Thursday 15 January 2015

గోబ్బెమ్మలు

సంక్రాంతి,ధనుర్మాసం అనగానే మనకు ముందు గుర్తుకువచ్చేది గోబ్బెమ్మలు/గోబ్బిళ్ళు.చక్కగా ఉదయమే లేచి,ముగ్గులు వేసి,వాటికి అందంగా రంగులేసి,పరికిణిలువేసుకుని పాటలు పాడుతూ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతారు ఆడపిల్లలు.గోబ్బెమ్మ అంటే ఆవుపేడ ముద్ద.(మనం ఇప్పటికే పలుమార్పు చెప్పుకున్నాం భారతీయ గోపేడ విశిష్టత ఏమిటో.అందుకే మళ్ళీ ప్రస్తావించటంలేదు).ధనుర్మాసం మొదలుకొని సంక్రాంతి వరకు ప్రతిరోజు గోబ్బెమ్మలు పెడతారు."సంధిగోబ్బెమ్మ" అని ఒక తల్లిగోబ్బెమ్మను,రెండు పిల్ల గోబ్బెమ్మలను ఈ మాసంలో ఏదో ఒకరోజు పెట్టి పూజిస్తారు.


సుబ్బిగోబ్బెమ్మ సుబ్బినీయవే
తుమ్మిపూవంటి తమ్ముడినీయవే
చామంతి పూవంటి చెల్లినీయవే
మొగలిపూవంటి మొగుడినీయవే..............అంటూ కుటుంబసభ్యులను ప్రకృతిలో పూసే రకరకాల పువ్వులలో అందంలో వర్ణిస్తూ పాటలు పాడతారు.
"ఏల వచ్చేనమ్మ కృష్ణుడేల వచ్చెనే
మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనే
కడవలోన పాలు పెరుగు తాగిపోయనే......" అంటూ శ్రీ కృష్ణపరమాత్మకు సంబంధించిన పాటలు పాడుతూ గోబ్బెమ్మల చుట్టూ తిరుగుతారు.
పానకం,వడపప్పు(నానబెట్టిన పెసరపప్పు),పళ్ళు(ముఖ్యంగా ఈ ఋతువులో వచ్చేవి),గారెలు నైవేధ్యంగా సమర్పిస్తారు.స్త్రీలు పసుపుకుంకుమలు,తాంబులం,పండ్లు,పూవులు పంచిపెట్టుకుంటారు.ఈ విధంగా చాలా విధాలుగా పాటలుపాడుతారు.కులాలకు అతీతంగా స్త్రీలందరిని ఒక ప్రదేశంలో చేర్చడంలోనూ,వారి మధ్య ఐక్యతను పెంచడంలో ఇది సహాయపడుతుంది.

బతుకమ్మలాగానే గోబ్బెమ్మ కూడా గౌరిదేవి(పార్వతి దేవి)స్వరూపం.ధనుర్మాసం నెలంతా ఏ రోజుకారోజు ముగ్గుల మధ్యలో పెట్టిన గోబ్బెమ్మలను సాయంత్రం సమయానికి పిడకలుగా గోడకు కొడతారు.ఈ పిడకలమంటతో భోగిమంటలకు,రధసప్తమీ రోజున పాలుపోంగించడానికి,మాఘమాసం ఆదివారాలు శ్రీ సూర్యనారాయణ మూర్తికి పరమాన్నం వండడానికి ఉపయోగిస్తారు. బతుకమ్మ,గోబ్బెమ్మ సాక్షాత్ మహాగౌరి స్వరూపాలు.అందువల్ల ఎవరైన బతుకమ్మను,గోబ్బెమ్మను పూజిచవచ్చు.

No comments:

Post a Comment