18, జూన్ 2017, ఆదివారం

సద్గురు శివానంద మూర్తి గారి సూక్తిIf you have faith and sraddha, the divinity will respond. Darshan is the language of divinity.

- Satguru Sivananda Murthy Garu

నిజంగా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుందా?

ఒకరడిగారు. నిజంగా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుందా? లేక అలా చెప్తే భయపడి తప్పులు చేయరని ఆలోచిస్తున్నారా?


తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది. దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు. నన్నడిగా కన్నావా? కన్నప్పుడు భరించాలి అంటూ పిల్లలు అరవడం చూస్తుంటాము. అడిగి కనడం కాదు, వారిని తల్లిదండ్రులుగా నీవే ఎంచుకున్నావు. జీవుడు తను చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మలో తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని ఎంచుకుంటాడు. ఆ కుటుంబంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీశాపం తగులుతుంది. అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది. సర్పాలను చంపినప్పుడు సర్పశాపం, పితృదేవతలకు శ్రాద్ధం నిర్వహించనందువలన పితృశాపం సంక్రమిస్తాయి. వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండదు, ఉద్యోగాలు రావు, వచ్చినా అభివృద్ధి ఉండదు; సంతానం కలగదు, వ్యాపరంలో నష్టం మొదలైనవి వస్తాయి. ఇవన్నీ పూర్వీకులు చేసిన కారణంగా తర్వాతి తరం అనుభవిస్తుంది.

అలాగే గురుగ్రహం యొక్క అనుగ్రహం లేనప్పుడు పిల్లల జీవితంలో వృద్ధి ఉండదు. పిల్లలను చూసి తల్లిదండ్రులు బాధ పడతారు. నిజానికి అనుభవించేవారికంటే వారిని చూసేవారి బాధే అధికంగా ఉంటుంది. గురుధ్యానం ప్రపద్యామి పుత్ర పీడోపశాంతయే అని శాస్త్ర వాక్కు. గురు/బృహస్పతి ధ్యానం వలన సంతానం వలన కలిగే భాద తొలగుతుంది. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో పుట్టినప్పుడు, అతడు తన కర్మతో పాటు ఆ కుటుంబానికి చెందిన కర్మను కూడా స్వీకరిస్తాడు. అతడిపై దాని ప్రభావం ఉంటుంది.

కొన్ని ఉదాహరణలు - ఈ లోకంలో ఉండే అన్ని జీవుల్లో దత్తుడు ఉన్నాడు. తెలిసో తెలియకో ఇతరులను విమర్శించడం అంటే దత్తుడిని అవమానించడం, విమర్శించడమే. అది కూడా కొంత పాపాన్ని సమకూర్చిపెడుతుంది. అది కూడా గురుశాపానికి కారణమవుతుంది.

పచ్చని చెట్ల పై గురు ప్రభావం ఉంటుంది. పచ్చని మొక్కలు/చెట్లను నరికితే, అది జాతకంలో గురుదోషంగా కనిపిస్తుంది. కళ్ళముందే పిల్లలు మరణించడం,  స్త్రీ సంతానం ఉంటే వారు వైధవ్యం పొందడం వంటివి జరుగుతాయి. అదే పండ్లు, కాయలు, పుష్పాలతో ఉన్న చెట్లను నరికితే సంతానం కూడా కలగని సందర్భాలుంటాయి. అంటే ఆ పిల్ల పుటింట్లో కూర్చుని ఏడుస్తుంది, ఆమెను చూసి తల్లిదండ్రులు ఏడుస్తారు.దానికి కారణం ఆ బిడ్డ తల్లిదండ్రులు చేసిన పాపం. అందుకే పిల్లలు కలవారు పచ్చని చెట్లు కొడుతుంటే, 'పిల్లలున్న వాడివి, పచ్చని చెట్లు కొడుతున్నావ్, ఎంత తప్పు చేస్తున్నావో' అని పెద్దలంటారు.

భూములు లాక్కుంటారు. ముఖ్యంగా రాజకీయనాయకులు, బడా వ్యాపారవేత్తలు తమ అక్రమసంపాదనను సక్రమంగా చూపించడం కోసం పేద రైతులను మోసం చేసో, మరొక విధంగానో భూమలను ఆక్రమించుకుంటారు. వ్యవసాయం మీద పన్ను లేదు కనుక ఆ భూమిలో పండిన దానిపై వచ్చిన ఆదాయంగా తమ అక్రమసంపాదనను చూపి సక్రమం చేసుకుంటారు. ఒక కుటుంబంలోని వారికి ఒక భూమి వంశపారంపర్యంగా సంక్రమించినప్పుడు, దానికి పితృదేవతల అనుగ్రహం ఉంటుంది. భూమిని బలవంతంగా లాక్కుంటే, ఆ పితృదేవతలు ఏడుస్తారు. అది శాపంగా మారి లాక్కున వారి కడుపు కొడుతుంది. వారి పిల్లలు అకాల మరణం చెందుతారు, లేదా జీవచ్ఛవాలుగా మిగిలిపోతారు. దీనికి కారణం ఆ తల్లిదండ్రులు చేసిన పాపం. అసలు మనం ఒక భూమిని కొనాలన్నా, దానికి ముందు వెనుక బాగా ఆలోచించాలి. యోగులైతే ఒక భూమిని కొనెముందు పితృదేవతలను సంప్రదిస్తారు. మీరు ఉచితంగా ఇస్తానన్నా, వారు తీసుకోరు. ఎందుకంటే తమ వారసులు అనుభవించకుండా భూములు అమ్ముకోవడం పితృదేవతలకు ఇష్టం ఉండదు. విచిత్రం ఏమిటంటే మనదేశంలో ప్రభుత్వాలే భూములు లాక్కుంటాయి.

ఏ వ్యక్తి అయినా సంపాదించేది తన కోసం, తన పిల్లల కోసం. వారు బాగుండడం చూసి ఆనందించాలని అనుకుంటాడు. ఆ క్రమంలో అతడు అవినీతికి పాల్పడితే, ఇతరులకు ద్రోహం చేస్తే, వారి ఏడుపు వీరికి శాపంగా మారుతుంది. ఆ అవినీతి పరులు బాధపడేది వారి పిల్లలకు హాని కలిగినప్పుడే. అందుకే వారి పిల్లలు అకాలమరణాల పాలవుతారు.

ఇలా ఎన్నో రకాలుగా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుంది. కాబట్టి, తస్మాత్ జాగ్రత్త. 

17, జూన్ 2017, శనివారం

పార్వతీ మాత చాటిన మొక్క వైభవం - మత్స్యపురాణం నుంచి చిన్న కథదశపుత్రసమో ద్రుమః  

గణపతిని తన దేహపు మట్టి నుంచి ప్రాణం పోసి, ఆయన్ను గణాలకు అధిపతిని చేసిన తర్వాత, పార్వతీ మాత మరొక పుత్రుడు కావాలని సంకల్పించుకుంది. ఎంతో గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్న పార్వతీ మాత, ఒక చిన్న ఆశోక చిన్న మొక్కను నాటి, దాన్ని సొంత బిడ్డవలే సుకుమారంగా పెంచసాగింది. (మానవులకు ఆదర్శంగా నిలవడం కోసం). ఆ సమయంలో ఒకానొక రోజు దేవగురువైన బృహస్పతి, ఇంద్రుడు మొదలైన ఇతర దేవీదేవతలతో పార్వతీ మాత వద్దకు వచ్చారు. దేవర్షులు అమ్మవారితో 'దేవి! దయ చేసి చెప్పండి. ఓ భవానీ, మీరు సమస్త సృష్టి యొక్క క్షేమం కోసం అవతరించారు. ప్రపంచంలో చాలామంది పుత్రులను, పౌత్రులను (మనవళ్ళను) పొందడానికి ఇష్టపడతారు. పుత్ర సంతానం లేని చాలామంది (పుత్రుల కోసం) తపస్సు చేస్తారు. ఇప్పుడు మీరు ఒక మర్యాదను (కట్టుపాటును) లోకానికి చూపారు. కాబట్టి దేవీ, చెట్టును పుత్రుడిగా భావించడం వలన వ్యక్తికి కలిగే ఫలం ఏమిటి:' అప్పుడు ఆనందంతో నిండియున్న పార్వతీమాత మంగళకరమైన ఈ పదాలను పలికింది.

నీటి లభ్యత లేని చోట కూపము (బావి) తవ్వించిన సద్భుద్దిమంతుడు, ఆ పుణ్యఫలం కారణంగా ఆ బావిలో ఎన్ని నీటి బిందువులు ఉన్నాయో, అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటాడు. అలాగే వాపి (కొలను) తవ్వించడం 10 బావులు తవ్వించినదానికి సమానమైన పుణ్యం వస్తుంది. అదే చెరువు/ తటాకం తవ్వించడం వలన 10 కొలనులు తవ్వించిన పుణ్యానికి సమానమైన పుణ్యం వస్తుంది. ధర్మాన్ని, సంప్రదాయాన్ని పాటించేవాడు, పితృదేవతలకు వారి మరణానతరం తర్పణాదులు వదిలేవాడు, దేశానికి, ప్రపంచానికి, సమస్త లోకాలకు మేలు చేసే ఒక సత్పుత్రుడిని కనడం/ పెంచడం 10 చెరువులు తవ్వించినదానికి సమానమైన పుణ్యఫలాన్నిస్తుంది. అంటే కేవలం పుత్రులు ఉంటే సరిపోదు, వారు లోకానికి మేలు చేసేవారు కావాలి. అప్పుడు అతడు చేసే పుణ్యకర్మ పితృదేవతలను సైతం ఉద్ధరిస్తుంది. అదే ఒక చెట్టును నాటి, పోషించడం వలన 10 మంది ప్రయోజకులు, లోకానికి క్షేమం చేకూర్చేవారైన సత్పుత్రులను అందించిన పుణ్యఫలానికి సమానమైన పుణ్యం వస్తుంది. ఎందుకంటే చెట్టు జీవరాశికి ఎంతో మేలు చేస్తుంది. తన సమస్త జీవితాన్ని పరుల కోసమే వెచ్చిస్తుంది. తనకంటూ ఏదీ అట్టిపెట్టుకోదు. అందుకే లోకక్షేమం కోసం, ఇతరులు ఈ మార్గంలో నడవడానికి ప్రేరణగా నేనే ఈ మర్యాదను స్థాపించాను.  (In brief, 10 బావులు ఒక కొలనుకు సమానం. 10 కొలనులు 1 చెరువుకు సమానం. 10 చెరువులు 1 పుత్రునకు సమానం. 10 సత్పుత్రులు ఒక చెట్టుకు సమానం. అందుకే నేను మొక్కలు నాటి మానవుల కోసం గొప్ప మర్యాదను స్థాపించాను.)

మత్స్య పురాణం 154.506- 154.512 (దేవర్షులు - పార్వతి దేవి సంవాదం).

మాములుగా చెప్తే ఎలాగో నాటరు, కనీసం అమ్మవారు చెప్పిందనైనా మొక్కలు నాటండి. వాటిని పెంచి పోషించండి.  మగపిల్లలు లేరన్న చింతవద్దు, మొక్క నాటితే అది 10 మంది మగపిల్లలకు సమానం. ఎన్ని మొక్కలు నాటితే అంత పుణ్యం.