ధి భూతాపానికి(గ్లోబల్ వార్మింగ్)కు కారణమై, భూతాపాన్ని విపరీతంగా పెంచేసింది. ఇవన్నీ ఆ మంచులింగం త్వరగా అంతర్ధానమయ్యేందుకు కారణంవుతున్నాయి. వీటికి కారణం మనమే కదా.

అమర్‌నాధ్‌కు తీర్ధయాత్రకు వెళ్తున్నాం అనే భావనతోనే వెళ్ళండి. అమర్‌నాధ్‌ను విహారయాత్ర చేయకండి. సంప్రదాయపద్దతిలో కాలినడక ద్వారా పహల్‌గాం నుంచే యాత్రను ప్రారంభించండి. పర్యావరాణాన్ని రక్షించండి. శివానుగ్రహాన్ని పొందండి.

ఓం నమః శివాయ  

Saturday 29 June 2013

అప్పుడే మనం మేల్కొని ఉంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేదా?

ఉత్తరాఖండ్‌లో ప్రకృతి మీద మనిషి చేసిన దాడి చిన్నదేం కాదు. కొండల మీద హోటళ్ళు, రిసార్టులు నిర్మించారు. అత్యాశకు పోయి కొండల పైకి నిర్మాణాలను పెంచుకుంటూ పోయారు. ఈ క్రమంలో కొండరాళ్ళను బద్దలు చేశారు. ఫలితంగా కొండలు బీటలు బారాయి. కొండలను తొలగించగా మిగిలేది మట్టే. మట్టి కొట్టుకుపోకుండా చెట్లు ఆపుతాయి. వాటిని కూడా ఇష్టానుసారం నరికేశారు. ఫలితంగా అక్కడ కురిసిన భారీవర్షాలకు అటు కొండచరియలు విరిగిపడ్డాయి. మట్టి కొట్టుకుపోయి నది ప్రవాహంలో కలిసింది.

జలవిద్యుత్ ప్రాజెక్టులు కట్టే సమయంలోనూ, గనుల తవ్వకాల్లో సమయంలో వచ్చిన మట్టిని తరలించడం కష్టమని నదీ గర్భంలో పడేశారు. నదీగర్భంలో ఉన్న ఇసుకను ఇసుకను ఇసుక మాఫియా దోచుకుంది. పర్యావరణానికి ప్రమాదం అని తెలిసినా నదీగర్భంలో ఉన్న ఇసుకను మొత్తం అక్రమంగా తరలించారు. ఆఖరికి నదీగర్భంలో సహజంగా ఉండే రాళ్ళను కూడా స్టోన్ క్రషర్‌లతో విరగ్గొట్టి తరలిచారు. ఒక్క ఉత్తారఖండ్‌లోనే భగీరథి నది వెంట నదిగర్భంలో అక్రమంగా 141 స్టోన్ క్రషర్‌లు ఉన్నాయి.

ఇసుక పొరలన్నీ తీసివేయగ మిగిలేది మట్టే. ఇసుక నీటి ప్రవహాన్ని తట్టుకుని నిలబడుతుంది. కానీ మట్టికి ఆ బలం లేదు. బురదగా మారి నీటి ప్రవహాంలో కొట్టుకుపోతుంది. అక్కడ అదే జరిగింది. ప్రాజెక్టుల నిర్మాణంలో నదీగర్భంలో పడవేసిన రాళ్ళు, మట్టి, నదీగర్భంలో ఉన్న మట్టి ఇవన్నీ ఒక్కసారిగా వచ్చిన వరద ఉదృతికి కొట్టుకువచ్చాయి. భయంకరమైన ఉత్పాతాన్ని సృష్టించాయి. ఎన్నో ఇళ్ళు, గ్రామాలు, హోటళ్ళు బురదతో నిండిపోయాయి. వరదలో కొట్టుకువచ్చిన బండరాళ్ళు ఎన్నో ప్రాణాలను బలిగొన్నాయి.

ఇవన్నీ మానవుడు ఆ ప్రాంతంలో చేసిన చర్యలకు ప్రతిఫలాలు. ఉత్తారఖండ్‌లో నదుల మీద జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా స్వామి నిగమానంద 19 ఫిబ్రవరి 2011 నుంచి 14 జూన్ వరకు నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రాణాలు వదిలారు. అప్పుడే మనం మేల్కొని ఉంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేదా?
          

Friday 28 June 2013

ఉత్తరాఖండ్ వరదలు అనేక కొత్త విషయాలను బట్టబయలు చేస్తున్నాయి, ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి.

ఉత్తరాఖండ్ వరదలు అనేక కొత్త విషయాలను బట్టబయలు చేస్తున్నాయి. ఇప్పటికైనా మనం మేల్కోకపొతే మరో మహా విపత్తు సంభవించి తీరుతుందంటూ ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి.

కేధార్‌నాధ్, భధ్రీనాధ్, గంగోత్రి, యమునోత్రి హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్నాయి.  సుమారు 250 మిల్లియన్ సంవత్సరాల క్రితం,  భూపొరల్లో కలిగిన మార్పుల కారణంగా  Indo-Australian Plate,  Eurasian Plateను బలంగా ఢీకోట్టింది. అప్పుడు హిమాలయాల ప్రాంతంలో ఒక సముద్రం ఉండేది. కాలక్రమంలో ఇక్కడి  Tectonic Platesలో మార్పులు సంభవించి, భూభాగం పైకి జరగడం మొదలై హిమాలయాలు ఏర్పడ్డాయి. ప్రపంచంలో అతి చిన్న వయసున్న పర్వతాలు హిమాలయలే. ఇప్పటికి హిమాలయపర్వతాల కింద నిత్యం  మధ్య పెద్దసంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. రెండు పెద్ద మదమెక్కిన పొట్టేల్ల మధ్య జరిగే సంఘర్షణను పోలిన సంఘర్షణ వాటి కింది నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఈ కారణంగానే ప్రపంచంలో ఎత్తైన హిమాలయ పర్వతాలు ప్రతి ఏటా 2 సెంటిమీటర్లు పైకి జరిగి మరింత ఎత్తు ఎదుగుతున్నాయి.

ఈ హిమాలయ పర్వత ప్రాంతం భౌగోళికంగా అత్యంత సున్నితమైన ప్రాంతం. భూకంపాలు అధికంగా సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఇవి మొదటి స్థానంలో ఉన్నాయని నివేదికలు చెప్తున్నాయి.

ఇక్కడ భూగర్భంలో ఉన్న పరిస్థితి దృష్ట్యా అక్కడ ఎటువంటి భారీ నిర్మాణాలు చేపట్టరాదు. అక్కడ భూమి మీద అధిక భారం వేయకూడదు అంటున్నారు Geologists. కానీ ఈరోజు అక్కడ జరుగుతున్నదేంటి?...................... కేధార్‌నధ్‌లో ఎటువంటు అనుమతులు లేకుండా 4-7 అంతస్థుల భవనాలు నిర్మిస్తున్నారు. అతి సున్నితమైన ప్రాంతంలో జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణం, గనుల తవ్వకాలు చేస్తున్నారు. కొండలు తొలిచేస్తున్నారు. బాంబులు పెట్టి పేల్చివేస్తున్నారు. ఏవైతే అక్కడ జరగకూడదో అవన్నీ అక్కడ విపరితంగా చేస్తున్నారు. ఇవన్నీ ఆ ప్రాంతపు భూపొరల మీద అత్యధిక ఒత్తిడి సృష్టిస్తున్నాయి.

ఈరోజు వరదల వల్లనే కొన్ని వేలమంది మరణించారు. ఒకవేళ ఇప్పటికి ఆ ప్రాంతంలో నిర్మాణాలను నిషేదించకపోతే భవష్యత్తులో సంభవించే భూకంపం ఎంత మందిని పొట్టనబెట్టుకుంటుంది? ఎంత మంది సజీవసమాధి అయిపోతారు. పవిత్రమైన చార్‌ధాం కూడా భూగర్భంలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు? అప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. ఇప్పుడే మనలో మార్పు రావాలి. మనమే ఒకసారి ఆలోచించాలి.                

Thursday 27 June 2013

భారీ వర్షాలకు అలకానంద, భగీరథీ, మందాకిని నదులకు వరదలు వచ్చాయి. కానీ అక్కడ అంత నష్టం ఎందుకు జరిగింది?

బాగా వర్షాలు పడినప్పుడు, వానాకాలంలో ప్రతి నదికి సహజంగానే వరదలు వస్తాయి. ఈ ఏడాది కూడా ఉత్తరాఖండ్‌లో కురిసిన భారీ వర్షాలకు అలకానంద, భగీరథీ, మందాకిని నదులకు వరదలు వచ్చాయి. కానీ అక్కడ అంత నష్టం ఎందుకు జరిగింది?

భగీరథీ జన్మస్థానమైన గోముఖ్ నుంచి ఉత్తరకాశి వరకు గల 135 కిలోమీటర్ల ప్రాంతాన్ని పర్యావరణ పరంగా అతి సున్నితమైన ప్రాంతం(eco-sensitive zone)
గా గుర్తిస్తూ గత ఏడాది 18 డిసెంబరు 2012 న కేంద్ర అటవి, పర్యావరణ మంత్రిత్వ శాఖ పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986 కింద ఉత్తర్వులు జారి చేసింది. దీని ప్రకారం ఆ ప్రాంతంలో నిర్మాణాలను నిషేధించింది.  

ఈ ఉత్తర్వులను అమలు చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న 1,734 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టులు, గనుల ప్రాజెక్టులు, హోటళ్ళు, రిసార్టులు మొదలైన నిర్మాణాలను, మూసివేయాల్సి ఉంటుంది(నిజానికి ఇవన్నీ పర్యావరణానికి వ్యతిరేకంగా నిర్మించినవే). ఇది ఆ ప్రాంతంలో అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం వాదించింది. ఆ రాష్ట్రంలో ఉన్న అధికార, ప్రతిపక్షాలు కలిసి ఈ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించారు. ఉత్తర్వులను రద్దు చేయాలంటూ గత నెలలో ఈ తీర్మానం తీసుకుని ఉత్తారఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగణ ప్రధానిని కలవడం జరిగింది.

ఇది ఒక్కటే కాదు, అక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నదీ గర్భంలో కూడా నిర్మాణాలు చేపట్టారు. ఓట్ల కోసం తాపత్రయపడే ప్రభుత్వాలు, పార్టీలు ఆ అక్రమ నిర్మాణాలను సక్రమం చేశారు. విచ్చిలవిడిగా నదిలో నిర్మాణాలను చేశారు. ఇప్పుడు దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు.

ఎంత వర్షం పడాలో, వరదలు వస్తే అ వరదనీరు ఏ దారిగుండా పోవాలో, ఆ వరదను ఎన్ని దారుల గుండా బయటకు పంపాలో ఇవన్నీ ప్రకృతికి తెలుసు. కానీ మనవాళ్ళే ప్రాజెక్టులు మొదలైన వాటి పేర్లు చెప్పి ప్రకృతికి ఉన్న అన్ని దారులను మూసివేశారు. పైగా నదీగర్భాన్ని కూడా ఆక్రమించారు. ఏ నదైనా తన మార్గంలో అడ్డువచ్చిన వాటిని తనలో కలిపేసుకుని ముందుకుపోతుంది.....ఇక్కడ కూడా నది తన ప్రవాహ మార్గంలో అడ్డువచ్చిన అన్నిటిని తనలో కలుపుకుంటూ ముందుకుసాగిపోయింది. అక్రమంగా నిర్మించిన హోటళ్ళూ, ఊళ్ళూ, భవనాలు, వంతెనలు అన్ని నదీ ప్రవహాంలో కొట్టుకుపోయాయి. భారి నష్టం సంభవించింది. దీనికి కారకులు ఎవరు?............మనుష్యులే.                

Wednesday 26 June 2013

ఉత్తరాఖండ్‌లో కొండచర్యలు విరిగిపడడం వలన కూడా చాలా నష్టం సంభవించింది. అసలు ఆ ప్రాంతం కొండచర్యలు విరిగిపడడానికి కారణం ఎవరు?

ఉత్తరాఖండ్‌లో కొండచర్యలు విరిగిపడడం వలన కూడా చాలా నష్టం సంభవించింది. అసలు ఆ ప్రాంతం కొండచర్యలు విరిగిపడడానికి కారణం ఎవరు?

1) హిమాలయ పర్వతశ్రేణుల్లో ఉన్న ఉత్తరాఖండ్‌లో ఒక 50ఏళ్ళ క్రితంవరకు అక్కడి జనం ఆ ప్రాంతంలో ఉన్న వాతావరణానికి అనుగుణంగా రాగులను పండించేవారు. మార్కెట్‌లో వరికి పెరిగిన డిమాండు రీత్యా కానీ గత 40-30 సంవత్సరాల నుంచి వరి పండించడం మొదలుపెట్టారు. రాగులతో పోలిస్తే వరి వ్యవసాయానికి అధిక నీరు కావాలి. అది కూడా అందించారు. ఈ మారిన వ్యవసాయ పద్దతుల వల్ల అక్కడి భూమి పలుచబడింది. తన సహజ శక్తిని కోల్పోయింది.

2) ఒక 50 సంవత్సరాల క్రితం వరకు కేధార్‌నాధ్, బధ్రీనాధ్ వెళ్ళే యాత్రికులు అతి తక్కువగా ఉండేవారు. కానీ, ఈ మధ్య కాలంలో టూరిస్ట్ సంస్థల ప్రచారం వలన ప్రతి ఏడాది లక్షల మంది అక్కడికి వెళ్తున్నారు. ఇంత మంది జనం వెళ్ళడానికి కొండల వెంబడి రోడ్లు వేశారు. అది అసహజ రీతిలో, పర్వతాలను పేల్చివేసి, ప్రకృతికి విరుద్ధంగా. కొన్ని వందల ఏళ్ళ నుంచి మానవ సంచారం లేని ప్రాంతంలోకి కేవలం ఒక 6 నెలల వ్యవధిలో లక్షలమంది వెళ్ళడం, వారి ప్రయాణం కోసం రోడ్లు వేయడం, వాహన శబ్దాలు, వాటి తరంగాలు ఇవన్నీ ఆ ప్రాంతపు భూభాగంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించాయి. అక్కడి భూమిని పలుచుబరిచాయి.

3) వీటికి తోడు అక్కడ జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం కొండలను పేల్చివేశారు. అడవులను, చెట్లను నరికేశారు. చెట్లు మట్టి కొట్టుకుపోకుండా ఆపి భూసారాన్ని కాపాడుతాయి. చెట్లు, అడవుల నరికివేత వలన భూమి కోతకు గురైంది. మట్టి కోట్టుకుపోయింది. ఫలితంగా ఆ ప్రాంతంలో భూమి తన శక్తిని కోల్పోయింది. ఇక ఆ ప్రాంతంలో కొండలను పేల్చడం వలన, అవి అక్కడి పర్వతాల్లో అసహజమైన కదలికలను, మార్పులను తీసుకువచ్చాయి.  

ఇవన్నీ ఆ ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడడానికి దోహదం చేశాయి. అపార నష్టాన్ని కలిగించాయి. ఎలా చూసిన ఇవన్నీ పిచ్చిమానవుడి వెర్రి చేష్టలకు పలితాలే తప్ప ప్రకృతికి మనిషి మీద ఉన్న పగ కాదు. అసలు ప్రకృతికి మనిషి మీద పగ ఎందుకుంటుంది. మనమంతా ప్రకృతి మాత ముద్దుబిడ్డలం. మనమే ఈ విషయం మర్చిపోయి మన వినాశనాన్ని మనమే కోరి తెచ్చుకుంటున్నాం.  

Tuesday 25 June 2013

మనం మేల్కోవాలి. పర్యావరణాన్ని రక్షించాలి.

మనిషికి దురాశ పెరిగిపొయింది. ప్రకృతిని నిలువు దోపిడి చేసి సంపద పోగేయాలని చూస్తున్నాడు. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రకృతిని తన అదుపులో పెట్టుకునే శక్తి తనకు ఉందని చూసి పిచ్చి కలలు కంటున్నాడు. ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా ఎత్తులువేసిన పిచ్చి మనిషి తన వినాశనాన్ని తానే కోరి తెచ్చుకుంటున్నాడు. ఉత్తరాఖండ్‌లో జరిగింది కూడా అదే.

హిమాలయ పర్వతాల్లో అనేక నదులు ఉద్భవిస్తాయి. హిమనీనదులకు వేగం ఎక్కువ. పైగా అవి ఎత్తైన పర్వతప్రాంతాల మీది నుంచి లోయలగుండా ప్రవహించడం వల్ల సహజంగానే అవి మరింత వేగంగా ప్రవహిస్తాయి. ఇది జలవిద్యుత్ ఉత్పత్తికి తోడ్పడుతుందని, పైగా చిన్నతరహ జలవిద్యుత్ ప్రాజెక్టులతో పర్యావరణానికి మేలు చేస్తాయని అభిప్రాయంతో కేంద్రప్రభుత్వం తన ఇంధన విధానంలో భాగంగా జల విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం కల్పించింది. కానీ అందులో కొంతమాత్రం కూడా నిజం లేదు. ఇక సంపాదనే ధ్యేయంగా పనిచేసే ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలన్నీ అధిక లాభాల కోసం దేవభూమి ఉత్తరాఖండ్‌పైకి దండేత్తాయి. పుట్టగొడుగుల్లా జలవిద్యుత్ ప్రాజెక్టులు పుట్టుకొచ్చాయి.  

ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో  14 నదీలోయల వెంట చిన్న, పెద్ద కలుపుకుని 220కి పైగా జలవిద్యుత్, గనుల ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ఇవన్నీ కాకుండా కేంద్రం మరో 37 జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. మరో 70 ప్రాజెక్టులు ప్రాధమిక దశలో ఉన్నాయి.

ఒక అంచనా ప్రకారం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గంగా, యమున వంటీ ప్రధాన నదులతో పాటు వాటి ఉప్నదులన్నీ కలుపుకుంటే.....ప్రతి 5,6 కిలోమీటర్లకు ఒక జలవిద్యుత్ ప్రాజెక్టు ఉందని నిపుణులు అంటున్నారు.    

ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అడవులు నరికేయడం, రహదారులు, పవర్‌హౌజులు, పంపిణీ లైన నిర్మాణం తదిర చర్యల వల్ల భూమి కోతకు గురైంది. ఉత్తరాఖండ్‌లో అలకానంద, భగీరథీ నదుల పొడవులో 70% వరకు ప్రాజెక్టులే ఉన్నాయి. అందువల్ల నదీ ప్రవాహం 70% మేర సొరంగాలు గుండా సాగడం లేదా రిజర్వాయర్ల రూపంలో మారిపోవడం జరిగింది. ఇవి అక్కడి ప్రకృతి సమతుల్యాన్ని నాశనం చేస్తున్నాయి. పర్యావరణనికి, జీవవైవిధ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. అక్కడికి వాతావరణాన్ని మార్చేస్తున్నాయి.    

ఈ తరహాలో మనమూ, మన ప్రభుత్వాలు ప్రకృతి మీద చేస్తున్న దాడికి పడిన శిక్ష ఈ వరదలు. ఇప్పటికైనా మనం మేల్కోవాలి. పర్యావరణాన్ని రక్షించాలి.

Sunday 23 June 2013

~`~ సనాతన ధర్మంలో మనకు అనేకమంది దేవతలు కనిపిస్తారు. అసలు మనకు ఎంత మంది పరమాత్మలు ఉన్నారు?

~`~ సనాతన ధర్మంలో మనకు అనేకమంది దేవతలు కనిపిస్తారు. అసలు మనకు ఎంత మంది పరమాత్మలు ఉన్నారు?

ఉన్నది ఒక్కడే "ఏకో విశ్వస్య భువనశ్చ రాజాః"-ఋగ్‌వేదం 6.36.4 . నిరాకారుడు, నిర్గుణుడు, సత్ చిత్ ఆనంద స్వరూపుడు, అనంతుడు, సర్వాంతర్యామి, సర్వ శక్తిమంతుడు, సర్వ సమర్ధుడు, పరమాత్ముడు, పరబ్రహ్మమైన భగవంతుడు ఒక్కడే. కొన్ని కోట్ల సంవత్సరాల నుండి వేర్వేరు కాలాల్లో ఋషులకు, సిద్ధులకు, యోగులకు, జ్ఞానులకు, ఉపాసకులకు, భక్తులు మొదలైన వివిధరకాల వ్యక్తులకు వారివారి ఉపాసన స్థాయిని అనుసరించి భగవంతుడు అనేక రూపాల్లో దర్శనమిచ్చాడు.

ఇంకా వివరంగా చెప్పాలంటే వారి మనసు ఏ విధమైన రూపం మీద నిలబడుతుందో, వారి మనసు ఏ విధమైన రూపాన్ని సులువుగా పట్టుకుంటుందో, వారు పరమాత్ముడిని ఏ విధంగా ఊహించుకున్నారో ఆ విధమైన రూపంలోనే కనిపించాడు. 

మన సంస్కృతిలో అనేక సంవత్సరాలుగా అనేక మంది భగవంతుడిని చేరుకునే క్రమంలో ఆయన యొక్క విభిన్నమైన కోణాలను అనేక రూపాలుగా దర్శించారు. మనకు ఉన్నది ఒక్కడే భగవంతుడు. "ఏకో విశ్వస్య భువనశ్చ రాజాః"-ఋగ్‌వేదం 6.36.4 - ఈ సమస్త జగత్తుకు ఉన్న రాకు ఒక్కడే అని అర్దం. మనకు కనిపించే ఈ దేవతలంతా ఈ భగవంతుడి యొక్క ప్రతి రూపాలు, ప్రతి బింబాలు. అలా అని ఈ ప్రతి బొంబాలనే జీవితాంతం పూజిస్తూ ఉండమని సనాతన ధర్మం చెప్పలేదు. ఈ ప్రతిబింబాలైన సగుణ సాకార రూపాల మీద మనసు నిలిపి సాధనతో సర్వాతీతమైన నిరాకర రూపాన్ని దర్శించమని చెప్పింది. అందుకు మార్గాలను సూచించింది.

సైకాలజీ ప్రకారం మనకు ఏదైనా ఒక వస్తువు యొక్క రూపం గురించి కొంచం కూడా అవగాహన లేకపోతే మన మనసు దాని మీద నిలబడదు. అసలు దాని గురించి ఊహించుకోవడం కూడా అసాధయం. అందుకే ముందు మన మనసు ఒక చిన్న రూపం మీద నిలబడితే, అప్పుడు సాధాన ద్వారా పరుధుల్లేని పరమాత్ముడిని చేరుకోవచ్చు. అందరి ఇష్టాఇష్టాలు ఒకే రకంగా ఉండవు కనుక ఒక్కొక్కరి మనసు ఒక్కో రూపాన్ని హత్తుకుంటుంది. అందుకే మనకు వివిధ రూపాల్లో పరమాత్ముడు దర్శనమిస్తున్నాడు. అంటే మనం ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవడం కోసం దేవుడిని కూడా ఒక ఉపకరణంగా వాడుకుంటున్నాం. ఏ రూపాన్ని పూజించినా అన్ని వాడికే చేరుతాయి. మనం చేరేది వాడి దగ్గరకే.

Tuesday 18 June 2013

సరస్వతి నాగరికత : అసలైన భారత చరిత్రకు సాక్ష్యం

సరస్వతి నాగరికత(Sarawati Civilization) : అసలైన భారత చరిత్రకు సాక్ష్యం

సరస్వతి నాగరిక, సరస్వతి నది గురించి మన పుస్తకాల్లో కనిపించదు.

మనది(భారతీయులది) సింధు నాగరికత (Indus valley Civilization) అని, 3300 BC నుంచి 1500 BC కాలం వరకు వర్ధిల్లిందని, ఆ కాలంలో ఇక్కడ ప్రజలు వేరే మతం పాటించేవారని, శివుడుని, ఎద్దును పూజించేవారని చెప్తారు. 1800 BC కాలంలో భారతదేశం మీద ఆర్యులు(Aryans) దండయాత్ర చేసి, సిందూ నాగరికతను నాశనం చేశారని, వేదాలు ఆర్యుల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించాయని, ఆర్యుల చేతిలో ఓడిపోయిన వారు డ్రావిడులని(Dravidians), వాళ్ళు దక్షిణ భారతదేశంలో స్థిరపడ్డారని స్కూల్ పుస్తకాల్లో చరిత్రలో భోదిస్తారు.

మరికొందరు మరికాస్త ముందుకెళ్ళి, అసలు హిందు ధర్మం భారత దేశానికి సంబంధించినది కాదని, ఇక్కడ డ్రావిడులకు వేరే మతం ఒకటి ఉండేదని, అది నాశనం చేసి, దుర్గా పూజు, గోవు(ఆవు) పూజ మొదలైనవి భారతదేశంలోని ఆర్యులు చొప్పించారని వాదిస్తుంటారు. బ్రాహ్మణ క్షత్రియ ఆర్యవైశ్యులు అసలు భారతీయులే కాదని వాదిస్తారు మరికొందరు. మనం అదే చదువుకున్నాం. మన పిల్లలు కూడా అదే చదువుతున్నారు.  

వేదాల్లో చెప్పబడిన సరస్వతీ నది అసలు భారతదేశంలో లేదని, అదంతా కేవలం ఒక కల్పితమని, వేదాలు గొర్రల కాపర్లు పడుకున్న పిచ్చి పాటలని, కాలక్రమంలో వాటికి దైవత్వాన్ని ఆపాదించారని ప్రచారం చేస్తున్నారు. అసలు భారతదేశం మీద ఇతర దేశస్థులు వచ్చే వరకు ఇక్కడి ప్రజలు అనాగరికులని, బట్టలు కట్టుకోవడం కూడా రాని మూర్ఖులని చెప్తారు.

ఇదంత చదివిన తరువాత ఏ భారతీయుడి మనసైన చివుక్కుమంటుంది. ఆత్మనూన్యత భావం కలుగుతుంది. నిరాశ, నిస్పృహకు లోనవుతారు.  ఆత్మ గౌరవాన్ని కోల్పోతారు.

కాని ఇదంతా నిజం కాదు. ఇందులో నిజం లేదు. నిజానికి మన పిల్లలకు స్కూల్‌లో భోధిస్తున్న చరిత్ర, మనం చదివిన చరిత్ర అబద్దమని, అసత్యమని, అది నిరాధారమనదని చెప్పడానికి అనేక సాక్ష్యాలు దొరికాయి. వాటిలో ఒకటి సరస్వతి నది ఆనవాలు.

భారతదేశంలో సరస్వతినది ప్రవహించిందన్నది నిజమని, ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం తప్పని చెప్పుటకు సరస్వతి నది అనవాళ్ళూ ఒక మచ్చుతునక. వేల సంవత్సరాల భారతీయ చరిత్రకు సరస్వతీ నది ఒక సాక్ష్యం.

మరి అసలు నిజమేంటి?

అసలు లేదు అని ప్రచారం చేయబడిన సరస్వతీ నది భూమిపై ప్రవహించిందనడానికి కొన్ని ఋజువులు దొరికాయి. Michel Danino గారు సరస్వతి నది మీద అనేక పరిశోధనలు చేసి, పురాతన గ్రంధాలు, చారిత్రిక సాక్ష్యాలు, బ్రిటిష్ ప్రభుత్వపు అధికారిక పత్రాలు, పురావస్తు శాఖ Archaeological Survey of India వద్ద ఉన్న సమాచారం, రాజస్థాన్లో చెరువుల మీద చేసిన  Pollen Analysis,  Oxygen-Isotope ratios మీద జరిగిన పరిసోధనా వివరాలు,  Remote Sensing satellite చిత్రాలు మొదలైనవాటిని ఎంతో శ్రమతో సంపాదించి అనేక ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టారు. ఈ నది ఎండిపోవడానికి గల కారణాలు, నది ఏఏ ప్రాంతాల్లో ప్రవహించిందో వంటివి చిత్రాల్లో, మ్యాప్ రూపంలో చూపించే ప్రయత్నం చేశారు.        

4000 BCలో సరస్వతి నది  ఎండిపోవడం ప్రారంభయ్యిందని, ఎండిపోయిన సరస్వతీ నది గర్భం చిత్రాలు మొదలైనవి అత్యాధునిక  Satellite SPOT  ద్వారా బయటపెట్టారు ఫ్రెంచి శాస్త్రవేత్త, Henri Paul Franc-Fort.  

వీళ్ళ పరిశోధనల ప్రకారం ఋగ్‌వేదంలో ప్రస్తావించబడిన సరస్వతి నది దాదాపు 4000 ఏళ్ళ క్రితం వరకు ఈ భూమిపై ప్రవహించిందన్నది కాదనలేని సత్యం.

దీని తోడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO కూడా ఈ నది మూలాలు, ఉనికి గురించి కనుక్కునే ప్రయత్నం చేసింది. Indian Remote Sensing Satellite సమాచారం, Digital elevationతో కొన్ని చిత్రాలను విడుడల చేసింది.  Palaeo channels(నది యొక్క పాత ప్రవాహ మార్గం) ను కనుగొనె ప్రయత్నం చేసింది. Palaeo channelsతో పురాతన అనావాళ్ళను, చారిత్రిక ప్రదేశాలను,hydro-geological data ,drilling dataను పోల్చి చూసింది. సరస్వతీ నది భారతదేశానికి వాయువ్య దిశలో ప్రవహించిందని తేల్చారు.హరప్ప నాగరికతకు(Harappa Civilization) చెందిన కాలిబంగనన్(Kalibangan (Rajasthan)) వంటి ముఖ్యమైన ప్రదేశాలు, Banawali, Rakhigarhi (Haryana), Dholavira, Lothal (Gujarat), అన్నీ కూడా సరస్వతీ నది వెంబడి ఉన్నాయని నిర్ధారణకు వచ్చారు.  

సరస్వతీ నది ఎక్కడ, ఎప్పుడు ప్రవహించింది? దానికి ఋజువులేంటి?

సరస్వతి నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గర్హ్వాల్ ప్రాంతంలో హర్-లి-దున్ అనే గ్లాసియర్ వద్ద యమునా నదితో పాటూ ఉద్భవించి, ఉత్తరాఖండ్, హర్యాన, పుంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల మీదుగా ప్రవహించి 1500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గుజరాత్ రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలిసేది అని ఋజువైంది. అంటే పశ్చిమ/పడమర దిశగా ప్రబహించి అరేబియా సముద్రంలో కలిసేది(గంగ తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది). ఋగ్‌వేదంలోని 7వ మండలం ప్రకారం సరస్వతి నది పర్వతాల(హిమాలయాల) నుంచి కొండల ప్రాంతంగుండా ప్రవహిస్తూ సముద్రంలో కలిసేదని, అనేక మందికి జీవనాధరం అని చెప్పబడింది.

యమున, సరస్వతి కొద్ది దూరం సమాంతరంగా ప్రవహించిన తరువాత యమునా నది సరస్వతి నదిలో కలిసేది. యమునతో పాటు శతదృ(సట్లెజ్/Sutlej), హక్రా, ఘగ్ఘర్ మొదలైన నదులు హిమాలయల్లో జన్మించి, కొద్ది దూరం ప్రవహించి సరస్వతి నదిలో కలిసేవి. పూరాణాలు, ఆధునిక పరిశోధనలు రెండూ ఈ విషయాలను ధృవపరుస్తున్నాయి.

యమున, శతదృ నిత్యం నీటితో నిండి ఉండేవి. సరస్వతి నదీ ప్రవాహానికి అత్యధికంగా యమున, శతదృ(సట్లెజ్) నదులు నీరు అందించేవి. ఋగ్‌వేదంలో [10.75.5] సూక్తంలో భారతదేశంలో తూర్పు నుంచి పశ్చిమ దిశవరకు ప్రవహించే నదులు ప్రస్తావన ఉన్నది.

అందులో సరస్వతి, శతదృ, విపస(బీస్/beas), వితస(జేలం/jhelum), పరుషిని(రవి/ravi), అస్కిని(చీనబ్/cheenab), యమున, ద్రిషదవతి, లవణవతి మొదలైన నదులు ఉన్నాయి. కానీ కాలక్రమంలో ఈ నదులన్నీ తమ ప్రవాహ దిశను మార్చుకున్నాయి. వాటిలో సరస్వతీ, ద్రిషదవతి, లవణవతి నదులు ప్రస్తుతం కనుమరుగయ్యాయి.


సరస్వతి నది ఎండిపోవడానికి గల కారణాలు ఏమిటి?

భారతదేశంలో అనేకమందికి జీవనాధారమని,  అతి పెద్ద విశాలమైన నది అని సరస్వతి నది గురించి మన గ్రంధాల్లో కనిపిస్తుంది. సరస్వతినది మీద జరిగిన పరిశోధనల ప్రకారం నదీగర్భం 3 నుంచి 15 కిలోమీటర్ల వెడల్పు(width) కలిగి ఉంది. అంటే సరస్వతి 3 నుంచి 15 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉండేది.

సరస్వతీ నది గత 6000 ఏళ్ళ క్రితం ఎండిపోవడం మొదలైంది. మొదటగా నదిప్రవాహం తగ్గుతూ వచ్చింది. గత 4000 సంవత్సరాల క్రితం నాటికి ఈ భూమి పైనుంచి కనుమరుగయ్యిందని ఆధినిక పరిశోధనలు చెప్తున్నాయి.

సరస్వతీ నది ఎండిపోవడానికి కారణం భూమి యొక్క Tectonic Platesలో వచ్చిన మార్పులేనట. ఇదే సమయంలో సరస్వతి నదికి అత్యధికంగా నీరు అందించే ఉపనదులైన యమున, సింధు నదులు తమ ప్రవాహా మార్గాన్ని మార్చుకున్నాయి. యమునా నది పంజాబ్ ప్రాంతంలో సరస్వతీ నదీ ప్రవాహాన్ని తన ప్రవాహంలో కలిపేసుకుని గంగానదిలో కలవడం ప్రారంభమయ్యింది.

Tectonic Platesలో కలిగిన మార్పుల కారణంగా ఆరావల్లి పర్వతాలు పైకి జరిగాయి. దీని ప్రభావంతో వాయువ్య భారతంలో నదీ ప్రవాహాల్లో తీవ్రమైన మార్పు వచ్చింది. శతదృ(సట్లెజ్) పశ్చిమానికి తిరిగి విపస(బీస్), సింధు(ఇండస్) నదులలో కలవడం ప్రారంభించింది.

ఈ కారణాల చేత సరస్వతీ నది నీటి ప్రవాహం తగ్గుతూ వచ్చి, కొంతకాలానికి  భూమిపైన ప్రవహించకుండా భూమి అడుగు భాగంలో అంతర్వాహినిగా మారిపోయింది.


కేవలం భారత్‌లోనే కాదు, ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో నది తీరాల్లో వెలిసిన మరికొన్ని నాగరికతలు కూడా టెక్‌టొనిక్ ప్లేట్లలో కలిగిన మార్పుల వల్ల కొన్ని ధ్వంసం అవ్వగా, కొన్ని వైభవాన్ని కోల్పోయాయి.

సింధు నాగరికతలో(Sindhu/Indus Valley Civilization) సింధు నది పక్కన 30 పైగా చారిత్రాత్మిక స్థలాలను పురావస్తు శాఖ గుర్తించారు, కానీ సరస్వతి నదీ గర్భం వెంబడి దాదాపు 360 పైగా ముఖ్యమైన పురాతన ప్రదేశాలు ఉన్నాయి. మనం స్కూల్లో చదువుకున్న హరప్ప నాగరికత కూడా ఇందులో భాగమే.

ఆర్యులు భారతదేశం మీద దండయాత్ర చేసి డ్రావిడుల మీద యుద్ధం చేయడం వల్ల హరప్ప నాగరికత అంతం అవ్వలేదు. ఈ దేశంలో భౌగోళికంగా జరిగిన మార్పులు ప్రభావం వలన సరస్వతి నది ఎండిపోయింది. హరప్ప నాగరికత ముగియడానికి కారణం సరస్వతి నది ప్రవాహం ఆగిపోవడమే.

భారత్, పాకిస్థాన్, రొమానియ, US,UK  కు చెందిన శాస్త్రవేత్తల బృందం state-of-the-art Geoscience technology ని ఉపయోగించి హరప్ప నాగరికతగురించి కొన్ని విశేషాలను బయటపెట్టారు.  హరప్ప ప్రజలు అత్యంత అనుకూలమైన వాతావరణంలో జీవనం సాగించారాని, వాతావరణంలో కలిగిన మార్పుల కారణంగా అతివృష్టి, అనావృష్టి ఏర్పడి హరప్ప నాగరికత పతనం 4000 ఏళ్ళ క్రితం మొదలైందని తేల్చారు. 10,000 సంవత్సరాల క్రితం నుంచి ఆ ప్రాంతపు భూభాగంలో ఏర్పడిన మార్పులను పరిశీలించారు. గాడి తప్పిన ఋతుపవనాలు కూడా హరప్ప నాగరికతకు హాని చేసిందని నివేదిక ఇచ్చారు.
http://change.nature.org/2012/05/30/climate-change-in-the-news-whats-interesting-this-week/
http://www.patheos.com/blogs/drishtikone/2012/06/impact-of-climate-change-and-saraswati-river-study-and-analysis/

మరిన్ని ఆధునిక పరిశోధనలు కూడా సింధూ నాగరికత సరస్వతీ నది తీరం వెంబడి ఉన్నదేనని, వాతావరణ మార్పులు కారణంగా గందరగోళంగా తయారయ్యిందని చెప్తున్నాయి. ఈ మార్పుల కారణంగా హరప్ప ప్రజలు జీవం కోసం ఇతర ప్రదేశాలకు తరిలిపోయారు.  ఈ సమయంలో వీరు అత్యధికంగా గంగానది తీరం వైపు పయనించారు. ఈ సమయంలో వీరు అత్యధికంగా గంగానది తీరం వైపు పయనించారు. అంతేకానీ, డ్రావిడులను ఓడించిన ఆర్యులు వారిని దక్షిణ భారతదేశానికి పంపించి గంగా తీరంలో స్థిరపడ్డరనడానికి ఏ విధమైన ఆధారాలు లేవు.

ఇక సరస్వతి నది గురించి మన ఇతిహాసం మహాభారతంలో కూడా ప్రస్తావన ఉంది.

మహాభారతం 1.90.25.26 లో అనేక మంది మహారాజులు సరస్వతి నదీ తీరంలో యజ్ఞయాగాలు చేశారని ఉన్నది. సరస్వతి నది గర్భానికి దగ్గరలో ఉన్న హరప్ప నాగరికతలో భాగమైన కాలిబంగన్‌లో పురాతన యజ్ఞగుండాలు యొక్క అవశేషాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. యజ్ఞగుండాలు/ అగ్నిహోత్రాలు ఉన్నది ఒక్క వేద ధర్మలో మాత్రమే. హరప్పనాగరికత ప్రజలు హిందువులనడానికి ఇది ఒక్కటి సరిపోతుందేమొ.

మహభారతం జరిగి ఇప్పటికి 5150 సంవత్సరాలు గడించింది. మహాభారతం సరస్వతి నది ఎండిపోవడం గురించి ప్రస్తావిస్తూ వినాశన/ఉపమజ్జన మొదలైన ప్రాంతాల్లో సరస్వతినది కనిపించడం లేదని చెప్తోంది.

బలరాముడు సరస్వతి నదిలో యాదవుల చితాభస్మాన్ని కలిపి, ద్వారక నుంచి మధురకు ప్రయాణించాడని ఉంది.

అంతేకాదు మహాభారత సమయానికి సరస్వతీ నది ఎండిపోవడం ప్రారంభమయ్యింది. ఎంతో పవిత్రమైన సరస్వతినది ఎండిపోవడం తట్టుకోలేని బలరాముడు యుద్ధంలో పాల్గొనకుండా వైరాగ్యంతో సరస్వతీ నది తీరంలో ఉన్న అనేక పుణ్య క్షేత్రాల దర్శనం చేసుకున్నాడు. సరస్వతి నది 6000 ఏళ్ళ క్రితం నుంచి ప్రవాహం తగ్గిపోయి 4000 ఏళ్ళ క్రితం కనుమరుగయ్యింది. అది కనుమరుగవడానికి 1000 సంవత్సరాల ముందు పరిస్థితిని మహాభారతం వివరిస్తోంది.

సరస్వతి నది ఎండిపోవడానికి ఒక కారణం ద్వాపరయుగాంతం.

సాధారణంగా యుగాంతం అనగానే చాలామంది ప్రళయం వచ్చి ప్రపంచమంతా నాశనంవుతుందని అనుకుంటారు. కల్పం అంటే 4.32 బిల్లియన్ సంవత్సరాలు. కల్పాంతానికి సమస్త సృష్టి మొత్తం నాశనమవుతుంది. యుగాంతం జరిగి కొత్త యుగం ప్రారంభమయ్యే కాలంలో ప్రళయం రాదు కానీ, అనేక భౌగోళిక మార్పులు సంభవిస్తాయి.

ఒక యుగం అంతమై కొత్త యుగం ప్రారంభమయ్యే సమయంలో సంధికాలం అంటూ కొంత ఉంటుంది. యుగం అంతవమవ్వగానే ఒక్క సారే ప్రపంచంలో మార్పులు సంభవిస్తాయని చెప్పలేము. ఒక యుగం అంతమవ్వడానికి కొంతకాలం ముందు నుంచి కొత్త యుగం ప్రారంభమైన కొంత కాలం వరకు అనేక మార్పు చోటు చేసుకుంటాయి. యుగాంతంలో అత్యధిక జనాభా నాశనమవుతుంది.

8,64,000 సంవత్సరాల ద్వాపరయుగం 17 ఫిబ్రవరి 3102 BC లో ముగిసింది. దీనికి 36 ఏళ్ళ ముందు మహాభారతం అనే మహాప్రపంచయుద్ధం జరిగి ప్రపంచ జనాభ నాశనమైంది. అణుబాంబులు పడి అనేక నాగరికతలు ధ్వంసమయ్యాయి. ప్రపంచం మొత్తం ఈ యుద్ధంలో పాల్గొన్నది.

ద్వాపరయుగాంతం ప్రభావం చేత యుగాంతానికి ముందు సంధికాలంలో సరస్వతి నది ఎండిపోవడం ప్రారంభమైంది. ఇది ఒకట్టే కాదు, మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఇదే సమయంలో ప్రపంచంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. సుమేరియ నాగరికత 2200 BC కి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈజిప్ట్ రాజ్యం కూడా సరిగ్గా ఈ సమయంలోనే అంటే సంధికాలంలోనే వాతావరణ మార్పుల కారణంగా పతనమైంది. ఇక పచ్చని మైదాన ప్రాంతమైన సహార గత 4000 ఏళ్ళ క్రితం చోటు చేసుకున్న వాతావరణ మార్పుల కారణంగా ఏడారిగా మారిపోయింది. అన్నిటికంటే ముఖ్యమైనది, ద్వారక ద్వాపరయుగాంతం సమయంలోనే సముద్రంలో కలిసిపోయింది. ఈనాటికి అరేబియా సముద్రంలో ఉంది. ఇవన్నీ కూడా యుగాంతం ప్రభావమే. వాటిలో భాగమే సరస్వతి నది అంతర్ధానమవడం.

150 మిల్లీమీటర్ల కంటే అతి తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు కలిగిన జైసల్మర్ జిల్లాలో భూగర్భ జలాలు 40-50 మీటర్ల లోతులో అందుబాటులో ఉంటాయి. అక్కడ బావులు నిత్యం జలంతో కళకళలాడుతూ ఉంటాయి. ఎప్పుడు ఎండిపోవు. అక్కడున్న భూగర్భ జలాలను పరిశీలిస్తే  Tritium content  అతి తక్కువగా ఉంది. అంటే ఇవి ఈ కాలంలో నీటి సంరక్షణా చర్య్ల క్రింద నేలలో ఇంకిన నీరు కాదుట. Independent Isotope analyses మరియు Radiocarbon data  ప్రకారం ఇసుకతిన్నెల కింద ఉన్న ఈ మంచినీరు కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటివని తేలింది.

రాజస్థాన్‌లో మరికొన్ని ప్రాంతాల్లో జరిగిన పరిశోధనల్లో అక్కడ అందుబాటులో ఉన్న నీరు 4000-8000 ఏళ్ళ క్రితం నాటివని తేల్చారు. అసలు ఏడారి ప్రాంతంలో భూగర్భంలో మంచినీరు దొరకడమేంటని పరిశీలిస్తే ఈ నీరు వేల సంవత్సరాల క్రితం పవిత్ర భారతభూమిలో ప్రవహించిన సరస్వతి నది నీరని నిర్ధారణకు వచ్చారు. మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే రాజస్థాన్ ప్రాంతం ఏడారిగా మారిపోవడానికి కారణం సరస్వతీ నది ఎండిపోవడమే అని చెప్తున్నారు.

ఇలా నిర్ధారించడానికి కారణం లేకపోలేదు. వీళ్ళకు దొరికిన శుద్ధజాలాలన్నీ ఎండిపోయిన సరస్వతి నది గర్భం ఉన్న ప్రాంతంలోనివేనట. ఈరోజు శాస్త్రవేత్తలు కూడా రాజస్థాన్‌లో భూగర్భంలో ఉన్న సరస్వతీనది నీటిని వెలికితీసే ప్రయత్నంలో ఉన్నారు. ఇక్కడ భూగర్భంలో ఉన్న నది నీటిని పైకి తీసుకురావడం ద్వారా రాజస్థాన్ ప్రాంతంలో నీటి కరువును తగ్గిచవచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఆర్యులు భారతదేశం మీదకు 1800 BC లో దండయాత్రకు వచ్చారని, హిందూ సంస్కృతి వారిదేనని, వారు మధ్య ఆసియా, తూర్ఫు దేశాలకు చెందైనవారని ఒక వాదన ఉంది. కానీ ఆర్యులు దండయాత్ర సిద్ధాంతం(Indo-Aryan Invasion) ఎటువంటి చారిత్రిక ఆధారలు లేవు. అదే కాకుండా ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం తప్పని చెప్పడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. సరస్వతి నది కూడా అటువంటిదే.

సరస్వతినది ఋగ్వేదంలో చెప్పబడింది. హిమాలయ పర్వతాల్లో ఉద్భవించి పర్వతప్రాంతాల మీదుగా పాలవంటి స్వచ్చమైన ప్రవాహం కలిగి, తన ప్రయాణమార్గంలో మనుష్యులకు, పశువులకు జీవనాధారమైనదని ఉంది. సరస్వతి నది తీరంలో వెన్న, నెయ్యి మొదలైనవి పుష్కలంగా ఉండేవని, ఈ నది తీరంలో ఉన్న పశుసంపద గురించి కూడా ఋగ్‌వేదం చెప్తోంది. ఈ విధంగా సరస్వతి నది నిండుగా ప్రవహించింది 8000 సంవత్సరాల క్రితం మాత్రమే. 6000 క్రితమే సరస్వతి నది ప్రవాహంలో మార్పులు మొదలయ్యాయి.

కాసేపు పచ్చి అబద్ధమైన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం నిజం అనుకుందాం. ఆర్యులు భారతదేశం మీద దండయాత్రకు వచ్చింది 1800 BC లో. సరస్వతి నది 2000 BC నాటికి పూర్తిగా ఎండిపోయింది. 5000 ఏళ్ళ క్రితం జరిగిన మహాభారత యుద్ధం నాటికే కొన్ని ప్రదేశాల్లో నది ప్రవాహం కనిపించలేదు. అంటే ఆర్యులు భారతదేశం మీద దండయాత్రకు వచ్చే నాటికి సరస్వతినది అనేది ఈ భూమి మీద లేనేలేదు. వేదాలు వారివే అంటున్నారు కదా. మరి వేదాల్లో 8000 సంవత్సరాల క్రితం నది ప్రవాహం గురించి ఎలా ప్రస్తావించబడింది? దానితో పాటు ప్రవహించిన ద్రిషదవతి, లవణవతి గురించి వారికి ఏలా తెలిసింది. 2000 BC నాటికి సరస్వతి నది కనుమరుగయ్యింది కానీ అంతకు చాలాకాలం ముందే అది చిన్న పిల్లకాలువలాగా మారిపోయింది. ఒక వేళ ఇక్కడ ఒక నది ప్రవహించిందని ఆర్యులకు తెలిసినప్పటికి అది ఒక కాలువ అని మాత్రమే అనుకునేవారు. మిగితా నదులు తమ గమనాన్ని మార్చుకున్నాయి. ఆర్యులు దండయాత్ర సిద్ధాంతం నిజమే అయితే సరస్వతి నది సహజ రూపం, మిగితా భారతదేశ నదుల గురించి అసలు వేదాల్లో ప్రస్తావనే ఉండేది కాదు.

3300-1300 BC మధ్య భారతదేశపు వాయువ్యదిశలో సింధునాగరికత(Indus Valley Civilization) విలసిల్లిందని మనం చదువుకున్నాం. ఈ సింధు నాగరికత సింధు, హక్రా, గగ్గర్ నదులు పరీవాహిక ప్రాంతంలో ఉన్న ప్రపంచపు అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాధమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్ మరియు పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీశారు. ఇది మహారాష్ట్రలో కొంతప్రాంతం వరకు ఉండేదని కూడా తెలుస్తోంది. 126000 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించడం వల్ల ప్రపంచంలో పురాతన నాగరికతలలో అతి పెద్దదిగా చెప్తారు.

హరప్ప నాగరికతకు చెందిన అవశేషాలు దొరికిన తరువాత, హరప్ప, మొహంజిదారొ మొదలైనవన్నీ సింధూ-నాగరికతలో భాగం అని భావిస్తూ వచ్చారు. ఇక్కడ నివసించిన ప్రజలు ద్రావిడులనీ, ఇక్కడి నుంచే భారతదేశ చరిత్రను చెప్పడం ప్రారంభించారు.

కానీ రాజస్థాన్ భూగర్భంలో దొరికిన పురాతన సరస్వతినది అనావాళ్ళూ, సరస్వతినది భూగర్భం మీద జరిగిన పరిశోధనలు  భారతీయ చరిత్రను మరింత వెనక్కు తీసుకువెళ్తున్నాయి. సింధూ నాగరికత మొత్తం సరస్వతినాగరికతలో భాగం అని, వాతావరణ మార్పుల వల్ల ప్రజలు ఇతర నదుల వద్దక జీవనం కోసం తరలిపోయారని చెప్తున్నారు. సింధూ నాగరికతలోని చారిత్రక స్థలాలన్నీ సరస్వతినది గర్భం చుట్టుపక్కల ఉండడం ఈ వాదనను బలపరుస్తోంది. అందువల్ల భారతదేశంలో సరస్వతి-సింధు నాగరికత(Saraswati-Sindhu Civilization) విలసిల్లింది. ఇప్పటివరకు సింధూ నాగరికత ఒక 4000-5000 సంవత్సరాల క్రితం కాలానికి సంబంధించినదైతే, సరస్వతి సింధూ నాగరికత కనీసం 8000 సంవత్సరాల క్రితంది. ఆర్యుల దండయాత్ర సిద్ధంతాం ఒక కపోలకల్పన.

మరో విశేషమేంటంటే, సింధూ నాగరికత ప్రజలు చాలా తెలివైనవారు. భూగర్భ డ్రైనేజి(Under ground Drainage System), బహుళ అంతస్తుల భవనాలతో,  పెద్ద పెద్ద రోడ్లు మొదలైనవన్నీ వారి నగర నిర్మాణ(Town Planning) కళకు అద్దం పడుతున్నాయి. ఇవన్నీ అక్కడ దొరికిన అవశేషాల ఆధారంగా చరిత్రకారులు చెప్తున్నారు.  ఇవన్నీ కూడా సరస్వతి నాగరికతలో భాగమే. ఇంత గొప్ప పరిజ్ఞానం ఆ కాలంలోనే ప్రజలకు ఉంది.

 భారతదేశం 8000 ఏళ్ళకు పూర్వమే అపూర్వంగా, అద్భుతంగా వెలిగిపోయిందడానికి సరస్వతినది ఆనవాళ్ళు, సరస్వతి నాగరికత చిన్న ఉదాహరణలు మాత్రమే.

సరస్వతి నాగరికత(Sarawati Civilization)కు మతం రంగు పులిమారు

ఏ దేశస్తులైనా తమ దేశం గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఎంతో ఇష్టపడతారు. ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. చైనాలో 2000 ఏళ్ళ క్రితం నాటి ఒక పురాతన సమాధి బయటపడితే దాని గురించి బహుగొప్పగా ప్రపంచానికి చెప్పుకున్నారు చైనీయులు. కానీ మన దేశంలో 4000 ఏళ్ళ క్రితం వరకు ప్రవహించిన ఒక నది ఆనవాళ్ళు బయటపడి, మన దేశపు చరిత్రను తిరగరాసే అపూర్వమైన అవకాశం మనకు వస్తే మనం మాత్రం అసలు పట్టించుకోలేదు. ఇది మన 'దేశ భక్తి'. మన రాజకీయ నాయకులు సరేసరి.

భారతీయసంస్కృతి యొక్క వైజ్ఞానిక, చారిత్రిక సత్యాలను బయటపెట్టి, సనాతన వైదిక(హిందూ) ధర్మం యొక్క పురాతన వైభావాన్ని ప్రపంచానికి సరస్వతి నది ప్రపంచానికి చాటితే అది భారతీయులకు గర్వకారణం. భారతీయత ఈనాటి కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటిదని, ప్రపంచానికి కనీసం బట్టలు కట్టుకోవడం కూడా రాని సమయంలో ఈ దేశంలో అద్భుతమైన శాస్త్రీయ పరిజ్ఞానం ఉందని చెప్పుకోవడం కులమతాలకు అతీతంగా ప్రతి భారతీయుడికి ఎంతో గర్వంగా ఉంటుంది. కానీ నీచపు ఆలోచనలు కలిగిన మన రాజకీయ నాయకులు మన దేశపు కీర్తికి సంబంధించిన అంశానికి మతం రంగు పులిమారు.

మన దేశాన్ని అత్యధికంగా పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం, కొంత మంది చరిత్రకారులు భారతీయ చరిత్ర గుర్రాలమీద కత్తులు పట్టుకుని (ఎక్కడ నుంచో వచ్చారొ తెలియదు కానీ )ఈ దేశం మీద దండయాత్రకు వచ్చిన శ్వేతవర్ణపు ఆర్యులు ద్రావిడులని దక్షిణానికి వెళ్ళగొట్టడంతో మొదలైందని 'నమ్మిస్తు' వస్తున్నారు.

అంతకు ముందు ఈ దేశంలో ఏమి జరిగినా అదంతా కల్పితము, మూఢనమ్మకము మాత్రమేనట. ముఖ్యంగా హిందువుల విషయంలో ఏమి జరిగినా అది మాత్రం అసత్యమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. చరిత్ర కాస్త కఠినంగా ఉన్న దాన్ని ఈ రోజు కాకపోతే ఏదో ఒకరోజైన ఆధునిక 'సెక్యులర్' వ్యవస్థ ఎదుర్కోనాలి.

సరస్వతి అనేది ఒక మాతానికి సంబంధించిన దేవత పేరట(నిజానికి పరిశోధన సరస్వతి దేవి మీద కాదు, భారతీయ చరిత్రకు సరికొత్త నిర్వచనం ఇచ్చే సరస్వతినది మీద. సరస్వతి నది ఒక మతానికి కాదు ఈ భరతజాతికి సంబంధించినదన్న కనీసం జ్ఞానం కూడా పాలకులకు లేకుండా పోయింది.) . ఆమె పేరుతో జరిగే ఏ పరిశోధనలకు నిధులిచ్చినా అది మిగితావారి మనోభావలను దెబ్బతీస్తుందట. 'సెక్యులర్'భావాలకు అది భిన్నంగా ఉంటుందట. అందుకే అధికారంలోకి రాగానే 'సెక్యులరిసం' పేరుతో ఈ దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సరస్వతినదికి నిధులివ్వడం ఆపేసింది.        

సరస్వతి హెరిటేజ్ ప్రాజెక్టు

2003-04 లో అప్పటి బిజేపి-ఎన్‌డిఏ ప్రభుత్వంలో కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాక మంత్రి జగ్‌మోహన్ సరస్వతి హెరిటేజ్ ప్రాజెక్టును ప్రవేశపెట్టారు. ఋగ్‌వేదంలో చెప్పబడిన సరస్వతినది, హరప్ప నాగరికత పతనమవడానికి కారణమై, నేడు భూగర్భంలో ప్రవహిస్తున్న నది ఒకటేనని ఋజువు చేసేందుకు పూనుకున్నారు.

ఈ ప్రాజెక్టుకు జనసంఘ్, మిగితా హిందూ మరియు ఇతర చరిత్రకారులు దీనికి తమ మద్దతు తెలిపారు. నాస్తికులైన వామపక్షాలు, వామపక్ష చరిత్రకారులు హరప్ప నాగరికత ప్రాంతంలో ఒక నది ప్రవహించేదని ఒప్పుకున్నప్పటికి, అది సరస్వతి నదే అని పరిశోధించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికి ప్రాజెక్టు మొదలై 2003 నవంబరులో సాంస్కృతిక, పర్యాటక మరియు రవాణా శాఖకు చెందిన పార్లమెంటు స్టాండింగ్ కమిటి వివరాలు సేకరించింది. 2004లో కేంద్రంలో ప్రభుత్వం మారి, కాంగ్రెస్ పాలిత యూ.పి.ఏ. ప్రభుత్వం అధికారం చేపట్టగానే మొట్టమొదటగ సరస్వతి నది మీద భారత పురావస్తు శాఖ చేస్తున్న పరిశోధనకు నిధులు కేటయించడం ఆపేసింది. ఆ ప్రాజెక్టును అధికారికంగా రద్దు చేసింది. మైనారిటి ఓటు బ్యాంకు రాజకీయాలు, కమ్యునిస్టుల ఒత్తిడి, హిందూ వ్యతిరేక విధానాలు, ఇతర దేశాలు, మత సంస్థల ప్రోద్బలంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదేదో హిందువులకు మాత్రమే సంబంధించిన అంశంగా పరిగణించింది.

కానీ భారతీయులు అదృష్టవంతులేమో. అందుకే భారత పురావస్తు శాఖ సరస్వతి నది అంశంలో ఒక చక్కటి పరిష్కారం దొరికే వరకు పరిశోధన కొనాసాగించాలని భావించింది. ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికి తన పరిశోధన ఆపకుండా నిధుల కోసం ప్రాజెక్టు పేరు మార్చింది.

వానాకాలంలో హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజస్థాన్ మీదుగా అరేబియా సముద్రంలో కలిసే గగ్గర్ అనే నది పేరు పెట్టింది. వివిధ రాష్ట్రాల్లో రకరకాల పేర్లతో ఈ ప్రాజెక్టును కొనసాగిస్తోంది.

జాతి ప్రయోజనాలకంటే మన రాజకీయ నాయకులు స్వప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. తమ వాదన నెగ్గితే చాలు అనుకుంటారు. ఇందుకు ఉదాహరణ సరస్వతి హెరిటేజ్ ప్రాజెక్ట్‌కు నిధులను నిలిపివేసి దాన్ని రద్దు చేయడమే.  

Tuesday 4 June 2013

జూన్ 5, ప్రపంచ పర్యావరణ దినోత్సవం

పర్యావరణం అంటే మన చుట్టు ఉండే పరిసరాలు. మట్టి, గాలి, నీరు, చెట్లు, ఆకాశం ఇవన్నీ మన చుట్టూ ఉండే పర్యావరణంలో ఒక భాగం. మనం పీల్చడానికి పరిశుద్ధమైన గాలి, త్రాగడానికి శుద్ధమైన మంచి నీరు, పుష్టికరమైన ఆహారం, ఇవన్నీ అత్యవరసం. ఇవి లేకుండా ఏ జీవి జీవనం కొనసాగించలేదు. కానీ ఈరోజు మానవుడు అభివృద్ధి పేరుతో చేస్తున్న వినాశనం పర్యావరణాన్ని కలుషితం చేస్తోంది. పర్యావరణం కలుషితమైతే మన మానసిక, శారీరిక ఆరోగ్యం దెబ్బతింటుంది. స్వఛ్ఛమైన ఆక్సిజెన్ మెదడును చేరకపోతే మెదడుకు రక్తప్రసరణ సరిగ్గా జరగదు. మెదదుకు సరిగ్గా రక్తం అందకపఒతే, మెదడు పనితీరు దెబ్బతింటుంది. తద్వారా కొంతకాలాని మానసిక అభివృద్ధి కుంటుపడి, మానవసమాజం శాశ్వతంగా వెనుకబడుంది. ఈ విధంగా మన చుట్టు ఉన్న పర్యావరణంలో కలిగే ప్రతి మార్పు పరి జీవి మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.

పర్యావరణ పరిరక్షణ యొక్క అవశ్యకతను అందరికి చెప్పడం కోసం, పర్యావరణాన్ని అందరూ రక్షించాలనే స్పృహ కలిపించడం కోసం 1972 నుంచి ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుతోంది. ఇందులో దాదాపు 100 పైగా దేశాలు పాలుపంచుకుంటున్నాయి. పర్యావరణాన్ని కాపాడండి.

జూన్ 5, ప్రపంచ పర్యావరణ దినోత్సవం.               

Monday 3 June 2013

ఇంకుడు గుంతలు


ఇది సాధారణంగా సమాజంలో జరుగుతోంది. అజ్ఞానపు ఆలోచనలతో కూడిన ఆవేశంతో చేయాల్సిందంతా చేయడం, తరువాత మనం చేసిందానికి ఫలితం అనుభవించలేక బాధపడడం మాములుగా మారిపోయింది.

ఒక్క ఏడాది వర్షాకాలంలో మన మూడు సంవత్సరాల అవసరాలకు సరిపడా నీరు వర్షం ద్వారా భూమి చేరుతుంది. నలుగురు ఉండే 750-850 చదరపు అడుగుల ఇంటి పైకప్పు మీద ఒక వర్షాకాలంలో సగటున 75,000 నుంచి 90,000 లీటర్ల నీరు వర్షం ద్వారా పడుతుందట. దాన్ని శుద్ధి చేసి ఇతర అవసరాలకు వాడుకోవచ్చు. బయట ఒక ఒక లీటరు నీరు కొనాలంటే కనీసంలో కనీసం 10 రూపాయలైన అవుతుంది. నీటిని శుద్ధి చేసే యంత్రం ఖరీదు 10,000-15,000 ఉంటుంది. మనం ఈ నీటిని శుద్ధి చేసుకుని వాడుకోకపోగా వృధా చేస్తున్నాం. మన ఇంట్లో నీరు ఇంకడానికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే ఈ వర్షపు నీటిని అందులోకి మళ్ళించవచ్చు. తద్వారా బోరు ఎండిపోకుండా ఉంటుంది. అవసరమైతే భవిషత్తులో బోరు నీటిని రివర్సు ఆస్మోసిస్ పద్దతి ద్వారా శుద్ధి చేసి త్రాగడానికి వాడుకోవచ్చు.

కాని మనం ఏం చేస్తున్నాం? మన ఇంట్లో మట్టి కనిపిస్తే అదేదో పెద్ద పాపం అన్నట్టు మొత్తం సిమెంటు ప్లోరింగ్ వేయించేస్తున్నాం. ప్రభుత్వాలు కూడా రోడ్డుకు ఇరివైపులా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయకుండా మొత్తం సెమెంటు రోడ్లు వేయిస్తోంది. ఇప్పుడు పడ్డ వర్షపు నీళ్ళన్ని ఎక్కడో ఒక చోట నిలిచిపోయి ట్రాపిక్ జాం అవుతుంది. చివరకు ఈ నీరంతా డ్రైనేజిలో కలిసి ఎక్కడొ దూరంలో ఉన్న నదిలో కలుస్తుంది. జనానికి నీటి అవసరాలు తీర్చడం కోసం మళ్ళీ అదే నీటిని కొన్ని ప్రాంతాల్లో ఎత్తిపోతల పధకాల ద్వారా, కొన్ని ప్రదేశాల్లో మోటార్ల ద్వారా మళ్ళీ అదే నీరు మన ఇళ్ళు చేరడానికి సర్ఫరా చేస్తారు. దీనికి బోలుడంత విద్యుత్ వృధా.  దాదాపు మనమే వర్షపు నీటిని సరిగ్గా వాడుకోలేక సంవత్సరానికి అక్షరాలా 7 నుంచి 9 లక్షల రూపాయలు వృధా చేస్తున్నాం. దానికి తోడు ప్రభుత్వాలు మనకు నీటిని సర్ఫరా చేయడం కోసం వాడే విద్యుత్ ఖరుచును కలిపితే అది మరింత పెరుగుతుంది. అదే రాష్ట్ర వ్యాప్తంగా లెక్క చూస్తే ఎన్నో వందల కోట్ల రూపాయలు వృధా చేస్తున్నామో ఆలోచించండి. అదే దేశావ్యాప్తంగా అయితే ఇంకెన్ని కోట్లు అవుతుంది.

మనం ఒక్కసారి ఆలోచించాలి. మన దేశసంపదను వృధా చేసే హక్కు ఎవరికి లేదు. మన దేశానికి లాభం చేసే పనులు చేయకపోయినా సరే, నష్టం చేసే పనులు చేయకుండా ఉంటే చాలు.

వర్షాకాలం పూర్తిగా ప్రవేశించకముందే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయండి. దీనికి ప్రభుత్వం కూడా తగిన సహాయం అందిస్తోంది. దాన్ని సక్రమంగా వినియోగించుకోండి. వర్షపు నీటి ఒడిసిపట్టండి.

నీరు లేనేదే జీవం లేదు. నీటితోనే మన బ్రతుకు. నీరు లేక పోతే భవిష్యత్తు లేదు.  

Sunday 2 June 2013

సరస్వతి నాగరికత(Sarawati Civilization) : అసలైన భారత చరిత్రకు సాక్ష్యం-(3)

సరస్వతి నాగరికత(Sarawati Civilization) : అసలైన భారత చరిత్రకు సాక్ష్యం-(3)

సరస్వతి నది ఎక్కడ ఉద్భవించింది?

సరస్వతి నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గర్హ్వాల్ ప్రాంతంలో హర్-లి-దున్ అనే గ్లాసియర్ వద్ద యమునా నదితో పాటూ ఉద్భవించి, ఉత్తరాఖండ్, హర్యాన, పుంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల మీదుగా ప్రవహించి 1500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గుజరాత్ రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలిసేది అని ఋజువైంది. అంటే పశ్చిమ/పడమర దిశగా ప్రబహించి అరేబియా సముద్రంలో కలిసేది(గంగ తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది). ఋగ్‌వేదంలోని 7వ మండలం ప్రకారం సరస్వతి నది పర్వతాల(హిమాలయాల) నుంచి కొండల ప్రాంతంగుండా ప్రవహిస్తూ సముద్రంలో కలిసేదని, అనేక మందికి జీవనాధరం అని చెప్పబడింది.  

యమున, సరస్వతి కొద్ది దూరం సమాంతరంగా ప్రవహించిన తరువాత యమునా నది సరస్వతి నదిలో కలిసేది. యమునతో పాటు శతదృ(సట్లెజ్/Sutlej), హక్రా, ఘగ్ఘర్ మొదలైన నదులు హిమాలయల్లో జన్మించి, కొద్ది దూరం ప్రవహించి సరస్వతి నదిలో కలిసేవి. పూరాణాలు, ఆధునిక పరిశోధనలు రెండూ ఈ విషయాలను ధృవపరుస్తున్నాయి.  

యమున, శతదృ నిత్యం నీటితో నిండి ఉండేవి. సరస్వతి నదీ ప్రవాహానికి అత్యధికంగా యమున, శతదృ(సట్లెజ్) నదులు నీరు అందించేవి. ఋగ్‌వేదంలో [10.75.5] సూక్తంలో భారతదేశంలో తూర్పు నుంచి పశ్చిమ దిశవరకు ప్రవహించే నదులు ప్రస్తావన ఉన్నది.

అందులో సరస్వతి, శతదృ, విపస(బీస్/beas), వితస(జేలం/jhelum), పరుషిని(రవి/ravi), అస్కిని(చీనబ్/cheenab), యమున, ద్రిషదవతి, లవణవతి మొదలైన నదులు ఉన్నాయి. కానీ కాలక్రమంలో ఈ నదులన్నీ తమ ప్రవాహ దిశను మార్చుకున్నాయి. వాటిలో సరస్వతీ, ద్రిషదవతి, లవణవతి నదులు ప్రస్తుతం కనుమరుగయ్యాయి.

To be Continued.................